వైసీపీ విధ్వంసాన్ని ఆపాం, పాలనను గాడిలో పెట్టాం!
x

'వైసీపీ విధ్వంసాన్ని ఆపాం, పాలనను గాడిలో పెట్టాం!'

రాబోయే రోజుల్లో ప్రజల కోసం మరింత కష్టపడి పని చేద్దామన్న సీఎం చంద్రబాబు


రాష్ట్ర ప్రజల ఆశలను నిలబెడుతూ, వారిలో మళ్లీ ఆత్మవిశ్వాసాన్ని నింపగలిగామన్న ఆశాభావాన్ని వ్యక్తం చేశారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. 2025 రాష్ట్రానికి మంచి ఫలితాలను ఇచ్చిందని, వైసీపీ హయాంలో విధ్వంసమైన వ్యవస్థలను చక్కదిద్ది, సుపరిపాలనను మళ్లీ పట్టాలెక్కించామన్నారు. సచివాలయంలో మంత్రులు, కార్యదర్శులతో నిర్వహించిన కీలక సమీక్షా సమావేశంలో ముఖ్యమంత్రి పలు అభివృద్ధి, సంక్షేమ అంశాలపై చర్చించారు.

సంక్షేమంలో కొత్త మైలురాళ్లు: సూపర్‌ సిక్స్‌ విజయాలు

ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న 'సూపర్‌ సిక్స్‌' పథకాల ద్వారా సంక్షేమం, అభివృద్ధిని పరుగులు పెట్టిస్తున్నామని సీఎం వివరించారు. ఈ సందర్భంగా ఆయన కొన్ని కీలక గణాంకాలను వెల్లడించారు: తల్లికి వందనం పథకం ద్వారా 67 లక్షల మంది విద్యార్థుల తల్లుల ఖాతాల్లో రూ.10,090 కోట్లు జమ చేశాం. అన్నదాత సుఖీభవ కింద 46 లక్షల మంది రైతులకు రూ.6,310 కోట్ల ఆర్థిక సాయం అందించాం. స్త్రీశక్తి పథకం ద్వారా 3.5 కోట్ల మంది మహిళలు ఉచిత ప్రయాణ సౌకర్యాన్ని వినియోగించుకున్నారు. ఇందుకోసం ప్రభుత్వం రూ.1,114 కోట్లు వెచ్చించింది. గడిచిన ఏడాదిన్నర కాలంలో రూ.50,000 కోట్ల మేర పింఛన్లు పంపిణీ చేసి సంక్షేమంలో రికార్డు సృష్టించామన్నారు.

అమరావతి - పోలవరం:

గతంలో అమరావతిని ఎడారి అని హేళన చేసిన వారికి సమాధానం చెబుతూ, ఇదో స్ఫూర్తిదాయక ప్రాజెక్టు అని సీఎం అన్నారు. రాజధాని అభివృద్ధిలో రైతులను భాగస్వాములను చేస్తున్నట్లు తెలిపారు. ఇక పోలవరం ప్రాజెక్టు గురించి మాట్లాడుతూ.. "పోలవరం పూర్తయితే దక్షిణ భారతదేశంలో ఏ రాష్ట్రమూ ఏపీతో పోటీ పడలేదు" అని స్పష్టం చేశారు. నల్లమల సాగర్ ప్రాజెక్టు ద్వారా రాయలసీమ, ప్రకాశం జిల్లాలకు సాగు, తాగునీరు అందుతుందని, పోలవరం నుంచి మిగిలిన నీటిని దీనికి మళ్లించడం వల్ల ఎవరికీ నష్టం లేదని ఆయన వివరించారు.

పారిశ్రామికాభివృద్ధి.. పెట్టుబడుల డెస్టినేషన్ ఏపీ

రాష్ట్రం పెట్టుబడులకు కేరాఫ్ అడ్రస్‌గా మారిందని సీఎం అన్నారు. దేశంలోకి వచ్చిన మొత్తం విదేశీ పెట్టుబడుల్లో 25 శాతం ఏపీకే రావడం గర్వకారణమన్నారు. ఎస్ఐపీబీ (SIPB) కింద రూ.8.74 లక్షల కోట్ల పెట్టుబడులకు ఆమోదం తెలిపామని, వీటి ద్వారా లక్షలాది మంది యువతకు ఉద్యోగాలు వస్తాయన్నారు. విశాఖ స్టీల్‌ప్లాంట్‌ ఆంధ్రుల సెంటిమెంట్ అని, కేంద్ర సహకారంతో దానిని ఖచ్చితంగా నిలబెడతామని హామీ ఇచ్చారు. భోగాపురం ఎయిర్‌పోర్టు పనులు తుది దశకు చేరాయని, త్వరలోనే జాతికి అంకితం చేస్తామని ప్రకటించారు.

జీఎస్‌డీపీ (GSDP) వృద్ధిపై దృష్టి పెట్టాలని, ఆర్టీజీఎస్‌ (RTGS) వ్యవస్థను మరింత బలోపేతం చేయాలని అధికారులను సీఎం ఆదేశించారు. "2025 ఇచ్చిన ఉత్సాహంతో, రాబోయే రోజుల్లో ప్రజల కోసం మరింత కష్టపడి పని చేద్దాం" అని మంత్రులు, అధికారులకు దిశానిర్దేశం చేశారు.

Read More
Next Story