ఇపుడు సెంట్రల్ ఇండియాతో విశాఖ తూర్పతీరానికి పెద్దగా లింక్ లేదు. అలాగే విశాఖ పట్టణం నుంచి దేశరాజధాని ఢిల్లీకి నేరుగారోడ్డు మార్గం. ఇపుడు విశాఖ నుంచి ఢిల్లీ వెళ్లాలంటే విజయవాడ, హైదరాబాద్, నాగపూర్ మీదుగా వెళ్లాల్సింది. ఇపుడు వేస్తున్న విశాఖపట్నం- రాయ్ పూర్ ఆరు లేన్ల కొత్త రోడ్డు పూర్తయితే ఢిల్లీ, విశాఖ దగ్గరవుతాయి.డైరెక్టుగా ఈ రోజు ఢిల్లీదాకా వెళ్లకపోయినా ఇది NH 44, NH 30 లను క్రాస్ చేస్తుంది. NH 44 కాశ్మీర్-కన్యాకుమారి రోడ్డు. NH 30 అనేది విజయవాడ సమీపంలోని ఇబ్రహీం పట్నం నుంచి ఉత్తరాఖండ్ లోని సితార్ గంజ్ (Sitarganj)దాకా ఉంటుంది. అంటే విశాఖ- రాయ్ పూర్ రోడ్డు పూర్తయితే, విశాఖ నుంచి రోడ్డు మార్గాన ఢిల్లీకి రవాణా సులువు అవుతుంది.
నేషనల్ హైవే మీద 465 కి.మీలు ప్రయాణించాలంటే కనీసం పది గంటల సమయం పడుతున్న రోజులివి. కానీ ఆ దూరాన్ని కేవలం ఆరు గంటల్లోనే చేరుకుంటే? ఇది ఊహ కాదు. కల కాదు... వందే భారత్ రైలు ప్రయాణం కాదు.. త్వరలోనే కార్యరూపం దాల్చబోతున్న ఆ హైవే పేరు వైజాగ్–రాయ్‌పూర్ గ్రీన్‌ఫీల్డ్ ఎక్స్‌ప్రెస్ వే Vizag-Raiput Greenfield Highway). మూడు రాష్ట్రాల మీదుగా సాగే ఈ హైవేపై కేవలం భారీ వాహనాలకే తప్ప టూ వీలర్లకు ఎంట్రీ లేదు. రైలు వేగాన్ని తలదన్నే ఆ రోడ్డు విశేషాలు తెలుసుకోవాలని ఉందా? అయితే ఈ కథనం చదవండి!
వైజాగ్–రాయ్‌పూర్ హైవే ఇలా ఉంటుంది..
భారత్‌మాల పరియోజన ప్రాజెక్టులో..
దేశ ఆర్థిక వృద్ధిని బలోపేతం చేయాలన్న ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం భారత్‌మాల పరియోజనలో భాగంగా ఎకనామిక్ కారిడార్ ప్రాజెక్టు నిర్మాణాన్ని చేపట్టింది. ఈ ప్రాజెక్టులో విశాఖపట్నం నుంచి రాయ్‌పూర్ వరకు సుమారు 465 కి.మీల పొడవున ఆరు లైన్ల హైవే నిర్మాణానికి శ్రీకారం చుట్టింది. దీనికి 2017లో ఆమోదం లభించినా పలు అవాంతరాలు ఎదురయ్యాయి. మూడు రాష్ట్రాల (ఆంధ్రప్రదేశ్, ఒడిశా, ఛత్తీస్‌గఢ్) మీదుగా సాగుతున్న ఈ హైవే నిర్మాణానికి భారీగా భూ సేకరణ అవసరమైంది. ప్రారంభంలో భూ సేకరణలో ఇబ్బందులు, రైతుల ఆందోళనలు, న్యాయపరమైన చిక్కులు ఈ రోడ్డు నిర్మాణ పనుల ప్రారంభానికి ఇబ్బందులను తెచ్చిపెట్టాయి. ఇప్పటికీ దీంతో 2024 నాటికి పూర్తి కావలసిన ఈ ప్రాజెక్టు రెండేళ్లు ఆలస్యమైంది. ఈ హైవే అందుబాటులోకి వస్తే ప్రయాణ సమయం గణనీయంగా తగ్గుతుంది. ఉత్తరాంధ్ర ఒక కీలకమైన ఆర్థిక కారిడార్‌గా మారుతుంది.
మార్గమధ్యలో ట్రంపెట్ ఇంటర్ ఛేంజ్..
2022లో ప్రధాని మోదీ శంకుస్థాపన..
విశాఖపట్నం–రాయ్‌పూర్ ఎక్స్‌ప్రెస్ హైవేకి 2022లో ప్రధాని నరేంద్రమోదీ శంకుస్థాపన చేశారు. ఎన్‌హెచ్ 130 సీడీ పేరిట రూ.16,482 కోట్ల ఏడీబీ నిధులతో నిర్మాణాన్ని చేపట్టారు. రెండేళ్లలోనే దాదాపు 80 శాతం పనులు పూర్తి కాగా మిగిలినవి శరవేగంగా పూర్తి చేసేందుకు కాంట్రాక్టు సంస్థలు కృషి చేస్తున్నాయి. ఈ హైవే పూర్తయ్యాక ప్రధాని మోదీ ప్రారంభించనున్నారు.
వైజాగ్–రాయ్‌పూర్ ఎక్స్‌ప్రెస్ వే
ఎక్కడ నుంచి ఎక్కడకు? ఎలా?
వైజాగ్–రాయ్‌పూర్ హైవే ఆంధ్రప్రదేశ్‌లోని అనకాపల్లి జిల్లా సబ్బవరం ఎన్‌హెచ్– 16 నుంచి ^è త్తీస్‌గఢ్‌లోని అభయాన్‌పురం వద్ద ముగుస్తుంది. ఇది ఏపీలోని 54 గ్రామాల మధ్య నుంచి వెళ్తోంది. మొత్తం 465 కి.మీల మేర యాక్సెస్ ఈ గ్రీన్‌ఫీల్డ్ ఎకనామిక్ కారిడార్ (హైవే) నిర్మాణాన్ని చేపట్టారు. చత్తీస్‌గఢ్‌లో 124 కి.మీలు, ఒడిశాలో 240 కి.మీలు, ఆం«ధ్రప్రదేశ్‌లో 100 కి.మీల మేర నిర్మాణం జరుగుతోంది. ఏపీలో విజయనగరం జిల్లా సాలూరు నుంచి సబ్బవరం వరకు ఆరు వరసల రోడ్డు వేశారు. కొండలను తొలచుకుంటూ టన్నెల్స్ (సొరంగ మార్గాల)ను నిర్మించారు.
ఆరు గంటల్లోనే రాయ్‌పూర్‌కు..
విశాఖపట్నం–రాయ్‌పూర్‌ల మధ్య దూరం 597 కి.మీలు. విశాఖ నుంచి సాలూరు, కోరాపుట్, జైపూర్ (ఒడిశా) మీదుగాను, లేనిపక్షంలో బొబ్బిలి, పార్వతీపురం, రాయగడల వైపు నుంచి రాయ్‌పూర్‌కు రాకపోకలు సాగిస్తున్నారు. ప్రస్తుతం ఈ రోడ్డుపై ప్రయాణానికి 12–13 గంటల సమయం పడుతోంది. రైలులో వెళ్లాలన్నా అంతే టైమ్ తీసుకుంటుంది. ఇప్పడు ఈ రెండు నగరాల మధ్య కొత్త హైవే దూరం 465 కి.మీలు మాత్రమే ఉంటుంది. అంటే.. ప్రస్తుత రోడ్డు మార్గం కంటే 132 కి.మీల దూరం తక్కువ. ఈ కొత్త ఎక్స్‌ప్రెస్ వే అందుబాటులోకి వస్తే ఆరు గంటల్లోనే చేరుకోవచ్చు. ఇలా రవాణా సమయం ఆరు గంటలు తగ్గడమే కాక ఇంధన వ్యయం కూడా భారీగా తగ్గుతుంది.
వంద కి.మీల వేగంతో రయ్‌రయ్..
ఈ హైవే నిర్మాణం పూర్తయితే విశాఖ పోర్టు నుంచి రాయ్‌పూర్ వరకు వాహనాలు గంటకు వంద కిలోమీటర్ల వేగంతో దూసుకుపోవచ్చు. వివిధ దేశాలకు ఎగుమతయ్యే వస్తువులు, వచ్చే దిగుబడులు ఈ హైవే ద్వారానే పెద్ద ఎత్తున సాగే అవకాశాలుంటాయి. ఇప్పటివరకు రవాణా సౌకర్యం సరిగా లేకపోవడంతో రాయ్‌పూర్ నుంచి విశాఖ పోర్టు వరకు సరకు రవాణా చేయడానికి అనేక ఇబ్బందులు తలెత్తేవి. ఇకపై ఆ ఇబ్బందులు తొలగుతాయి. ఈ హైవేపై ఈ రెండు నగరాల మధ్య ఆరు గంటల ప్రయాణ సమయమే పడుతుండడంతో షిప్పింగ్ ద్వారా జరిగే వ్యాపార, వ్యవహారాలు మరింత పెరిగే అవకాశం ఉంది. గిరిజన మారుమూల ప్రాంతాలకు వేగవంతమైన యాక్సెస్ రోడ్డు అవుతుంది.
పారిశ్రామికాభివృద్ధికి దోహదం..
రాయ్‌పూర్–విశాఖ ఎక్స్‌ప్రెస్ హైవే పారిశ్రామికాభివృద్ధికి ఎంతగానో దోహద పడుతుంది. కార్గో రవాణాకు కీలకంగా మారుతుంది. విశాఖపట్నం, గంగవరం పోర్టుల నుంచి రాష్ట్రంతో పాటు ఒడిశా, చత్తీస్‌గఢ్‌లకు కార్గో రవాణకు ఈ రహదారే రాచబాట అవుతుంది. విశాఖ స్టీల్‌ప్లాంట్, భిలాయ్ స్టీల్‌ప్లాంట్ (చత్తీస్‌గఢ్), బైలదిల్లా (చత్తీస్‌గఢ్)లోని నేషనల్ మినరల్ డెవలప్‌ఎమంట్ కార్పొరేషన్, దామన్‌జోడి (ఒడిశా)లోని నేషనల్ అల్యూమినియం కార్పొరేషన్, సునాబెడా (ఒడిశా)లోని హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ వంటి కీలక పారిశ్రామిక కేంద్రాలను ఈ హైవే అనుసంధానిస్తుంది. ఫలితంగా ఉద్యోగ, ఉపాధి అవకాశాలతో పాటు ప్రత్యక్షంగాను, పరోక్షంగాను ఈ ప్రాంత ఆర్థిక పరిపుష్టితో పాటు ఉపాధి అవకాశాలు మెరుగవుతాయి. వ్యాపారం, రవాణా మరింత వేగవంతమవుతుంది.
టూ వీలర్లకు నో ఎంట్రీ..
ఈ హైవేపై కేవలం భారీ వాహనాలకే తప్ప ద్విచక్ర వాహనాలకు అనుమతి లేదు. ఏపీ పరిధిలో కేవలం ఆరు చోట్ల మాత్రమే ఈ రోడ్డులోకి ప్రవేశించేందుకు వీలుంటుంది. దీనికిరువైపులా సర్వీసు రోడ్లుండవు. సబ్బవరం వద్ద చెన్నై–కోల్‌కతా హైవేలో ఈ హైవే మొదలయ్యే చోట సింగిల్ ట్రంపెట్ ఇంటర్ చేంజ్ నిర్మిస్తున్నారు. ఈ హైవేపై సోలార్‌తో కూడిన సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. వాహనాల వేగ నియంత్రణ, ప్రమాదాలపై పరిశీలించేందుకు వీలుగా వీటిని అమర్చారు. ప్రతి 2 కి.మీలకు ఒక చోట టెలిఫోన్ సదుపాయం ఉంటుంది. టోల్ ప్లాజాల వద్ద రోడ్డు దిగేందుకు ప్రత్యామ్నాయ రోడ్లను నిర్మిస్తున్నారు.
డిసెంబరు నుంచి వాహనాల పరుగులు..
అనకాపల్లి జిల్లా సబ్బవరం వద్ద కోల్‌కతా–చెన్నై నేషనల్ హైవే మొదలుకుని విజయనగరం, పార్వతీపురం మన్యం జిల్లా పాచిపెంట మండలం బంగారుగుడి గ్రామం దాటాక ఒడిశాలోకి ప్రవేశిస్తుంది. 5.5 కి.మీల మేర పార్వతీపురం మన్యం జిల్లా అటవీ ప్రాంతంలోని ఘాట్ సెక్షన్‌లో తుది దశ పనులు జరుగుతున్నాయి. కొత్తవలస మండలం చిన్నిపాలెంలో 2.5 కి.మీల, మెంటాడ మండలం జయతిలో 250 మీటర్ల మేర భూసేకరణ సమస్యతో పనులు ఇంకా మొదలు పెట్టలేదు. ఈ భూ సమస్య ప్రస్తుతం కోర్టు వివాదంలో ఉండడం ఆలస్యానికి కారణమవుతోంది. విజయనగరం, పార్వతీపురం మన్యం జిల్లాల్లో ఇంటర్ చేంజ్‌ల నిర్మాణం పూర్తయింది. ఈ హైవే పనులు ఏపీలో 92 శాతం పూర్తి కాగా ఒడిశా, చత్తీస్‌గఢ్‌లో డిసెంబర్ నాటికి కొలిక్కి వస్తాయని అంచనా వేస్తున్నారు. అనంతరం ఈ హైవేపై వాహనాల రాకపోకలకు అనుమతిస్తారు. ఈ హైపే అందుబాటులోకి వస్తే తూర్పు భారతదేశ ఆర్థిక రంగానికి కొత్త దిశగా మారనుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.
వైజాగ్ డెవలప్‌మెంట్ కౌన్సిల్ చైర్మన్ ఒ. నరేష్‌కుమార్
రాయ్‌పూర్ హైవేతో ఎన్నో ప్రయోజనాలు..
‘వైజాగ్–రాయ్‌పూర్ హైవే అందుబాటులోకి వస్తే ఈ రెండు నగరాల మధ్య ప్రయాణ సమయం సగానికి తగ్గుతుంది. లాజిస్టిక్స్ కాస్ట్ తగ్గుతుంది. సెంట్రల్ ఇండియా, తూర్పు ఇండియా మధ్యవాణిజ్య రవాణాకు బాగా దోహడపుతుందని వైజాగ్ డెవలప్‌మెంట్ కౌన్సిల్ చైర్మన్ ఒ. నరేష్‌కుమార్ ‘ద ఫెడరల్ ఆంధ్రప్రదేశ్’ ప్రతినిధితో చెప్పారు తూర్పు తీరాన్న ఉన్న పోర్టులు, పారిశ్రామిక కేంద్రాలకు సెంట్రల్ ఇండియాతో మెరుగైన కనెక్టివిటీ కల్పిస్తుందని వేగవంతమైన వాణిజ్య ఎగుమతులకు దోహదపడుతుందని ఆయన అన్నారు. "ఈ హైవే ద్వారా చత్తీస్‌గఢ్, ఒడిశా రాష్ట్రాల్లోని పారిశ్రామిక ఉత్పత్తులు, ఖనిజాలను విశాఖ ఓడరేవుకు వేగంగా రవాణా చేసేందుకు వీలవుతుంది. ఇతర సరకు రవాణా కూడా సులభమవుతుంది. ఈ రెండు నగరాల మధ్య ప్రజా రవాణా కూడా వేగంగా సాగేందుకు దోహదపడుతుంది. విజయనగరం, పార్వతీపురం మన్యం జిల్లాలో పారిశ్రామిక ప్రగతికి తోడ్పడుతుంది. ఈ లెక్కన సెంట్రల్ ఇండియా మీదుగా దేశరాజధానికి కూడా విశాఖతో కనెక్టివిటీ ఏర్పాటుఅవుతుంది,’ నరేష్‌కుమార్ చెప్పారు.