
’ఆపదలో ఫోన్ ఎత్తని సేవలు ఎందుకు?‘ ప్రాణాలతో బయటపడిన ఓ యువతి ఆవేదన
100కు కాల్ చేస్తే నిశ్శబ్దం ఎదురవ్వడం, 108 స్పందించడానికి పదుల సంఖ్యలో కాల్స్ చేయాల్సి రావడం అత్యంత దారుణం.
’ఆపదలో ఫోన్ ఎత్తని సేవలు ఎందుకు?‘ ప్రాణాలతో బయటపడిన ఓ యువతి ఆవేదన
మార్కాపురం బస్సు ప్రమాదంలో ప్రాణాలతో బయటపడిన ఒక యువతి ఆవేదన: "ఆపదలో ఫోన్ ఎత్తని సేవలు ఎందుకు?"
’చుట్టూ మంటలు చుట్టుముడుతున్నాయి.. క్షణక్షణానికి ప్రాణాలు పోతాయన్న భయం వేస్తోంది. వణికిపోయే చేతులతో ఆశగా 100కు కాల్ చేస్తే ఎవరూ ఎత్తలేదు. ఇక లాభం లేదని 108కు ఫోన్ చేస్తే, ఏకంగా 20వ సారి ప్రయత్నించిన తర్వాత కానీ అవతలి నుంచి స్పందన రాలేదు. అసలు ఆపదలో ఉన్నప్పుడు ఆదుకోని ఈ అత్యవసర నంబర్లు ఎవరి కోసం?‘ ఇది మార్కాపురం బస్సు ప్రమాదం నుండి తృటిలో ప్రాణాలతో బయటపడిన ఒక యువతి స్థానిక ఎమ్మెల్యే కందుల నారాయణ రెడ్డి ముందు ప్రభుత్వాన్ని, సమాజాన్ని ఉద్దేశించి వేసిన కన్నీటి ప్రశ్న. ప్రమాద స్థలాన్ని పరామర్శించేందుకు వచ్చిన స్థానిక ఎమ్మెల్యే కందుల నారాయణ రెడ్డి ఎదుట ఆమె తన చేదు అనుభవాన్ని ఏకరువు పెడుతుంటే.. అక్కడున్న వారందరూ విస్తుపోయారు. 13 మంది నిండు ప్రాణాలు గాలిలో కలిసిపోయిన ఆ భయానక రాత్రి, ప్రభుత్వ యంత్రాంగం.. అత్యవసర సేవల వైఫల్యం ఏ స్థాయిలో ఉందో ఆ యువతి ఆవేదన అద్దం పడుతోంది.
అత్యవసర సేవలా? లేక 9 టూ 5 ఉద్యోగాలా?
ఆ భయానక రాత్రి ఒకవైపు 13 మంది సజీవ దహనమవుతూ మృత్యువుతో పోరాడుతుంటే.. మరోవైపు ప్రాణాలు కాపాడాల్సిన వ్యవస్థ ఎంత నిర్లిప్తంగా ఉందో బాధితురాలైన ఆ యువతి మాటల్లో స్పష్టమైంది. అత్యవసర నంబర్లు అంటే.. సెకన్ల వ్యవధిలో స్పందించాల్సినవి. కానీ ఈ వ్యవస్థలో పని చేసే సిబ్బంది దీన్ని ఒక సాధారణ 9 టూ 5 ఉద్యోగంలా భావిస్తున్నారా? అన్న అనుమానం ఇప్పుడు అందరినీ కలిచివేస్తోంది. ఆపదలో ఉన్న వారికి ప్రతి క్షణం ఒక యుగంలా అనిపిస్తున్న వేళ, సహాయం అందించాల్సిన వారే నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించడం వ్యవస్థలోని డొల్లతనాన్ని బయటపెట్టింది.
నిశ్శబ్దంగా 100. నిమ్మకు నీరెత్తిన 108
నైట్ బస్సులో మంటలు చెలరేగి ప్రయాణికులు హాహాకారాలు చేస్తున్న సమయంలో, ఆ యువతి వణికిపోయే చేతులతో పోలీసులకు (100) ఫోన్ చేసింది. కానీ ఒక్క కాల్ కూడా రిసీవ్ చేసుకోలేదు. ఇక ప్రాణాపాయ స్థితిలో ఉన్న వారిని ఆసుపత్రికి చేర్చాలనే ఆశతో 108 అంబులెన్స్ సేవలకు డయల్ చేస్తే, ఏకంగా 20వ సారి కాల్ చేసిన తర్వాత గానీ అవతలి నుంచి స్పందన రాలేదు. 100కు కాల్ చేస్తే నిశ్శబ్దం ఎదురవ్వడం, 108 స్పందించడానికి పదుల సంఖ్యలో కాల్స్ చేయాల్సి రావడం అత్యంత దారుణం.
గుండెపోటు వస్తే పరిస్థితి ఏంటి?.. యువతి సూటి ప్రశ్న
ప్రమాద స్థలాన్ని పరిశీలించి బాధితులను పరామర్శించిన ఎమ్మెల్యే కందుల నారాయణ రెడ్డికి ఆ యువతి తన గోడును వివరిస్తూ ఒక సూటి ప్రశ్న వేసింది. సార్.. ఆపదలో ఉంటేనే కదా మేము కాల్స్ చేసేది. ఒకవేళ గుండెపోటు వచ్చిన వ్యక్తి లేదా తీవ్ర రక్తస్రావం అవుతున్న వ్యక్తి 108కి కాల్ చేస్తే, వెంటనే లిఫ్ట్ చేస్తేనే కదా ప్రాణం నిలిచేది. ఇలా పదుల సార్లు కాల్ చేసే ఓపిక, సమయం ఆ బాధితుడికి ఎక్కడుంటుంది? అని ఆమె నిలదీసింది. అత్యవసర సేవల్లో పనిచేసే సిబ్బంది దీనిని బాధ్యతగా కాకుండా, కేవలం జీతం కోసం చేసే ఉద్యోగంలా చూస్తే అమాయకులు బలైపోవాల్సిందేనా అని ఆమె ప్రశ్నించడం అక్కడున్న వారందరినీ కంటనీరు తెప్పించింది.
వ్యవస్థలో లోపాలు కనిపిస్తున్నాయి
యువతి ఆవేదన విన్న ఎమ్మెల్యే కందుల నారాయణ రెడ్డి తీవ్ర విస్మయం వ్యక్తం చేశారు. ప్రభుత్వం కోట్ల రూపాయలు వెచ్చించి నడుపుతున్న ఈ అత్యవసర సేవలు సమయానికి అందకపోవడం క్షమించరాని నేరమని ఆయన పేర్కొన్నారు. మేము ఆపదలో ఉంటేనే కదా సార్ కాల్స్ చేసేది.. కనీసం ఫోన్ ఎత్తకపోతే మా పరిస్థితి ఏంటి? అని ఆమె అడిగిన ప్రశ్నకు ఎమ్మెల్యే చలించిపోయారు. అత్యవసర సేవల్లో ఇంతటి నిర్లక్ష్యం కూడదని, దీనిపై ఉన్నతాధికారులతో చర్చించి, కాల్స్ లిఫ్ట్ చేయని బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తానని ఆయన హామీ ఇచ్చారు.
వ్యవస్థ మారాలి.. బాధ్యత పెరగాలి
అత్యవసర నంబర్లు (Emergency Numbers) అంటే కేవలం ప్రకటనలకే పరిమితం కాకూడదు. రింగ్ అయిన వెంటనే కాల్ లిఫ్ట్ చేసేలా సాంకేతికతను, సిబ్బందిని మెరుగుపరచాల్సిన అవసరం ఉంది. సెకన్ల విలువ తెలిసిన వ్యవస్థే ప్రాణాలను కాపాడగలదు. ఒక కాల్ మిస్ అవ్వడం అంటే ఒక ప్రాణం పోవడమే అని ప్రతి సిబ్బంది గుర్తించినప్పుడే ఇలాంటి విషాదాల్లో బాధితుల రోదనలు అరణ్య రోదనలు కాకుండా ఉంటాయి.
Next Story

