
నీ కులమేంటి? నీ బతుకేంటి? ఎలా వ్యాపారం చేస్తావో చూస్తాం?
సొంత టీడీపీ పార్టీ నేతలే తన ఆస్తులు బలవంతంగా రాయించుకుని తన కుటుంబాన్ని రోడ్డున పడేశారని సురేంద్ర కన్నీటి పర్యంతమయ్యాడు.
25 ఏళ్లుగా అదే కంపెనీలో నమ్మకంగా పనిచేశాను..పార్టీ కోసం సొంత డబ్బు ఖర్చు పెట్టి జెండా మోశాను. కానీ, నేను సొంతంగా వ్యాపారం చేస్తూ ఎదుగుతుంటే చూసి ఓర్వలేకపోయారు. నీ కులమేంటి? నీ బతుకేంటి? మా దగ్గర తింటూ మాకే ఎదురు తిరుగుతావా? అంటూ కులం పేరుతో దూషించి, నా ఆస్తులన్నీ లాక్కుని, నన్ను, నా కుటుంబాన్ని రోడ్డున పడేశారని ప్రకాశం జిల్లా టంగుటూరుకు చెందిన టీడీపీ కార్యకర్త కారుమంచి సురేంద్ర కన్నీరుమున్నీరయ్యారు. శుక్రవారం విజయవాడ ప్రెస్‌క్లబ్‌లో తన భార్యతో కలిసి మీడియా ముందుకు వచ్చిన ఆయన, టీడీపీ నేతలు, పోలీసులు కుమ్మక్కై తన కుటుంబాన్ని ఎలా వేధించారో వివరించారు.
రూ. కోటి విలువైన పొగాకుపై యజమానుల కన్ను
సురేంద్ర ప్రగతి టొబాకో ట్రేడర్స్ కంపెనీలో అకౌంటెంట్‌గా పని చేస్తూనే, సొంతంగా పొగాకు వ్యాపారం ప్రారంభించారు. ఆయన వద్ద ఉన్న 50 టన్నుల పొగాకు నిల్వలను తక్కువ ధరకు ఇవ్వాలని కంపెనీ యజమాని కామని బాల మురళీ మోహనకృష్ణ ఒత్తిడి చేశారు. దానికి సురేంద్ర నిరాకరించడంతో.. ’ తక్కు కులం వాడివి, నీ బతుకెంత? నువ్వు వ్యాపారం ఎలా చేస్తావో చూస్తాం‘ అంటూ బహిరంగంగానే బెదిరింపులకు దిగారని బాధితులు కన్నీటి పర్యంమయ్యారు.
ఖైదీలా కిడ్నాప్..గన్‌తో బెదిరించి సంతకాలు
గతేడాది ఆగస్టు 28న చర్చల పేరుతో పిలిపించి, పోలీసులు సురేంద్రను అక్రమంగా నిర్బంధించారు. సీఐ పాండురంగారావు తనను విపరీతంగా కొట్టారని, హైదరాబాద్‌లో చదువుతున్న తన పెద్ద కుమార్తె జీవితాన్ని నాశనం చేస్తామని బెదిరించారని సురేంద్ర ఆవేదన వ్యక్తం చేశారు. ఎస్పీ ఏఆర్ దామోదర్, డీఎస్పీ సాంబశివరావు ఆదేశాలతో పోలీసులు తన ఇంటిపై దాడి చేసి రూ. 40 లక్షల నగదు, 400 గ్రాముల బంగారం, ఆస్తి పత్రాలు బలవంతంగా లాక్కున్నారని ఆరోపించారు. గన్‌తో బెదిరించి ఖాళీ చెక్కులపై, ఆస్తి పత్రాలపై సంతకాలు చేయించుకున్నారని వివరించారు.
రోడ్డున పడ్డ కుటుంబం.. సీఎం స్పందిస్తారా?
తన కష్టార్జితమైన ఫ్లాట్లు, కార్లు, పొగాకు స్టాక్ అంతా టీడీపీ నేతలు తమ పేర్ల మీద రాయించుకుని, తనపైనే అక్రమ కేసులు బనాయించి జైలుకు పంపారని సురేంద్ర వాపోయారు. జైలు నుంచి వచ్చాక ముఖ్యమంత్రి చంద్రబాబుకు లేఖ రాశాను.. కానీ స్పందన లేదు. పార్టీ కోసం పనిచేసిన నాకే ఇలాంటి అన్యాయం జరిగితే సామాన్యుల పరిస్థితి ఏంటి? అని ప్రశ్నించారు. చంద్రబాబు, లోకేష్, పవన్ కళ్యాణ్ తక్షణమే స్పందించి తనకు న్యాయం చేయాలని, దోచుకున్న తన ఆస్తులను తిరిగి ఇప్పించాలని ఆయన వేడుకున్నారు.

