
కాలి ముద్దయిన బంధువుల కోసం ఎదురు చూపులు
బస్ ప్రమాదంలో కాలి ముద్దయిన బంధువుల శవాల కోసం బంధువులు రెండు రోజులుగా ఎదురు చూస్తున్నారు.
మార్కాపురం జిల్లా కేంద్రానికి సమీపంలోని రాయవరం వద్ద గురువారం తెల్లవారుజామున జరిగిన ఘోర బస్ అగ్ని ప్రమాదం మానవ హృదయాలను కలచివేస్తోంది. కాలిన శవాల ముద్దలను చూసి బంధువులు గుర్తించలేక, డీఎన్‌ఏ రిపోర్టుల కోసం హాస్పిటల్ మెట్లపై రోజుల తరబడి కన్నీళ్లు కారుస్తూ ఎదురు చూస్తున్నారు. “నా పిల్లల ముఖం ఎవరూ చూడలేదు… వారిని ఎవరు చూసుకోవాలి?” అని ఒక బంధువు గొంతు విరిగిన స్వరంలో అంటున్నారు. ఈ ఒక్క ప్రమాదం ఎన్నో కుటుంబాలను శూన్యం చేసి, జీవితాలను శాశ్వతంగా సమాజం నుంచి దూరంగా విసిరేసింది.
ఇది కేవలం రోడ్డు ప్రమాదం కాదు, మానవ బలహీనతలు, నిర్లక్ష్యం, విధి ఒకేసారి కలిసి సృష్టించిన హృదయవిదారక విషాదం. నిద్రలో మునిగిపోయిన ప్రయాణికులు క్షణాల్లో మంటల చుట్టుముట్టులో చిక్కుకుపోయి, కొందరు సజీవ దహనం అయ్యారు. మరికొందరు పొగ, చీకటి, భయంకరమైన వేడి మధ్య బతుకు కోసం పోరాడి బయటపడ్డారు. ఒక తల్లి తన కుమారుడిని బయటకు నెట్టి తాను మంటల్లో కాలిపోయింది. ఒక చిన్నారి అమ్మాయి, ఐదు నెలల శిశువు సహా ఆరుగురు మహిళలు, మొత్తం 14 మంది ప్రాణాలు కోల్పోయారు.
ఈ పరిస్థితులను తెలుసుకునేందుకు శుక్రవారం సంఘటనా స్థలం, ప్రభుత్వ వైద్యశాలను ‘ది ఫెడరల్ ఆంధ్రప్రదేశ్’ ప్రతినిధి పరిశీలించి అక్కడి పరిస్థితులను పలువురిని అడిగి తెలుసుకున్నారు. బంధువుల్లో ఎవరిని కదిలించినా చాలు వారి కళ్లల్లో నీళ్ల సుడులు తిరుగుతున్నాయి.
తెలంగాణలోని జగిత్యాల (లేదా నిర్మల్) నుంచి, కలిగిరి, వింజమూరు, పామూరు వైపు వెళ్తున్న హరికృష్ణ ట్రావెల్స్ ప్రైవేట్ స్లీపర్ బస్‌లో 41 మంది ప్రయాణికులు ఉన్నారు. చాలా మంది గాఢ నిద్రలో ఉన్న సమయం అది. బస్ డ్రైవర్ కూడా బస్ యజమాని హరికృష్ణ అని సమాచారం.
మార్కాపురంలోని జిల్లా ప్రభుత్వ ఆస్పత్రి ఎదుట బాధితుల బంధువుల కోసం మార్కాపురం మునిసిపాలిటీ వారు ఏర్పాటు చేసిన టెంట్ల కింద రెండు రోజులుగా బంధువులు కాలి ముద్దయిన తమ వారి కోసం ఎదురు చూస్తున్నారు. బస్ దగ్ధం వల్ల శరీరాలు కాలి నల్లగా కమిలిన ముద్దలుగా మారిపోయాయి. కనీసం ఆనవాళ్లు కూడా గుర్తించేందుకు వీలు లేకుండా శరీరాలు ముద్ద కావడంతో ఎవరు ఎవరి బంధువో తెలుసుకోవడం అధికారులకు కష్టంగా మారింది. దీనికి పరిష్కారం డీఎన్ ఏ టెస్ట్ ఒక్కటే. ఆ టెస్ట్ కోసం బంధువుల శరీరాలు, కాలిన వారి శరీరాల్లోని పీసులను సేకరించి టెస్ట్ కు ల్యాబ్ కు అధికారులు పంపించారు. ఆ రిపోర్టుల కోసం అటు అధికారులు, ఇటు బాధితులు ఎదరు చేస్తున్నారు. మార్చురిలోని కాంపౌండ్ ఆవరణలో కాలిన శరీరాల ముద్దలను ఫ్రిజ్ బాక్స్ ల్లో పెట్టి పోలీసులు కాపలా కాస్తున్నారు.
అధికారుల నివేదికల ప్రకారం 14 మంది మృతి చెందారు. అందులో 5 నెలల శిశువు (అంబటి అనిల్ కుమారుడు), ఒక చిన్నారి అమ్మాయి, 6 మంది మహిళలు ఉన్నారు.
మరో 28 మంది గాయపడ్డారు. వారిలో 5 మంది పరిస్థితి ప్రమాదకరంగా ఉంది. గాయపడినవారిన వారిలో ప్రస్తుతం పది మంది మార్కాపురం వైద్యశాలలో ఉన్నట్లు డీఎంఅండ్ హెచ్ వో డాక్టర్ శ్రీవాణి తెలిపారు. ఆర్డీవో పెంచల ప్రభాకర్, డీఎంఅండ్ హెచ్ వోలు కలిసి బాధితులు ఒక్కొక్కరితో విడివిడిగా మాట్లాడారు. వారికి ఏమి కావాలో అడిగి తెలుసుకున్నారు.
బంధువుల ఆవేదన
హాస్పిటల్ వద్ద బంధువులు కన్నీళ్లు కారుస్తూ... “మా అబ్బాయి ఎక్కడో తెలియడం లేదు… డీఎన్‌ఏ టెస్ట్ రిపోర్టు ఎప్పుడు వస్తుంది?” అని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కాలిన శవాల ముద్దలను చూసి గుర్తించడం కూడా కష్టంగా మారింది. కొందరు బంధువులు రాత్రి నుంచి హాస్పిటల్ మెట్ల మీదే కూర్చుని ఉన్నారు.
ప్రాథమిక విచారణ
బస్ డ్రైవర్ నిర్లక్ష్యం, అదుపుతప్పడం ప్రధానమని బాధితులు చెబుతున్నారు. బస్ పాతది, రస్ట్ అయిన స్థితి అని బాధితులు వాపోతున్నారు. (ప్రమాదానికి ముందే ప్రయాణికులు బస్ కండీషన్ గురించి ఆందోళన వ్యక్తం చేశారు. యర్రగొండపాలెం వద్ద గంటసేపు ఆపి రిపేర్ చేసి మళ్లీ బయలుదేరారు) స్టీరింగ్ సమస్య ఉందని డ్రైవర్ చెప్పినట్టు బాధితులు తెలిపారు. బస్ యజమాని, డ్రైవర్ హరికృష్ణ గాయపడి హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్నారు. అతన్ని పోలీసు కస్టడీలో ఉంచి విచారిస్తున్నారు.
సీఎం చంద్రబాబు నాయుడు మృతుల కుటుంబాలకు రూ. 7 లక్షలు, గాయపడినవారికి రూ. 2.5 లక్షలు ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు. మార్కాపురం కలెక్టర్ ఆఫీసులో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు.
తుపాకుల రత్నమ్మ
బస్ మధ్యమధ్యలో ఆగుతూనే వస్తోంది. అకస్మాత్తుగా బ్రేకులు వేశారు. కొందరు పడిపోయారు. మమ్మల్ని లేవదీయలేకపోయారు. బస్ కాలిపోయిందని మెసేజ్ వచ్చింది.” మా కళ్ల ముందే బయటకు రాలేని వారు కాలిపోయారు.
ప్రమాదం చాలా భయంకరంగా జరిగింది. మంటలు బాగా వ్యాపించాయి. ఏమవుతుందో అర్థం కాలేదు. చివరి గదిలో ఒక డోర్ ఉంది, అది కొద్దిగా తెరుచుకోగానే అందరం దూకాం.” ఒకబ్బాయి ఆ డోర్ పగులగొట్టడం వల్ల పది మంది వరకు అక్కడి నుంచి కిందకు దూకాము. లేదంటే మేము కూడా కాలిపోయే వారమే.
హాస్పిటల్ వద్ద ఎదురు చూస్తున్న ఒక బంధువు (సోదరి కూతురు మరణించినట్టు) ఆవేదన వ్యక్తం చేశారు.
“నా సోదరి కూతురు వృద్ధాప్యంలో బూడిద అయిపోయింది. సార్, నా పిల్లల ముఖం ఎవరూ చూడలేదు. నా కూతురు, అల్లుడు, మనుమడు కూలిపనికోసం వెళ్లారు. నా కూతురు బిడ్డ తన కస్తూర్బా స్కూల్లో చదువుతోంది. ఆమెను చూసేందుకు పండగకు వస్తుండగా ఈ సంఘటన జరిగింది. మార్కాపురం బ్రిడ్జి వరకు వచ్చానని నా కొడుకుకు కూతురు బస్ లో నుంచి ఫోన్ చేసి చెప్పింది. కొద్ది సేపటికే బస్ కాలిపోయిందని మెసేజ్ లు వచ్చాయని బాధపడుతూ చెప్పింది.
కిరణ్ కుమార్, దాసరిపల్లి, ఉదయగిరి మండలం.
పది మందిని కాపాడాను. బస్ లోకి మంటలు రాగానే వెనుక వైపున ఉన్న డోర్ తీసి పది మందిని కిందకు నెట్టి నేను కూడా దూకేసాను. లేకుంటే వారు కూడా కాలిపోయేవారేనని చెప్పారు. డోర్ ఎలా తీయాలని అనిపించిందని అడగ్గా బస్ ఎక్కినప్పుడు అక్కడ ఎమర్జెన్సీ డోర్ ఉండటాన్ని చూశానని, బ్యాగ్ కూడా అక్కడే పెట్టానని చెప్పారు. కిరణ్ కుమార్ వల్ల పది మంది ప్రాణాలతో బయట పడ్డారు.
నల్లూరి యోహాను, ప్రత్యక్ష సాక్షి.
నేను ఏడు గంటలకు ఇక్కడికి వచ్చాను చూడగానే చాలా మంది బస్లో కాలిపోతున్నారు. అప్పటికే అంబులెన్స్ వచ్చింది. ఫైర్ సిబ్బంది బాధితులను బస్ నుంచి బయటకు లాగి ఆస్పత్రికి తరలించారు. బస్, టిప్పర్ రెండూ ఎదురెదురు రావడంతో టిప్పర్ బస్ ఎడమ వైపు పూర్తిగా ఢీకొట్టింది. బస్ ఎడమ భాగం నుజ్జునుజ్జయింది. ట్యాంకర్ నుంచి డీజిల్ బయటకు వచ్చి మంటలు వ్యాపించాయని తెలిపారు. బస్ డ్రైవర్ ఎడమవైపుకు రాకుండా కుడివైపుకు రావడంతోనే ప్రమాదం జరిగిందని చెప్పారు.
డీఎంహెచ్వో శ్రీవాణి
కలెక్టర్ ఆఫీసులో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసి బంధువులకు సహాయం అందిస్తున్నాము. డీఎన్ఏ టెస్ట్ రిపోర్టులు రాగానే బాధితులకు శవాలను అప్పగిస్తామని జిల్లా వైద్యాధికారి శ్రీవాణి ది ఫెడరల్ ప్రతినిధికి తెలిపారు. బాధితులందరికీ తగిన వైద్యం సాయం అందిస్తున్నామన్నారు.
ప్రస్తుతం 15 మంది వరకు ఒంగోలు RIMSలో చికిత్స పొందుతున్నారు. “నిన్న 14 సాంపుల్స్ ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపించాం. రిపోర్టు రావడానికి రెండు రోజులు పడుతుంది. ఆ తర్వాత శవాలను అప్పగిస్తాం.” అని శ్రీవాణి తెలిపారు.

