
చిత్రావతి నదీ పరివాహక ప్రాంతంలో యధేచ్చగా ఇసుక తొవ్వకాలు
'చిత్రావతి'ని కుళ్లబొడుస్తున్న ‘ఇసుక వీరులు’ ఎవరు?
ఇసుక వ్యాపారుల దందాకి కళ్లెం వేసే నాధుడే లేడా అని రైతుల ఆవేదన
పుట్టపర్తి ప్రాంతానికి ఆయువుపట్టు లాంటి చిత్రావతి నదిని కొందరు వ్యాపారులు కుళ్లబొడుస్తున్నారు. ఉచితంగా ఇసుక తోలుకునే అవకాశం ఉందన్న పేరుతో నదిలో యథేచ్ఛగా ఇసుకను తోడేసి, ఇతర ప్రాంతాలకు తరలిస్తూ లక్షల రూపాయలు గడిస్తున్నారు. ఈ అక్రమ ఇసుక రవాణాను అడ్డుకోవాల్సిన ఇరిగేషన్, రెవెన్యూ, పోలీసు శాఖలు మాత్రం నిమ్మకు నీరెత్తినట్లుగా వ్యవహరిస్తున్నాయన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఫలితంగా సామాన్యులు తమ ఇళ్ల నిర్మాణాలకు అవసరమైన ఇసుక దొరకక ఇబ్బందులు పడుతున్నారు.
జిల్లాకు ఇసుక ఆధారం- చిత్రావతి...
చిత్రావతి నది కర్ణాటకలోని చిక్కబళ్ళాపురంలో పుట్టి, ఆంధ్రప్రదేశ్‌లోని అనంతపురం, వై.ఎస్.ఆర్. కడప జిల్లాల గుండా ప్రవహించి, పెన్నా నదికి కుడివైపు ఉపనదిగా గండికోట వద్ద కలుస్తుంది. పుట్టపర్తి పట్టణం, సత్యసాయి బాబా ప్రశాంతి నిలయం దీని ఒడ్డునే ఉన్నాయి.
పుట్టపర్తి ప్రాంతంలో ఇసుక అవసరాలను తీరుస్తున్న ప్రధాన వనరుల్లో చిత్రావతి నది ఒకటి. దాదాపు 100 కిలోమీటర్ల మేర ప్రవహించే ఈ నది ఇప్పుడు ఇసుక వ్యాపారులకు ‘కల్పతరువు’గా మారిందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రాత్రిపూట యంత్రాల సాయంతో నదిలో నుంచి ఇసుకను తోడి, ముందుగా తమకు అనుకూలమైన ప్రాంతాల్లో డంపు చేసి, తర్వాత అక్కడి నుంచి ఇతర ప్రాంతాలకు తరలిస్తున్నారని ఆరోపణలు ఉన్నాయి.
ఆదాయం బాగుండటంతో నదిలో ఎక్కడ ఇసుక మేట కనిపిస్తే అక్కడ తోడేయడమే పనిగా మారిందని గ్రామస్థులు చెబుతున్నారు. దీంతో నదిలో ఇసుక పూర్తిగా ఖాళీ అవుతూ, ఎటుచూసినా రాళ్లు, గుండ్లు దర్శనమిస్తున్నాయని అంటున్నారు.
చోద్యం చూస్తున్న అధికారులు...
ప్రభుత్వ నిబంధనల ప్రకారం సొంత అవసరాలకు తప్ప ఇసుకను వ్యాపార నిమిత్తం తరలించరాదు. అయితే గృహ నిర్మాణం పేరుతో ట్రాక్టర్లలో ఇసుక నింపుకుని, కొద్దిపాటి ఇసుకను సొంత స్థలాల్లో వదిలి, మిగిలిన వందల ట్రాక్టర్లను రాత్రిపూట ఇతర ప్రాంతాలకు తరలిస్తున్నారని ఆరోపణలు ఉన్నాయి.
ఈ అక్రమ రవాణాను అడ్డుకోవాల్సిన ఇరిగేషన్, రెవెన్యూ, పోలీసు శాఖల మధ్య సరైన సమన్వయం లేకపోవడంతో ఇసుక వ్యాపారం అడ్డూ అదుపూ లేకుండా సాగుతోందని సీపీఐ నాయకుడు కె. రామకృష్ణ విమర్శించారు.
రైతుల భూములకు ముప్పు
ఇసుక తవ్వకాల వల్ల నదిని ఆనుకుని ఉన్న వ్యవసాయ భూములు కోతకు గురవుతున్నాయని రైతులు వాపోతున్నారు. “మా పొలాల కింద ఇసుక తీస్తే భూములు కుంగిపోతున్నాయి. అధికారులకు ఫిర్యాదు చేసినా ఎలాంటి చర్యలు లేవు” అని పుట్టపర్తికి చెందిన రైతు గోరంట్లప్ప ఆవేదన వ్యక్తం చేశారు.
ఎనుములపల్లి, రాయలవారిపల్లి, కోవెలగుట్టపల్లి గ్రామాల రైతులు కూడా ఇదే సమస్యను ఎదుర్కొంటున్నారు. “ఇసుక తీయవద్దని అడిగితే ‘నది పబ్లిక్‌ది… మీకేం సంబంధం’ అంటూ వ్యాపారులు దౌర్జన్యం చేస్తున్నారు” అని వారు వాపోతున్నారు. ఇలాగే ఇసుక తవ్వకాలు కొనసాగితే పొలాల్లోని బోరు బావులు కూడా ఎండిపోయే ప్రమాదం ఉందని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
మాఫియాగా మారుతున్న ఇసుక వ్యాపారం
అమడగూరు, ఓడీ చెరువు మండలాల్లో ఎలాంటి అనుమతులు లేకుండా ఇసుక రవాణా సాగుతోందని స్థానికులు ఆరోపిస్తున్నారు. ట్రాక్టర్‌కు రూ.3 వేలు అదనంగా వసూలు చేస్తూ వాగులు, వంకలు, ఏరుల నుంచి యంత్రాల సాయంతో ఇసుకను తోడి, రహస్య ప్రదేశాల్లో నిల్వ చేసి, తర్వాత రాత్రిపూట రాష్ట్రం దాటించి తరలిస్తున్నారని చెబుతున్నారు.
మహమ్మదాబాద్ క్రాస్ ప్రాంతంలో దాదాపు 25 ట్రాక్టర్లతో అదే గ్రామానికి చెందిన కొంతమంది వ్యక్తులు ఇసుక మాఫియాగా మారారని చుట్టుపక్కల గ్రామాల ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
చర్యలు తప్పవని అధికారులు
ఈ వ్యవహారంపై తహసీల్దార్ రామనాథరెడ్డి స్పందిస్తూ- “సొంత అవసరాలకు మాత్రమే నదుల నుంచి ఇసుక తీసుకెళ్లేందుకు ప్రభుత్వ అనుమతి ఉంది. యంత్రాలు ఉపయోగించి ఇసుక తవ్వినా, వ్యాపార నిమిత్తం తరలించినా చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటాం” అని తెలిపారు.
చిత్రావతి నది కాపాడాల్సిన బాధ్యత ఎవరిది?
ఇసుక మాఫియా అడ్డుకట్ట వేయాల్సింది ఎప్పుడు? రైతుల భూములు, భూగర్భ జలాలు నాశనం అయ్యేలోపే ప్రభుత్వం, అధికారులు స్పందించాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.
.
Next Story

