విజయవాడ హోటల్ లో గన్ తో నాలుగు రోజులుగా ఉన్న మరళి ఎవరు?
x

విజయవాడ హోటల్ లో గన్ తో నాలుగు రోజులుగా ఉన్న మరళి ఎవరు?

పోలీసులపై కాల్పుల యత్నం, దుండగుడు అరెస్ట్.. గన్ కల్చర్ ఛాయలు.


నాలుగు రోజులుగా మురళి అనే 22 సంవత్సరాల యువకుడు విజయవాడ నెహ్రూ ఆర్టీసీ బస్స్టాండ్ పక్కనే ఉన్న బాలాజీ హోటల్ లో ఎందుకు ఉన్నాడు? హోటల్ పై భాగంలో అద్దెకు రూము తీసుకుని ఏమి చేస్తున్నాడు? శనివారం ఉదయం కార్డెన్ సెర్చ్ లో భాగంగా పోలీసులు నిర్వహించిన తనిఖీల్లో ఈ యువకుడు గన్ తో ఎలా పట్టుబడ్డాడు? ఈ ప్రశ్నలకు విజయవాడ పోలీసుల వద్ద ప్రస్తుతానికి సమాధానాలు లేవు. అయితే పిస్టల్ తో ఓ యువకుడు విజయవాడలో పట్టుబడటం, పోలీసులపై కాల్పులు జరపటం చర్చనియాంశంగా మారింది.

ఆపరేషన్ ‘వజ్ర ప్రహార్’లో భాగంగా తనిఖీలు

రాష్ట్రవ్యాప్తంగా పోలీసులు, ఈగల్ టీమ్ ప్రత్యేక డ్రైవ్ చేపట్టాయి. తనిఖీల్లో తుపాకీతో మురళి అనే యువకుడు పట్టుబడ్డాడు. ప్రాథమిక విచారణలో మురళి వరంగల్‌లోని కొన్ని క్రిమినల్ కేసుల్లో నిందితుడిగా ఉన్నట్లు తెలుస్తోంది. అతడు హోటల్‌లో ఉండటానికి కారణాలు, ఇక్కడికి రావడానికి మూలాలపై పోలీసులు మరిన్ని వివరాలు సేకరిస్తున్నారు. ట్రిగ్గర్ నొక్కినా కాల్పులు జరగకపోవడంతో పెద్ద ప్రమాదం తప్పినట్లు అధికారులు తెలిపారు.

మూడు సార్లు పోలీసుల పైకి కాల్పులు

హోటల్ రూముల్లో పోలీసులు తనిఖీలు చేసే సమయంలో ఒక కానిస్టేబుల్ ఈ యువకుడు ఉన్న రూములోకి వెళ్లి సూట్ కేస్ చెక్ చేశారు. ఆ తరువాత బ్యాగ్ ను చెక్ చేసేందుకు తీసుకుంటుంటుండగా మురళి అనే యువకుడు బ్యాగ్ లాక్కుని అందులోని గన్ ను బయటకు తీసి కానిస్టేబుల్ పొట్టపై పెట్టి కాల్చాడు. తుపాకీ పేలలేదు. అప్పటికే కానిస్టేబుల్ పెద్దగా కేకలు పెట్టడంతో వేరే రూముల్లో తనిఖీలు చేస్తున్న సహచర పోలీసులు ఈ రూములోకి వచ్చారు. దీంతో బ్యాగ్ తీసుకుని మురళి అనే యువకుడు బస్టాండ్ కు పడమటి వైపున ఉన్న రైల్వే ట్రాక్ మీదకు పరుగులు తీశాడు. పోలీసులు ఈ యుకుడిని వెంబడించారు. ట్రాక్ పై నుంచి మరో రెండు సార్లు మురళి పోలీసులపైకి కాల్పులు జరిపాడు. ఆ రెండు సార్లు కూడా తుపాకీ పేలలేదు.

మూడో సారి ట్రాక్ పై నుంచి కాల్సి ఉంటే తప్పకుండా పోలీసులు చనిపోయే వారని సెర్చిలో పాల్గొన్న పోలీసులు తెలిపారు. పిస్టల్ లో మొత్తం ఎనిమిది రౌండ్లు ఉన్నాయని, ఆ యుకుడు బుల్లెట్ లు లేని వైపు నుంచి మూడు సార్లు కాల్చడంతో తాము ప్రమాదం నుంచి బయపడ్డామని పోలీసులు తెలిపారు. రైల్వే ట్రాక్ పైనే ఆ యువకుడిని పట్టుకున్న పోలీసులు తుపాకీని స్వాధీనం చేసుకుని పరిశీలించారు. అందులో ఐదు బుల్లెట్లు ఉన్నాయి. తుపాకీ మూడు రౌండ్లు కాల్చినప్పుడు తూటాలు లేని వైపు నుంచి రౌండ్స్ తిరగటంతో ఘోరం జరగకుండా ఆగిపోయినట్లు పోలీసులు చెప్పారు.

పోలీసుల అదుపులో నిందితుడు

అదుపులోకి తీసుకున్న పోలీసులు అతని వద్ద లభ్యమైన అడ్రస్ ప్రకారం వరంగల్ నగరం అని తేలింది. తాను బీహార్ కు చెందిన ఒక యువకుడితో ఉన్న పరిచయం మేరకు ఆ వ్యక్తితో కలిసి పాట్నా వెళ్లి పిస్టల్ కొనుగోలు చేసినట్లు పోలీసులు సేకరించిన సమాచారంలో ఉంది. బీహార్ కు చెందిన యువకుడు ఎవరు? ఎందుకు మురళి తుపాకీ కొనుగోలు చేశాడు? నాలుగు రోజులుగా విజయవాడలోని హోటల్ లోనే ఎందుకు ఉన్నారనే కోణంలో పోలీసులు విచారిస్తున్నారు.

పాట్నాలో పిస్టల్ కొనుగోలు

బీహార్ కు చెందిన ఒక యువకుడితో తెలంగాణలోని వరంగల్ కు చెందిన మురళి పరిచయం పెంచుకున్నాడు. బీహార్ యువకుని సాయంతో పాట్నాకు వెళ్లి పిస్టల్ కొనుగోలు చేసినట్లు పోలీసులకు మరళి చెప్పాడు. తనకు ఒక వ్యక్తిపై కక్ష ఉందని, ఆ వ్యక్తిని చంపేందుకు తుపాకీ కొనుగోలు చేసినట్లు నిందితుడు పోలీసులకు చెప్పినట్లు విశ్వసనీయ సమాచారం. అది నిజమే అయితే ఆ యువకుడు పోలీసులపై కాల్పులు ఎందుకు జరుపుతాడు? ఎందుకు తుపాకీతో పరారవుతాడు? పారి పోతూనే రెండు సార్లు పోలీసులపై తిరిగి కాల్పులు ఎందుకు జరుపుతాడు? విజయవాడలో నాలుగు రోజులుగా తుపాకీతో ఎందుకు ఉన్నాడు? పైగా ఆర్టీసీ బస్టాండ్ వద్ద బస్ లు బయటకు వెళ్లే దారిలో ఉన్న బాలాజీ హోటల్ ను ఎందుకు ఎంచుకున్నాడు? రైల్వే ట్రాక్ పైకి వెళ్లి మంగళగిరి వైపు పరారయ్యేందుకు ఎందుకు ప్రయత్నించాడు? అనే కోణంలో పోలీసుల విచారణ జరుగుతోంది. ఇతని టార్గెట్ లో ఎవరైనా పొలిటికల్ లీడర్లు ఉన్నారా? అనే కోణంలోనూ పోలీసులు దర్యాప్తు మొదలు పెట్టారు.

ఆంధ్రప్రదేశ్ పోలీస్ డిపార్ట్‌మెంట్ చేపట్టిన 'వజ్ర ప్రహార్' ఆపరేషన్ రాష్ట్రవ్యాప్తంగా మాదక ద్రవ్యాల నిర్మూలనకు లక్ష్యంగా ప్రారంభమైన ప్రత్యేక కార్యాచరణ. ఈ ఆపరేషన్ డ్రగ్ సప్లై నెట్‌వర్క్‌లను ధ్వంసం చేయడం, గంజా, బ్యాన్డ్ టబాకో వంటి నిషేధిత పదార్థాలను స్వాధీనం చేసుకోవడం, అక్రమ రవాణాను అరికట్టడం వంటి లక్ష్యాలతో సాగుతోంది. పోలీసులు, స్పెషల్ టీమ్‌లు కలిసి వాహనాల తనిఖీలు, కార్డన్ సెర్చ్ ఆపరేషన్లు, అవగాహనా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.

'వజ్ర ప్రహార్‌' కేసులు ఎప్పటి నుంచి నమోదయ్యాయి?

ఆంధ్రప్రదేశ్‌లో 'వజ్ర ప్రహార్‌' ఆపరేషన్‌ ఫిబ్రవరి 26, 2026 నుంచి ప్రారంభమైంది. ఈ ఆపరేషన్‌ ప్రత్యేక డ్రైవ్‌గా మాదక ద్రవ్యాల నిర్మూలనకు లక్ష్యంగా సాగుతోంది. ఫిబ్రవరి 26 నుంచి మార్చి 7 వరకు రాష్ట్ర వ్యాప్తంగా 69 NDPS (నార్కోటిక్ డ్రగ్స్ అండ్ సైకోట్రాపిక్ సబ్‌స్టాన్సెస్) చట్టం కింద కేసులు నమోదు చేసి అరెస్టులు జరుగుతున్నాయి. ఇందులో 65 మందిని అరెస్ట్‌ చేశారు, 12 వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసులు గంజా, బ్యాన్డ్‌ టుబాకో వంటి నిషేధిత పదార్థాల సరఫరా, రవాణాకు సంబంధించినవి. ఆపరేషన్‌ ద్వారా మరిన్ని అరెస్టులు, సీజర్లు జరుగుతున్నాయి.

విజయవాడలో గన్ కల్చర్ ఎంతవరకు నిజం?

విజయవాడలో గతంలో గన్ కల్చర్ ఉండేదని చాలా మంది అంటుంటారు. 2010లలో ఈ ధోరణి పెరిగిందని, ఉత్తరాంధ్ర ప్రాంతాల్లో గన్ ఉపయోగం ద్వారా హత్యలు, దోపిడీలు జరిగాయని పలు నివేదికలు చెబుతున్నాయి. 2014లో విజయవాడలో ఓ కిడ్నాప్ యత్నంలో గన్ ఉపయోగించిన సంఘటనలు జరిగాయి. రియల్ ఎస్టేట్, ఇతర వ్యాపారాల్లో పోటీల కారణంగా గన్ కల్చర్ వ్యాపించిందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అయితే, ఇటీవలి కాలంలో పోలీసుల కట్టుదిట్టమైన చర్యలతో ఇలాంటి సంఘటనలు తగ్గుముఖం పట్టాయి.

ఈ విషయంలో పోలీసులు సమాచారం ఇచ్చేందుకు నిరాకరించారు. విచారణ జరుగుతోంది. ఎందుకు వచ్చాడు? దీని వెనుక ఏముందనేది త్వరలోనే తేలుతుందని పోలీసులు చెబుతున్నారు.

ఈ ఆపరేషన్ ద్వారా డ్రగ్ సప్లై చైన్‌లను బ్రేక్ చేయడంతో పాటు, సమాజంలో అవగాహనా పెరుగుతోంది. నంద్యాలలో రూ.2 కోట్ల విలువైన గంజాను సీజ్ చేసి ఇద్దరిని అరెస్ట్ చేశారు. పోలీసులు మరిన్ని ఇంటెన్సివ్ చర్యలు చేపట్టాలని ప్రణాళికలు వేస్తున్నారు. ఇది రాష్ట్రంలో చట్ట వ్యవస్థను బలోపేతం చేయడంలో కీలక పాత్ర పోషిస్తోంది.

Read More
Next Story