రాయలసీమకు నీరు మాటల్లోనే..
x

రాయలసీమకు నీరు మాటల్లోనే..

పాలకుల మోసాన్ని బట్టబయలు చేస్తున్న క్షేత్రస్థాయి వాస్తవాలు.


రాయలసీమ సాగునీటి ప్రాజెక్టుల విషయంలో పాలకులు చేస్తున్న ఆర్భాటపు ప్రకటనలకు, క్షేత్రస్థాయిలోని వాస్తవ పరిస్థితులకు ఏమాత్రం పొంతన లేదని ఆంధ్రప్రదేశ్ రైతు కూలీ సంఘం రాష్ట్ర అధ్యక్షురాలు ఝాన్సీ ధ్వజమెత్తారు. వెలుగోడు రిజర్వాయర్, బనకచర్ల క్రాస్ రెగ్యులేటర్, ఎస్సార్‌బీసీ కాలువలను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. రాయలసీమ సాగునీటి సాధన సమితి అధ్యక్షులు బొజ్జా దశరథరామిరెడ్డి ఆద్వర్యంలో ఆంధ్రప్రదేశ్ రైతు కూలీ సంఘం అధ్యక్షురాలు ఝాన్సీ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రోగ్రెసివ్ డెమోక్రటిక్ స్టూడెంట్ ఆర్గనైజేషన్ ప్రధాన కార్యదర్శి సురేష్, సమితి బృందంతో కలిసి మంగళవారం నాడు వెలుగోడు రిజర్వాయర్, మద్రాసు కాలువ, బనకచర్ల క్రాస్ రెగ్యులేటర్, ఎస్సార్‌బీసీ కాలువల పరిస్థితిని క్షేత్రస్థాయిలో స్వయంగా పరిశీలించారు. ఈ సందర్భంగా దశరథరామిరెడ్డి ఝాన్సీ గారికి ఆయా ప్రాజెక్టులు, కాలువల గురించి క్షేత్రస్థాయిలో రైతాంగం ఎదుర్కొంటున్న ఇబ్బందులు గురించి సంపూర్ణంగా వివరించారు.

ఈ సందర్భంగా శ్రీమతి ఝాన్సీ మాట్లాడుతూ.. పాలకులు చేస్తున్న ప్రకటనలకు క్షేత్రస్థాయిలోని వాస్తవ పరిస్థితులకు ఏమాత్రం పొంతన లేదని, తమ పరిశీలనలో బయటపడిన దుస్థితి తీవ్ర ఆందోళన కలిగించిందని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. 40 సంవత్సరాల క్రితం ప్రారంభించిన తెలుగుగంగ ప్రాజెక్టు ద్వారా కర్నూలు, కడప జిల్లాల్లో సుమారు 2.75 లక్షల ఎకరాలకు సాగునీరు అందించడం.. అలాగే మద్రాసు నగరానికి తాగునీరు సరఫరా చేయడం లక్ష్యంగా పెట్టుకున్నప్పటికీ, నేటికీ ఈ ప్రాజెక్టు పరిస్థితి అత్యంత బాధాకరంగా ఉందన్నారు. శ్రీశైలం రిజర్వాయర్‌లో వరద ఉండే సుమారు 30 రోజుల వ్యవధిలో వెలుగోడు రిజర్వాయర్ నుండి బ్రహ్మసాగర్‌కు నీటిని తరలించేందుకు అవసరమైన కాలువ సామర్థ్యం లేకపోవడం, అలాగే తెలుగుగంగ ఆయకట్టుకు పంటకాలంలో అవసరమైన నిర్మాణాలు చేపట్టకపోవడం వల్ల ప్రస్తుతం 20 వేల ఎకరాలకు కూడా నీరు అందని దుస్థితి నెలకొందని ఆమె తెలిపారు.
అదేవిధంగా అంజయ్య గారు చేపట్టిన ఎస్సార్‌బీసీ కాలువ ద్వారా బనకచర్ల నుండి గోరుకల్లు రిజర్వాయర్‌కు నీటిని తరలించి, అక్కడి నుండి గాలేరు–నగరి, మైలవరం, పైడిపాలెం, చిత్రావతి బ్యాలెన్స్ ప్రాంతాలకు నీరు అందించాల్సి ఉండగా, కాలువను 22,000 క్యూసెక్కుల సామర్థ్యంతో వెడల్పు చేసినప్పటికీ, అనేక ప్రాంతాల్లో ఉన్న అడ్డంకుల కారణంగా 8,000 క్యూసెక్కుల నీరు కూడా పూర్తిగా తరలించలేని పరిస్థితి నెలకొందని తీవ్రంగా విమర్శించారు. ఈ కాలువ సామర్థ్యాన్ని పూర్తిగా వినియోగించుకునేందుకు కేవలం 19 చోట్ల కేసీ కెనాల్‌ను ఎస్సార్‌బీసీ కాలువపై దాటించే ఆక్వడక్టుల నిర్మాణం చేపట్టాల్సి ఉండగా, వాటిని పాలకులు నిర్లక్ష్యం చేయడం వల్ల ఈ ప్రాజెక్టు ద్వారా అందవలసిన ఆయకట్టుకు నీరు అందకపోవడమే కాకుండా, 150 సంవత్సరాల చరిత్ర కలిగిన కేసీ కెనాల్ రైతాంగం కూడా తీవ్రంగా నష్టపోతున్న పరిస్థితి నెలకొందని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.
అలాగే బనకచర్ల క్రాస్ రెగ్యులేటర్ కాంప్లెక్స్ నుండి 30 రోజుల్లో రాయలసీమకు 120 టీఎంసీల నీటిని తరలించాల్సిన నిర్మాణాలు పూర్తయినప్పటికీ, అక్కడి నుండి రాయలసీమకు నీటిని తరలించేందుకు అవసరమైన తదుపరి పనులను పాలకులు చేపట్టకపోవడంపై ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ దిశగా పనులు చేపట్టకపోగా, బనకచర్ల కాంప్లెక్స్ వద్ద నిర్మించిన రెగ్యులేటర్ల ద్వారా రాయలసీమకు రావలసిన నీటిని అడ్డగించి, కుందూ నది, నిప్పులవాగు వైపుకు మళ్లించడంలో పాలకుల అసలు లక్ష్యం ఏమిటో ప్రజలు గమనించాల్సిన అవసరం ఉందని ఆమె పేర్కొన్నారు.
పాలకులు రాయలసీమ అభివృద్ధి కోసం అన్నీ కార్యక్రమాలు తామే చేస్తున్నామని ప్రకటనల పరంపర ఒకవైపు కొనసాగిస్తున్నప్పటికీ, వాస్తవంగా మాత్రం రాయలసీమను నిర్లక్ష్యం చేస్తూ కాలం గడుపుతున్న తీరును ఆమె తీవ్రంగా ఎండగట్టారు. 20 కోట్ల రూపాయల కేటాయించి శ్రీశైలం రిజర్వాయర్ నుండి 30 రోజులలో నీటిని తీసుకొని గోరకల్లు, ఆవుకు, గండికోట, మైలవరం, పైడిపాలెం, చిత్రావతి బ్యాలెన్స్ రిజర్వాయర్ లను నింపడానికి కీలకమైన ఎస్ ఆర్ బి సి కాలువలోని అడ్డంకులు తొలగించడానికి 20 కోట్ల రైపాయలను తక్షణమే కేటాయించి ఆ దిశగా కార్యాచరణ చేపట్టాలని ఆమె ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఇకనైనా మాటలు, హామీలతో ప్రజలను మభ్యపెట్టడం మానేసి, అత్యంత వెనుకబడిన రాయలసీమ ప్రాంతంలో ఉన్న సహజ వనరులను సమర్థంగా వినియోగించుకునే దిశగా తక్షణ చర్యలు చేపట్టాలని ఆమె విజ్ఞప్తి చేశారు.
రాయలసీమ సాగునీటి ప్రాజెక్టుల పట్ల ప్రభుత్వ విధానాలు ఇలాగే నిర్లక్ష్య ధోరణి కొనసాగితే రాయలసీమ ప్రజలు నిర్వహించే ఉద్యమానికి తమ మద్దతు ఉంటుందని ఈ సందర్భంగా ఝాన్సీ ప్రకటించారు. ప్రాజెక్టుల సందర్శనలో సమితి కార్యవర్గ సభ్యులు, భాస్కర్ రెడ్డి, తెలుగు గంగ ఆయకట్టు రైతులు, కరిమెద్దల ఈశ్వర్ రెడ్డి, కే సి కెనాల్ ఆయకట్టు రైతులు, మహనంది రెడ్డి , ఎస్ ఆర్ బి సి కాలువ బాధితులు, నందిరైతు సమాఖ్య అధ్యక్షులు బెక్కం రామసుబ్బారెడ్డి తదితరులు పాల్గొన్నారు.‌
Read More
Next Story