అసలేంటీ ఫార్మ్ 17సీ.. ఇందులో ఏముంటుంది..
ఫార్మ్ 17సీ వివాదం సుప్రీంకోర్టుకు వెళ్లింది. ఫార్మ్ 17సీని ప్రకటించాలని ప్రతిపక్ష నేతలు, ఏడీఆర్ సంస్థ డిమాండ్ చేస్తుంటే.. ఈసీ మాత్రం ససేమిరా అంటోంది. ఎందుకు.
దేశమంతా ప్రస్తుతం చర్చిస్తున్న అంశం ఫార్మ్ 17సీ. ఒక పోలింగ్ కేంద్రంలో ఎన్ని ఓట్లు పడ్డాయి అని చెప్పే ఈ ఫార్మ్‌ను బహిర్గతం చేసేలా ఎన్నికల సంఘాన్ని ఆదేశించాలని కోరుతూ కొందరు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్‌ను సుప్రీంకోర్టు స్వీకరించి.. దీనిపై అభిప్రాయం తెలిపాలని ఈసీని కోరింది. కాగా ఈ పిటిషన్‌ను ఎన్నికల సంఘం తీవ్రంగా ఖండించింది. ఆ వివరాలను బయటపెడితే.. అది కూడా లోక్‌సభ ఎన్నికల సమయంలో ఇతర ప్రాంతాల్లో జరిగే పోలింగ్‌పై ఈ ఫార్మ్ 17సీ ప్రభావం తీవ్రంగా ఉంటుందని, కాబట్టి తాము ఎట్టిపరిస్థితుల్లో ఫార్మ్ 17సీను ఎన్నికల సమయంలో బహిర్గతం చేయమని కరాఖండిగా చెప్పేసింది ఈసీ.
ఈ నేపథ్యంలోనే ఫార్మ్ 17సీ అంశాన్ని కోర్టు సెటిల్ చేసేసిందన్న ఎన్నికల సంఘం వ్యాఖ్యలను సుప్రీంకోర్టు కొట్టిపారేసింది. ఈ అంశంపై కోర్టు ఇంకా తన తీర్పు వెల్లడించలేదని సుప్రీంకోర్టు బెంచ్ స్పష్టం చేసింది. అయితే పొత్తం ఎన్ని ఓట్లు పోల్ అయ్యాయి అన్న వివరాలతో పాటు ఫార్మ్ 17సీని కూడా బహిర్గతం చేయాలని కోరుతూ టీఎంసీ నేత మహువా మొయిత్రా, ఏడీఆర్(అసోసియేషన్ ఫర్ డిమొక్రాటిక్ రిఫార్మ్) అనే ఓ గ్రూప్ పిటిషన్ దాఖలు చేశాయి. కాగా ఇప్పుడు లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో ఇదే అంశంపై వారు మధ్యంతర పిటిషన్ దాఖలు చేశారు. దానిపైనే కోర్టులో విచారణ జరుగుతోంది. ఈ క్రమంలోనే అసలు ఈ 17సీ ఏంటి అన్న సందేహం ప్రజల్లో మెదులుతోంది. మరి అదేంటో తెలుసుకుందాం..
అసలు వివాదం ఎందుకు మొదలైంది
ఎంతో పారదర్శకంగా ఎన్నికలు నిర్వహించి ప్రజలు ఎన్నికున్న పార్టీని అధికారంలోకి తీసుకెళ్లి ప్రజాస్వామ్యాన్ని కాపాడే బాధ్యత ఈసీది. కానీ ఇప్పుడు ఆ ఈసీనే కోర్టు ముందు వివరణ ఇచ్చుకునే పరిస్థితి నెలకొంది. అందుకు ఈసీ ప్రకటించిన పోలింగ్ పర్సంటేజ్‌లే కారణం. గతంలో ఎప్పుడు పోలింగ్ జరిగినా పోలింగ్ పూర్తయిన తర్వాత 48 గంటల లోపు ఎన్నికల సంఘం ఎంత శాతం ఓట్లు నమోదయ్యాయి అనే సమచారాన్ని ప్రకటిస్తుంది. తద్వారా కౌంటింగ్ సమయంలో అన్ని ఓట్లే లెక్క వేశామా లేదంటే అందులో ఏమైనా ఎక్కువ తక్కువ అయ్యాయా అని సరిచూసుకుంటుంది. కానీ 2024 సార్వత్రిక ఎన్నికల సమయంలో ఈసీ ఎప్పుడూ లేని విధంగా కాస్తంత విచిత్రంగా ప్రవర్తించింది. ఏడు దఫాల్లో జరుగుతున్న 2024 సార్వత్రిక ఎన్నికల్లో ఇప్పటికే ఐదు దఫాలు పూర్తయ్యాయి.
వీటిలో తొలి దఫా నుంచి కూడా పోలింగ్ పర్సంటేజ్‌ను ప్రకటిస్తూ వస్తున్న ఎన్నికల సంఘం. ప్రకటన చేసిన ఒక వారం రోజులకల్లా అప్‌డేటెడ్ పర్సంటేజ్‌ను ప్రకటించనున్నామని, తమకు అదనపు సమాచారం అందిందంటూ ఆ నెంబర్లలో పెరుగుదలను చూపిస్తూ వచ్చింది. ఇది ఇప్పటివరకు జరిగిన నాలుగు దఫాలకు జరిగింది. ఐదో విడత పోలింగ్‌కు సంబంధించి త్వరలో వచ్చే అవకాశాలే ఎక్కువ ఉన్నట్లు తెలుస్తుంది. తొలిదఫాలో మొదట 60శాతం ఓటింగ్ జరిగిందని, రెండో దఫాలో 60.9శాతం ఓటింగ్ జరిగిందని ఎన్నికల సంఘం అధికారికంగా ప్రకటించింది. పదకొండు రోజుల తర్వాత విచిత్రంగా ఈ పర్సంటేజ్‌లను అప్‌డేట్ చేస్తున్నామంటూ చెప్తూ.. తొలి దఫాలో 66.14 శాతం అంటే 6శాతం ఎక్కువ, రెండో దఫాలో 66.71 శాతం అంటే 6.1శాతం ఎక్కువగా ప్రకటించింది. మిగిలిన మూడు, నాలుగు దఫాల్లో కూడా ఇలానే జరిగింది.
దీంతో దీనిపై స్పందించిన కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే తీవ్ర అనుమానం వ్యక్తం చేశారు. ఈ పర్సింటేజ్‌లను ప్రకటించడంలో ఎందుకు ఆలస్యం జరుగుతుందని, సాంకేతికంగా అభివృద్ధి చెందుతున్న క్రమంలో ఈ నెంబర్‌ను ప్రకటించడానికి 11రోజుల సమయం ఎందుకు పడుతుందని ప్రశ్నిస్తూ లేఖ రాశారు. అంతేకాకుండా ఈ అప్‌డేట్ పర్సంటేజీల్లో ఆరు శాతం వరకు ఓట్లు అధికం ఎలా అవుతున్నాయని, ఏదో ఒకటి, రెండు శాతం అంటే అర్థం చేసుకోవచ్చు కానీ ఈ ఆరు శాతం అంటేనే అనుమానంగా ఉందంటూ తీవ్ర అనుమానం వ్యక్తం చేశారు. ఇన్ని ఓట్లను మొదటిసారి ఎలా మిస్ అయ్యారు అని ప్రశ్నించారు. అంతేకాకుండా కేవలం శాతంగానే ఎందుకు పోలింగ్ పర్సంటేజ్‌ను ప్రకటిస్తున్నారు? పూర్తిగా ఎన్ని లక్షల మంది ఓట్లు వేశారు అన్న విధంగా ఎందుకు ప్రకటించడం లేదు? అని నిలదీశారు. మొత్తం ఎన్ని ఓట్లు ఉన్నాయి.. ఎన్ని ఓట్లు పడ్డాయి అని ప్రకటిస్తే అసలు ఇబ్బందే ఉండదు కదా అని అంటున్నారు. ఖర్గే రాసిన ఈ లేఖపై ఈసీ తీవ్రంగా స్పందించింది. ఎన్నికల సంఘం ప్రతిష్టకు భంగం కలిగించేలా ఖర్గే మాట్లాడుతున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది.
అసలు ఏంటీ ఫార్మ్-17సీ
ప్రతి పోలింగ్ కేంద్రానికి ఒక 17సీ ఫార్మ్ ఉంటుంది. అందులో ఆ పోలింగ్ కేంద్రం పరిధిలో మొత్తం ఎంతమంది ఓటర్లు ఉన్నారు అన్న సమాచారం ఉంటుంది. ఎంతమంది ఓట్లు వేశారు అన్న లెక్కలు కూడా స్పష్టంగా ఉంటాయి. వాటి ద్వారా పోలింగ్ శాతం తేలుతుంది. మరోమాటలో చెప్పాలంటే సదరు పోలింగ్ కేంద్రం పరిధిలో ఉన్న ఓటర్లు, పోలింగ్ వంటి సమగ్ర సమాచార పత్రం. ఇందులో ఓటు వేసిన వారి గురించే కాకుండా ఎంతమంది ఓటును తొలగించడం జరిగింది. ఈవీఎంలో ఎన్ని ఓట్లు పడ్డాయి. బ్యాలెట్ ప్యాపర్లు, పేపర్ సీల్స్‌కు సంబంధించిన సమాచారం కూడా ఇందులో ఉంటుంది.
ఈ ఫార్మ్ 17సీ చివరి భాగంలో అభ్యర్థులు పేర్లు ఉంటాయి. దాంతో పాటుగా ఎవరు ఎన్ని ఓట్లు సాధించారు అనే సమాచారంతో పాటు సదరు బూత్‌లో ఉన్న అన్ని ఓట్లు, పోల్ అయిన ఓట్లు మధ్య తేడాను కూడా స్పష్టంగా చూపుతుంది. ఇందులో ఉన్న మొత్తం సమాచారన్ని పరిశీలించిన తర్వాత దీనిపై అక్కడి ఏజెంట్లు సహా రిటర్నింగ్ అధికారి సంతకం చేస్తారు. దీనిని ప్రకటించడం వల్ల ఎన్నికలపై ప్రతికూల ప్రభావం చూపుతుందని ఎన్నికల సంఘం సుప్రీంకోర్టులో వాదిస్తోంది. మరి ఈ అంశంపై అత్యున్నత న్యాయస్థానం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి.