ఎట్టకేలకు నిజం అంగీకరించిన ఇజ్రాయెల్.. ఏంటదీ?
శత్రువులు ఊహించని దారిలో ఎదురుదాడి చేసి హతమార్చడం ఇజ్రాయెల్ గూఢచారులకు వెన్నతో పెట్టిన విద్య. కానీ అలాంటి నిజాలు టెల్ అవీవ్ సాధారణంగా ఒప్పుకోలేదు.
ఆధునిక యుద్ధతంత్రంలో ఇజ్రాయెల్ ను మించినది లేదనేది వాస్తవం. శత్రువులు ఊహించని రీతిలో దాడి చేసి హతమార్చడం దానికి వెన్నతో పెట్టిన విద్య. చాలాసార్లు అలా చేసిన దాడులను ఇజ్రాయెల్ ఒప్పుకోలేదు అలాగని ఖండించలేదు.
కానీ మొన్న సెప్టెంబర్ లో హెజ్ బొల్లా పై జరిపిన పేజర్, వాకీ టాకీలు, సోలార్ ప్యానెల్ బాంబు దాడులు తమ గూఢచార సంస్థలే జరిపినట్లు ప్రధాని బెంజమిన్ నెతన్యాహూ అంగీకరించారు. ఈ దాడుల్లో 39 మంది ఉగ్రవాదులు మరణించగా, దాదాపు 3000 మంది తీవ్రంగా గాయపడ్డారు.
" మా దేశ రక్షణ కోసం ఉగ్రవాద సంస్థలోని సీనియర్ నాయకులను పేజర్ ఆపరేషన్ ద్వారా తొలగించాం" అని నెతన్యాహును ఉటంకిస్తూ టైమ్స్ ఆఫ్ ఇజ్రాయెల్ వార్తాపత్రిక పేర్కొంది. హిబ్రూ మీడియా నివేదికల ప్రకారం ఆదివారం వారపు క్యాబినెట్ సమావేశంలో నెతన్యాహు ఈ వ్యాఖ్యలు చేశారు.
ఇజ్రాయెల్ ఇప్పటివరకు దాడులకు బహిరంగంగా బాధ్యత తీసుకోలేదు, అయితే ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచిన ఈ దాడుల వెనక ఇజ్రాయెల్ ఉందని విస్తృతంగా ప్రచారం జరిగింది.
సెప్టెంబరు 16న లెబనాన్ - సిరియాలోని కొన్ని ప్రాంతాలలో పేలుడు పదార్థాలను కలిగి ఉన్న వేలాది పేజర్‌లు ఒక్కసారిగా పేలిపోయాయి. దీంతో హెజ్ బొల్లా మధ్య సమాచార మార్పిడి కష్టంగా జరిగింది. తరువాత రోజు ఉగ్రవాద సంస్థ ఉపయోగిస్తున్న వాకీ టాకీలు సైతం పేలిపోయాయి.
ఇలా లెబనాన్ లో దాగి ఉన్న ఉగ్రవాదులపై దాడులు చేస్తున్నామని ఆయన క్యాబినేట్ మీటింగ్ లో అంగీకరించారని, గాలంట్ ను రక్షణమంత్రిగా తొలగించిన తరువాత దేశంలో తలెత్తిన ఆందోళనలను దృష్టి మరలించడానికి నెతన్యుహూ ఈ క్రెడిట్ తీసుకోవడానికి ప్రయత్నిస్తున్నారనే విశ్లేషణలు వినిపిస్తున్నాయి. కాగా నవంబర్ 5న గాలంట్ తన పదవికి రాజీనామా చేశారు.
నెతన్యాహు - గాలంట్ కలిసి ప్రభుత్వంలో ఉన్న కాలంలో పదేపదే గొడవపడ్డారు. నెతన్యాహు మార్చి 2023లోనే గాలెంట్ ను వదిలించుకోవడానికి ప్రయత్నించారు. న్యాయ ప్రక్రియలో ఉన్న నిబంధనలను తొలగించడానికి నెతన్యాహు ప్రయత్నించారనే కారణంతో ఇద్దరు నాయకుల మధ్య గొడవ జరిగింది.
గత ఏడాది అక్టోబరు 7న దక్షిణ ఇజ్రాయెల్‌లో హమాస్ ఘోరమైన ఉగ్రదాడికి పాల్పడినప్పుడు ఆయన రక్షణ మంత్రిగా ఉన్నారు. తరువాత గాజా స్ట్రిప్ పై జరిగిన యుద్ధం సమయంలోనూ ఆయనే విధులు నిర్వహించారు.
ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్‌లో అల్ట్రా-ఆర్థోడాక్స్ చెందిన యువకులను సైతం నియమించాలని గాలంట్ కోరుతున్నారు. దీనితో పాటు గాజా లో ఇప్పటికి బందీలుగా ఉన్న యూదు యువకులను తిరిగి తీసుకురావాలని, సీజ్ ఫైర్ అమలు చేయాలని కోరారు. దీనికి నెతన్యాహు ఒప్పుకోలేదు. గాజా నుంచి జరిగిన ఘటనపై కూడా ఓ కమిటీని నియమించాలని కూడా గాలంట్ కోరినప్పటికీ నెతన్యాహు పట్టించుకోలేదు.
Next Story