భారతీయులను తిప్పి పంపడం ప్రారంభించిన అమెరికా
x

భారతీయులను తిప్పి పంపడం ప్రారంభించిన అమెరికా

అక్రమ వలసదారులుగా గుర్తించి సైనిక విమానంలో తరలిస్తున్న వాషింగ్టన్, సహకరిస్తున్న న్యూఢిల్లీ?


అక్రమ వలసదారులపై ఉక్కుపాదం మోపుతామని ఇంతముందే ప్రకటించిన డొనాల్డ్ ట్రంప్.. కొద్ది రోజులుగా కాళ్లు, చేతులు కట్టేసి మరీ సైనిక విమానాల్లో వారిని స్వంత దేశాలకు పంపుతున్నారు.

తాజాగా ఈ జాబితాలో భారత్ కూడా చేరింది. అమెరికాలో అక్రమంగా ప్రవేశించి నివసిస్తున్న 205 మంది భారతీయులను టెక్సాస్ నుంచి తిప్పుపంపినట్లు జాతీయ మీడియా వార్తలు ప్రసారం చేసింది.

ఈ ప్రక్రియలో న్యూఢిల్లీ కూడా పాలుపంచుకున్నట్లు తెలుస్తోంది. విమానంలో వస్తున్న వారందరి సమాచారాన్ని ధృవీకరించుకున్న తరువాతనే స్వదేశానికి పంపిస్తున్నట్లు తెలుస్తోంది.

అమెరికాలో ఉంటున్నభారతీయ అక్రమ వలసదారులను తీసుకుని వస్తున్న మొదటి విమానం ఇదే. అమెరికాలో దాదాపు 7 లక్షల పైనే భారతీయులు అక్రమంగా వలస ఉంటున్నారని కొన్ని రికార్డులు తెలుపుతున్నాయి. అమెరికా మొత్తం మీద పత్రాలు లేని వలసదారులు దాదాపుగా 11 మిలియన్ల మంది ఉంటారని ఓ అంచనా.
అయితే ఈ సైనిక విమానాలు భారత్ రావడానికి కనీసం 24 గంటల సమయం పడుతుందని ఓ అధికారి తెలిపారు. ప్రస్తుతం సీ17 విమానంలో వీరంతా ఉన్నారని అన్నారు. టెక్సాస్ లోని ఎల్ పాసో, కాలిఫోర్నియాలోని శాన్ డియాగో నుంచి దాదాపు 5 వేల మంది అక్రమ వలసదారులను వెనక్కి పంపిస్తామని పెంటాగాన్ పేర్కొంది. ఇప్పటి వరకూ సైనిక విమానాలు కేవలం అమెరికా సరిహద్దు దేశాలైన గ్వాటేమలా, పెరూ, హోండూరస్, మెక్సికోలకు మాత్రమే వెళ్లాయి.
అక్రమ వలసదారులు ఏరివేత ఎజెండా
దేశం లో అక్రమంగా ఉంటున్న వలసదారులందరిని ఏరివేస్తానని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఎన్నికల సమయం నుంచే అమెరికన్లకు హమీ ఇస్తున్నారు. దీనికోసం ఆయన సైన్యాన్ని విస్తృతంగా వాడుకుంటున్నారు. అలాగే మెక్సికోకు అదనంగా సైన్యాన్ని పంపారు.
అలాగే అక్రమ వలసదారులను గుర్తించడానికి ప్రత్యేక డ్రైవ్ లు చేస్తున్నారు. అలా గుర్తించిన వారందరిని కూడా సైనిక కేంద్రాలకు తరలిస్తున్నారు. గత వారం గ్వాటేమాలాకు చెందిన అక్రమ వలసదారులను బహిష్కరించడానికి సైనిక విమానాన్ని ఉపయోగించగా ప్రతి వలసదారుడిగా 4,675 డాలర్ల ఖర్చు అయిందని రాయిటర్స్ తెలిపింది.
అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్ బాధ్యతలు చేపట్టిన తరువాత అక్రమంగా వలస ఉంటున్న భారతీయులను డిపోర్టేషన్ చేయడం ఇదే మొదటి సారి. ట్రంప్, విదేశాంగమంత్రి మార్కొని రూబియే, ప్రధాని మోదీ, విదేశాంగమంత్రి ఎస్ జైశంకర్ మధ్య జరిగిన సంభాషణల్లో అక్రమ వలసల గురించి సుదీర్ఘంగా చర్చలు జరిగాయి.
వీటి గురించి ఇరు దేశాలు ఆందోళన వ్యక్తం చేశాయి. గతంలో ట్రంప్ అక్రమ వలసల గురించి మాట్లాడగా.. మోదీ చేసేది సరైన పనని ఆయన కొనియాడారు. అక్రమంగా ఉంటున్న భారతీయులందరిని గుర్తించి వారిని వెనక్కి తీసుకుంటామని మోదీ ప్రకటించారు. ఇలా మొదటి విడతలో దాదాపు 18 వేల మంది వెనక్కి తీసుకోవడానికి న్యూఢిల్లీ అంగీకరించింది.


Read More
Next Story