
మనోబంధు ఫౌండేషన్ మేనేజింగ్ ట్రస్టీ రామకృష్ణంరాజు తదితరులు
ఒక్క ఫోన్ కాల్‌తో మారే జీవితాలకు ఆసరా మీరే!
మతిస్థిమితం లేని వారి జీవితాలకు 'మనోబంధు'
మీ ఇంట్లో లేదా మీ పరిసర ప్రాంతాలలో ఎవరైనా మతిస్థిమితం కోల్పోయి రూడ్లపై తిరుగుతున్నారా? ఎవరైనా నిద్రలో నడుచుకుంటూ వెళ్లిపోయి జాడ తెలియకుండా దిక్కులు చూస్తూ ఒంటరిగా నిలబడి చూస్తున్నారా? స్కిజోఫ్రీనియా వంటి మానసిక వ్యాధితో బాధ పడుతున్నారా? అటువంటి వారు కనిపించినపుడు మీరు చేయాల్సిందల్లా మనోబంధు ఫౌండేషన్ కి ఒక్క ఫోన్ కాల్ చేయడమే. వాళ్లు ఈ తరహా వ్యక్తులకు అండగా ఉంటారు. వారిని ఆస్పత్రిలో చేర్చడానికి సహకరిస్తారు. ఇదంతా నిజమేనా అని అనుకోవద్దు. నిజంగా నిజం.
మన దేశంలో, రాష్ట్రంలో కొన్ని వేల మంది ఈ తరహా మానసిక రుగ్మతలతో బాధపడుతున్నారు. ఆదరించేవారు లేక నిరాశ్రయులై రోడ్లపై తిరుగుతుంటారు. మురికినీళ్లు తాగుతూ, చెత్తకుండీలలోనే ఆహారం వెతుక్కుంటూ అత్యంత దారుణ పరిస్థితుల్లో బతుకుతున్నారు. వీరిలో స్త్రీలు, పురుషులు, యువతీ యువకులు, వృద్ధులు, పేదలు, మధ్యతరగతి వారు, ధనికులు కూడా ఉంటుంటారు.
వాస్తవం ఏమిటంటే వీళ్లందరూ మనకు నిత్యం కనబడుతున్నా "కనపడని మనుషులు" గానే మనం ట్రీట్ చేస్తుంటాం. అలాంటి వారికి చేదోడుగా ఉండడమే ఈ మనోబంధు ఫౌండేషన్ చేస్తున్న పని.
ఏమిటీ మనోబంధు...
మనోబంధు ఫౌండేషన్ 2021లో ఏర్పాటైంది. సమాజ సేవ పట్ల ఆసక్తి ఉన్న రామకృష్ణం రాజు లాంటి సహృదయులు పలువురు కలిసి ఈ సంస్థను ఏర్పాటు చేశారు. నిరాశ్రయ మానసిక రుగ్మతలో బాధపడుతున్న వారికి వెతికి, స్థానిక వైద్యశాలల్లో చేర్పించేందుకు నడుంకట్టారు. స్థానిక అధికారులు, వైద్యులు, ముసన్పిల్ సిబ్బంది, పోలీసు అధికారులు, స్వచ్ఛంద సంస్థల సహకారంతో ప్రతి ఒక్క బాధితుణ్ణి సురక్షితంగా ఆస్పత్రిలో చేర్పించడం వీళ్ల ధ్యేయం.
ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ లో చురుగ్గా పని చేస్తున్న ఈ సంఘం ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలోనూ సేవలు అందించేందుకు నడుంకట్టింది. అందులో భాగంగా ఫిబ్రవరి 7న బేగంపేటలోని జీవనజ్యోతి రీట్రీట్ సెంటర్ లో సన్నాహక సమావేశాన్ని ఏర్పాటు చేసింది. ఈ సమావేశానికి వివిధ రంగాలకు చెందిన పలువురు ప్రముఖులు, భూమిక, మహిత వంటి స్వచ్ఛంద సేవా సంస్థల ప్రతినిధులు, న్యాయవాదులు, జర్నలిస్టులు హాజరై చర్చలు జరిపారు. ప్రాధమిక కార్యాచరణ రూపొందించారు. ఓ సమన్వయ కమిటీని ఏర్పాటు చేయాలని నిర్ణయించారు.
తెలుగు రాష్ట్రాలలో మానసిక రుగ్మతలతో బాధ పడుతూ ఏ ఒక్కరూ రోడ్లపై తిరగకూడదన్న సంకల్పంతో ముందుకు సాగాలని తీర్మానించారు. సేవాస్ఫూర్తితో తాము చేపట్టిన ఈ కార్యక్రమానికి చేయూత నివ్వాలని మనోబంధు ఫౌండేషన్ మేనేజింగ్ ట్రస్టీ బి.రామకృష్ణం రాజు చెప్పారు. తమ ట్రస్టీలుగా ఉన్న వారిలో మాజీ ఐపీఎస్ సి.ఆంజనేయరెడ్డి, మాజీ ఐఎఎస్ అధికారులు అజేయకల్లం, డి. చక్రపాణి, మానసిన వైద్యులు డాక్టర్ ఇండ్ల రామసుబ్బారెడ్డి, డాక్టర్ భారత్ వత్వానీ ఉన్నారన్నారు.
ఆపదలో ఉన్న వారిని ఆదుకునేందుకు- మనోబంధు ఫౌండేషన్ నెంబర్ 9246563738, manobandufoundation@gmail.com ను సంప్రదించాలని కోరారు.
ఒక్క ఫోన్ చేయండి చాలు..
మన కళ్లముందే నడుచుకుంటూ పోతున్న ఆ బతుకులు ఎవరివో కావు … మన సమాజం విడిచిపెట్టిన మనుషులే. వాళ్లకు కావాల్సింది జాలి కాదు, ఒక చేయి, ఒక మాట, ఒక ఫోన్ కాల్. చెత్తకుండీల మధ్య మగ్గుతున్న ఆ జీవితాలను తిరిగి మనుషుల మధ్యకు తీసుకొచ్చే ప్రయత్నమే మనోబంధు. వాళ్ల పని- మనమెప్పుడో మరిచిపోయిన మానవత్వాన్ని గుర్తు చేస్తుంది. మనం చూపు తిప్పకపోతే, ఒక్కసారి ఆగి స్పందిస్తే, రోడ్లపై తిరుగుతున్న ఒక మనిషి జీవితం మళ్లీ మొదలయ్యే అవకాశం ఉంది.
Next Story

