
తీర ప్రాంతంలో అరుదైన ఖనిజ నిల్వలు
రేర్ ఎర్త్ కారిడార్‌తో ఏం జరుగుతుంది?
కేంద్ర బడ్జెట్లో రేర్ ఎర్త్ కారిడార్ ప్రకటనపై భిన్న స్వరాలు వినిపిస్తున్నాయి.
ఆంధ్రప్రదేశ్‌లోని 974 కి.మీల పొడవైన తీరరేఖను ఇప్పటివరకు అందమైన బీచ్‌లు, మత్స్యకార, నౌకాశ్రయాల కోణంలో మాత్రమే చూశారు. ఇప్పుడు అదే తీర ప్రాంతం భారతదేశ భవిష్యత్తును ప్రభావితం చేసే వ్యూహాత్మక ఖనిజ సంపదకు కేంద్రంగా మారుతోంది.
ఆంధ్రప్రదేశ్, ఒడిశా, తమిళనాడు, కేరళ రాష్ట్రాలతో కలిపి రేర్ ఎర్త్ కారిడార్ ఏర్పాటుకు సహకారం అందించేందుకు కేంద్రం ముందుకొచ్చింది. దీనివల్ల బీచ్ శాండ్ వంటి అరుదైన ఖనిజాల తవ్వకాలు, వాటి శుద్ధి తదితరాల్లో కీలక అధ్యాయానికి తెరలేచింది. వీటి తవ్వకాలకు పెద్ద ఎత్తున ప్రోత్సాహం అందించనుండడంతో రాష్ట్రంలో మైనింగ్ రంగంలో కంపెనీల స్థాపన ద్వారా పెట్టుబడులు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఇవి ఉపాధి అవకాశాలను పెంచుతాయి. ప్రభుత్వానికి కూడా ఆదాయం సమకూరనుంది.
తీర ప్రాంతంలో అరుదైన ఖనిజ నిల్వలు
రేర్ ఎర్త్ నిల్వలు ఎక్కడెక్కడున్నాయి?
ఆంధ్రప్రదేశ్‌కు సుమారు వెయ్యి కిలోమీటర్ల పొడవున సుదీర్ఘ తీర ప్రాంతం ఉంది. శ్రీకాకుళం నుంచి కృష్ణా జిల్లా వరకు సముద్ర తీర ప్రాంతంలో 16,600 హెక్టార్ల పరిధిలో 211 మిలియన్ టన్నుల బీచ్ శాండ్ నిల్వలున్నట్టు అంచనా. రేర్ ఎర్త్ నిల్వలు భీమునిపట్నం, కళింగపట్నం, కాకినాడ, నర్సాపురం, మచిలీపట్నం, చీరాల తీరప్రాంతాల్లో ఎక్కువగా ఉన్నాయి. వీటిలో మోనజైట్, ఇలిమినైట్, రూటైల్, గార్నెట్, సిలిమనైట్, జిర్కాన్ వంటి అరుదైన ఖనిజాలున్నాయి. ఇలిమినైట్, రూటైల్ నుంచి టైటానియం ముడి ఖనిజ మెటీరియల్ వస్తుంది. దానిని శుద్ధి చేస్తే టైటానియం ఆక్సైడ్ పిగ్మెంట్లు వస్తాయి. ఇక మోనజైట్‌లో రేడియో ధార్మికత కలిగిన థోరియం కంటెంట్ ఉంటుంది. దీని నుంచి భూ అయస్కాంత ఖనిజం వస్తుంది. ఈ భూ అయస్కాంత ఖనిజాన్ని ఎలక్ట్రానిక్ వస్తువులు, సెన్సర్లు, రాకెట్ల తదితర వాటిలో వినియోగిస్తారు.
ఇదంతా ఖర్చుతో కూడిన ప్రక్రియ..
బీచ్ శాండ్ తవ్వకాలు జరపడం, వాటి నుంచి వివిధ ఖనిజాలను వేరు చేసి, శుద్ధి చేసి విలువ జోడించే ప్రక్రియ చాలా ఖర్చుతో కూడుకున్న పని. ఇలాంటి అరుదైన ఖనిజాలు లభించే లీజులను కేవలం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వరంగ సంస్థలకు మాత్రమే కేటాయిస్తారు. ఆ సంస్థలతో కలిసి ప్రైవేటు సంస్థలు కూడా వీటిలో పెట్టుబడులు పెట్టి భాగస్వాములవుతారు.
మూడు ప్రాంతాల్లో రేర్ ఎర్త్ లీజులు..
ప్రస్తుతం రాష్ట్రంలో శ్రీకాకుళం జిల్లా గార మండలంలో 909.86 హెక్టార్లలో రెండు లీజులు, విశాఖపట్నం జిల్లా భీమునిపట్నంలో 90.15 హెక్టార్లలో ఒక లీజు కలిపి మొత్తం వెయ్యి హెక్టార్లలో మూడు లీజులను కేంద్ర ప్రభుత్వం ఏపీఎండీసీకి గతంలో కేటాయించింది. ఇందులో ఏపీఎండీసీతో కలిసి అదానీ సంస్థకు చెందిన అల్లువియల్ హెవీ మినరల్స్ లిమిటెడ్ సంస్థ ఖనిజాల తవ్వకాలు, సెపరేషన్, ప్రాసెసింగ్ ప్రకియకు మైన్ డెవలపర్ అండ్ ఆపరేటర్‌గా ఎంపికైంది. త్వరలోనే అక్కడ తవ్వకాలు చేపట్టనుంది.
30 శాతం మోనజైట్ నిల్వలు ఏపీలోనే..
దేశంలో ఉన్న మొత్తం మోనటైజ్ నిల్వల్లో దాదాపు 30 నుంచి 35 శాతం ఏపీలోనే ఉంది. ఇవి దేశీయ అవసరాల్లో సగానికి పైగా అవసరాలను దశాబ్దాల పాటు తీర్చగలవని అంచనా వేస్తున్నారు. ఇప్పటివరకు అణు నిబంధనలు, ప్రాసెసింగ్ సామర్థ్యాల లోపం, విధాన పరిమితుల వల్ల ఈ సంపద పూర్తిగా వినియోగంలోకి రాలేదు. కానీ చైనా ప్రపంచ రేర్ ఎర్త్ ఎలిమెంట్స్ ప్రాసెసింగ్ సామర్థ్యంలో దాదాపు 85 శాతం నియంత్రిస్తున్న నేపథ్యంలో సరఫరా గొలుసు వైవిధ్యానికి భారత్ ప్రయత్నాలు వేగం పెంచింది. ఈ అవకాశాన్ని గుర్తించిన ఏపీ ఖనిజాభివృద్ధి సంస్థ (ఏపీఎండీసీ) బీచ్ ఇసుక మైనింగ్ ప్రాజెక్టులను పునరుద్ధరించింది.
ఏపీలో రేర్ ఎర్త్ ప్లాంట్లు ఎక్కడెక్కడ?
ప్రభుత్వ రంగ సంస్థ ఇండియన్ రేర్ ఎర్త్ లిమిటెడ్ (ఐఆర్ఈఎల్) నెల్లూరు జిల్లా గూడూరులో 10 వేల టన్నుల సామర్థ్యంతో మోనజైట్ ప్రాసెసింగ్ ప్లాంటును ఏర్పాటు చేస్తోంది. ఇది 2026 నాటికి ప్రారంభం కానుంది. ఇంకా విశాఖపట్నంలో బాబా అణు పరిశోధనా కేంద్రం (బార్క్) క్యాంపస్‌లో రేర్ ఎర్త్ పర్మనెంట్ మాగ్నెట్ (ఆర్ఈపీఎం) ప్లాంట్ ద్వారా స్వదేశీ సాంకేతికతతో మాగ్నెట్లను ఉత్పత్తి చేస్తున్నారు. విశాఖపట్నంలో ఆర్ఐఈఎల్ ప్లాంట్ ఏర్పాటు కానుంది. ఇది దేశీయంగా సమారియం, కోబాల్ట్ మాగ్నెట్లను ఉత్పత్తి చేయనుంది.
రేర్ ఎర్త్ ఖనిజాల వినియోగం వీటిలోనే..
ఈ ఖనిజాలు ఎలక్ట్రిక్ వాహనాలు, క్లీన్ ఎనర్జీ, సెమీ కండక్టర్లు, విండ్ టర్బైన్స్, ఏరోస్పేస్, స్మార్ట్ ఫోన్లు, కెమెరాలు, క్షిపణులు తదితర డిఫెన్స్ పరికరాల తయారీలో ఈ భూ అయస్కాంత ఖనిజాలే కీలకం. అందువల్ల చైనా తదితర దేశాల నుంచి వీటి దిగుమతిని తగ్గించుకోవడంలో భాగంగా కేంద్ర ప్రభుత్వం తాజాగా రేర్ ఎర్త్ కారిడార్ ఏర్పాటు నిర్ణయం తీసుకుంది.
కేంద్ర ఇంధనశాఖ మాజీ కార్యదర్శి ఈఏఎస్ శర్మ
ప్రైవేటు, కార్పొరేట్ సంస్థల మేలుకేః ఈఏఎస్ శర్మ..
రేర్ ఎర్త్ కారిడార్ వల్ల ప్రైవేటు, కార్పొరేట్ సంస్థలకే ఎక్కువ మేలు జరుగుతుంది. తీరప్రాంతంలో నివశిస్తున్న సంప్రదాయ మత్స్యకారుల హక్కులను విస్మరిస్తూ దేశ భద్రతకు విరుద్ధంగా బీచ్ శాండ్‌లో ఉన్న అణుధార్మిక ఖనిజాలను వెలికితీసి అమ్ముకునే హక్కును కల్పిస్తుండడం బాధాకరం. ఇప్పటికే ఆ హక్కును శ్రీకాకుళం జిల్లా గార, విశాఖ జిల్లా భీమిలి వద్ద లీజులను అదానీ కంపెనీకి సమర్పించింది. మైనింగ్ కార్యకలాపాలు చేపట్టే ముందు ఆయా తీరప్రాంత మత్స్యకారులతో ముందస్తు సంప్రదింపులు చేయాలన్న చట్ట నిబంధనను సడలించడం తగదు. మత్స్యకారులను సంప్రదిస్తే దేశ భద్రతకు ముప్పు వస్తుందా? మత్స్యవనరులకు, మత్స్యకారుల జీవనోపాధికి నష్టం కలిగించే అదానీ కంపెనీ మైనింగ్ కార్యకలాపాలు అంతరాయం లేకుండా లాభాలు కల్పించడమే లక్ష్యంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఉమ్మడిగా నిర్ణయాలు తీసుకోవడం అన్యాయం’ అని కేంద్ర ఇంధనశాఖ మాజీ కార్యదర్శి ఈఏఎస్ శర్మ ‘ద ఫెడరల్ ఆంధ్రప్రదేశ్ ప్రతినిధి’తో చెప్పారు.
ఆంధ్ర విశ్వవిద్యాలయం జియాలజీ ప్రొఫెసర్ యుగంధరరావు
పెట్టుబడులు, ఉపాధి అవకాశాలు మెరుగు..
‘ఆంధ్రప్రదేశ్ సహా మరో మూడు రాష్ట్రాల్లో రేర్ ఎర్త్ కారిడార్ ఏర్పాటును స్వాగతించాలి. రేర్ ఎర్త్ కారిడార్‌తో ఆంధ్రప్రదేశ్‌లోని తీర ప్రాంతంలో పెట్టుబడులతో పాటు ఉపాధి అవకాశాలు మెరుగవుతాయి. ఏపీలో రేర్ ఎర్త్ ఎలిమెంట్స్ యూనిట్లు నాలుగు వరకు ఏర్పాటు కావచ్చు. రేర్ ఎర్త్ ఖనిజాల తవ్వకాలు, ప్రాసెసింగ్ వంటి యూనిట్ల ఏర్పాటుతో స్థానికులకు ఉపాధి లభిస్తుంది. బ్లాకుల వారీగా తవ్వకాలు జరుపుతారు కాబట్టి పర్యావరణానికి కూడా ఏమంత ఇబ్బంది ఉండదు. స్థానిక మత్స్యకారుల జీవనోపాధికి ఇబ్బంది లేకుండా ఎంపిక చేసిన ప్రాంతాల్లో ఈ అరుదైన ఖనిజాల తవ్వకాలు చేస్తారు’ అని విశాఖలోని ఆంధ్ర విశ్వవిద్యాలయం జియాలజీ ప్రొఫెసర్ యుగంధరరావు ‘ద ఫెడరల్ ఆంధ్రప్రదేశ్ ప్రతినిధి’కి వివరించారు.
Next Story

