
జగన్, చంద్రబాబుకు ఇచ్చిన ప్లాన్ బీ- మవిగన్- ఏమిటీ?
మవిగన్ అంటే జగన్ గుర్తుకు వస్తాడనుకుంటే మీ ఇష్టం వచ్చిన పేరు పెట్టుకోవచ్చు..
"అమరావతికి ఎవ్వరూ వ్యతిరేకం కాదు.. సాధ్యమవుతుందా.. కాదా అనేది ప్రతీ ఒక్కరూ ఆలోచించాలి" అన్నారు వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్ జగన్. బుధవారం విజయవాడలో మాట్లాడిన వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అమరావతిపై చంద్రబాబు కుట్రలు, కుతంత్రాలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. తాను పెట్టిన మూడు రాజధానులను కాదన్న చంద్రబాబు.. కనీసం తాను ఇచ్చిన ప్లాన్ బీ ని పట్టించుకోవాల్సిందన్నారు.
హైదరాబాద్, చెన్నై, బెంగళూరు లాంటి మెట్రో నగరాలతో పోటీపడాలంటే, మనకు కూడా ఒక గ్రోత్ ఇంజిన్ ఉండాలని ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్‌గా విశాఖపట్నం పెట్టాలనుకున్నాం. ఇందులో స్వార్థం లేదు, ఆచరణాత్మక ధోరణే ఉందన్నారు. ప్రభుత్వం మీద, ప్రజల మీద అప్పులు భారం మోపకుండా ఆలోచన చేశామని వైఎస్ జగన్ తెలిపారు. అదే సమయంలో తన ప్లాన్-బీని కూడా మీడియాకు వివరించారు.
‘అమరావతి పేరుతో దోపిడీ చేయడమే చంద్రబాబు ప్లాన్. దోపిడీ నుంచి డైవర్షన్ కోసమే అసెంబ్లీలో తీర్మానం చేశారు. అంతఖర్చును తట్టుకోగలమా?. ప్రజలను పెడదోవ పట్టించడం ఎందుకు?. ఇలా చేస్తే రాష్ట్రానికి రాజధాని ఎప్పుడు అవుతుంది?. రాజధానే లేని పరిస్థితి ఉంటుంది: రూ.2 లక్షల కోట్ల ఖర్చును తట్టుకునే స్తోమత రాష్ట్రానికి ఉందా?. అందుకే రాష్ట్రంలో ఇతర ప్రాంతాలను రోడ్డున పడేయకూడదని మేము అనుకున్నాం. కానీ ఇప్పుడు అచ్చంగా అదే జరుగుతోంది" అని జగన్ అన్నారు.
MAVIGUN ప్లాన్ ఇదే..
"పోనీ మేం ప్రాక్టికల్‌గా చేసిన ఆలోచన చంద్రబాబుకు నచ్చలేదు సరే. ప్లాన్-బీ కింద అయినా మేం చెప్పిన ప్లాన్ గురించి చంద్రబాబు ఆలోచించలేదు. మచిలీపట్నం to విజయవాడ, విజయాడ to గుంటూరు 40 కి.మీ. ఈ మొత్తం 110 కి.మీ హైవే ఇప్పటికే ఉంది. ఈ హైవేకు అటు, ఇటు క్యాపిటల్ కారిడార్ కింద డిక్లేర్ చేస్తే గ్రోత్ ఇంజిన్ తయారవుతుందని చెప్పాం. మచిలీపట్నంలో MA, విజయవాడలో VI, గుంటూరు నుంచి GUN తీసుకోండి. MAVIGUN అని పేరుపెట్టి క్యాపిటల్ ఏరియాగా డిక్లేర్ చేయండి. నేను చెప్పిన మావిగన్ పేరులో గన్ అంటే జగన్ గుర్తుకువస్తాడనుకుంటే మీ ఇష్టం వచ్చిన పేరు పెట్టుకోండి. స్కాంలు చేసే బదులు, కట్టే ఆ బిల్డింగులేవో ఇక్కడ కట్టండని సలహా ఇచ్చాం. అది చేస్తే రూ.1,90,000 కోట్లు మిగులుతాయి కదా?. అమరావతిలో పెట్టాలనుకుంటున్న డబ్బులో 10% ఇక్కడ పెడితే బాగుంటుంది కదా అని సూచించాం." అన్నారు.
మచిలీపట్నంలో MA, విజయవాడలో VI, గుంటూరులో GUN ఈ మూడు కలిస్తే, MAVIGUN ఆనే గ్రోత్ కారిడర్ ఏర్పడుతుంది. ఈ సలహా కూడా ఇస్తే దాన్ని కూడా పట్టించుకోలేదు. విజయవాడ- దాని చుట్టుపక్కల ఇప్పటికే 20 లక్షల జనాభా ఉంది. గుంటూరులో మరో 10 లక్షల జనాభా ఉంది, మచిలీపట్నంలో మరో 3-4 లక్షల జనాభా ఉంది. అదొక మహానగరంగా, గ్రోత్ ఇంజిన్‌గా ఎదుగుతుంది కదా? అని చెప్తే అది కూడా చంద్రబాబుకు నచ్చలేదు. దీనికన్నా లక్ష ఎకరాల్లో రాజధాని, దాంట్లో బేసిక్ ఇన్‌ఫ్రా కోసమే రూ.2 లక్షల కోట్లు పెట్టడానికి వెళతానంటున్నాడు. అసాధ్యమని తెలిసి కూడా, తన స్కామ్‌ల కోసం, తన బినామీల భూముల రేట్లు కోసం పోతానంటున్నాడు. సంక్షేమాన్ని, అభివృద్ధిని పూర్తిగా గాలికి వదిలేసి, రాష్ట్రాన్ని అంధకారంలోకి, అప్పుల ఊబిలోకి నెట్టే ప్రయత్నం చేస్తున్నాడు అని జగన్ ఆరోపించారు.
Next Story

