
సంక్షేమం..అభివృద్ధి పరుగులు: చంద్రబాబు
పోలవరం, వెలిగొండ పూర్తి చేయడమే లక్ష్యం అని సీఎం చంద్రబాబు అన్నారు.
రాష్ట్రంలో సంక్షేమం, అభివృద్ధిని సమానంగా పరుగులు తీయిస్తున్నామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రకటించారు. సూపర్ సిక్స్ పథకాలను విజయవంతంగా అమలు చేస్తున్నామని, ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల ద్వారా రూ. 34 వేల కోట్లు అందిస్తున్నామని తెలిపారు. అన్నదాత సుఖీభవ, దీపం 2.0 ద్వారా ఉచిత సిలిండర్లు, తల్లికి వందనం వంటి పథకాలతో ప్రజలకు అండగా ఉంటున్నామని స్పష్టం చేశారు.
సాగునీటి ప్రాజెక్టులకు పెద్దపీట
బుధవారం మార్కాపురం జిల్లా వెలిగొండ ప్రాజెక్టులో ఫీడర్ కెనాల్ లైనింగ్ పనులకు సీఎం చంద్రబాబు శంకుస్థాపన చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. 2027 గోదావరి పుష్కరాల లోపు పోలవరం ప్రాజెక్టును పూర్తి చేసి జాతికి అంకితం చేస్తామని ముఖ్యమంత్రి హామీ ఇచ్చారు. ఈ ఏడాది జూలై నాటికి రూ. 2 వేల కోట్లు ఖర్చు చేసి వెలిగొండ ప్రాజెక్టును పూర్తి చేస్తామన్నారు. గోదావరి, కృష్ణా నదుల నుంచి వృధాగా సముద్రంలోకి వెళ్తున్న వరద జలాలను నిలిపివేసి, నల్లమల సాగర్ అనుసంధానం ద్వారా ప్రతి ఇంటికీ తాగునీరు, సాగునీరు అందిస్తామన్నారు.
మార్కాపురం అభివృద్ధి .. ఉద్యాన హబ్
మార్కాపురం జిల్లాను ఉద్యాన పంటల కేంద్రంగా తీర్చిదిద్దేందుకు బ్లూ ప్రింట్ సిద్ధం చేస్తున్నట్లు వెల్లడించారు. రూ. 1300 కోట్ల వ్యయంతో నల్లమల సాగర్ ద్వారా ఇంటింటికీ రక్షిత మంచినీరు అందిస్తామని, ఫ్లోరైడ్ బాధల నుంచి విముక్తి కలిగిస్తామని చెప్పారు. జిల్లా కలెక్టరేట్ నూతన భవనం కోసం రూ. 50 కోట్లు మంజూరు చేస్తున్నట్లు ప్రకటించారు. గత పాలనలో జరిగిన భూ కబ్జాలను అరికట్టి, క్యూఆర్ కోడ్, రాజముద్రతో కూడిన కొత్త పాస్ పుస్తకాలను జారీ చేస్తున్నామని తెలిపారు.
పెట్టుబడులు..ఉపాధి
రాష్ట్రానికి రూ. 20 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయని, మన యువత సొంత రాష్ట్రంలోనే ఉద్యోగాలు చేసుకునేలా చర్యలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు. రాష్ట్ర చరిత్రను మార్చాలనే దృఢ సంకల్పంతో ముందుకు వెళ్తున్నట్లు చెప్పారు. స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమం ద్వారా చెత్త నుంచి సంపద సృష్టించే దిశగా అడుగులు వేస్తున్నామని వివరించారు.
రాజకీయ విమర్శలు - ధర్మ పరిరక్షణ
తిరుమల లడ్డూ కల్తీ అంశంపై స్పందిస్తూ, దేవాలయాల పవిత్రతకు భంగం కలిగిస్తే సహించేది లేదని హెచ్చరించారు. గత ఐదేళ్ల ఆరాచక పాలన వల్ల రాష్ట్రం విధ్వంసమైందని, ఇప్పుడు అభివృద్ధి రాజకీయాలకే ప్రాధాన్యం ఇస్తున్నామని స్పష్టం చేశారు. అసెంబ్లీకి రాకుండా ప్రజలను భయపెట్టే రాజకీయాలు వద్దు అని హితవు పలికారు. ప్రజల జీవితాల్లో మార్పు తెచ్చే బాధ్యత ప్రభుత్వం తీసుకుంటుందని, ప్రజలు అభివృద్ధికి సహకరించాలని కోరారు.
Next Story

