ప్రపంచ నౌకల ప్రదర్శనకు విశాఖ వేదిక
x
పీఎఫ్‌ఆర్‌లో బారులు తీరిన యుద్ధనౌకలు (ఫైల్‌ ఫోటో)

ప్రపంచ నౌకల ప్రదర్శనకు విశాఖ వేదిక

ఎంతో ప్రతిష్టాత్మకంగా భావించే ఐఎఫ్‌ఆర్, మిలాన్, ఐయాన్స్‌ వంటి కార్యక్రమాలకు విశాఖ వేదికగా మారింది.

విశాఖ సాగరతీరం తరచూ ఏదో ఒక ప్రత్యేకతను సంతరించుకుంటూనే ఉంటుంది. తూర్పు నావికాదళ ప్రధాన కేంద్రం విశాఖలో ఉండడం అందుకు సంబంధించిన కార్యక్రమాలకు వేదిక అవుతోంది. ఫలితంగా ఈ మహా నగరం ప్రపంచ దృష్టిని ఆకర్షిస్తోంది. ఇప్పుడు మునుపెన్నడూ లేని విధంగా మూడు ప్రతిష్టాత్మక అంతర్జాతీయ మారిటైమ్‌ ఈవెంట్స్‌కు భారత్‌ తరఫున విశాఖ నగరంలో ఆతిథ్యమిస్తోంది. భారత ప్రభుత్వం ఇంటర్నేషనల్‌ ఫ్లీట్‌ రివ్యూ (ఐఎఫ్‌ఆర్‌), మల్టీ లాటరల్‌ నేవల్‌ ఎక్సర్‌సైజెస్‌ (మిలాన్‌), ఇండియన్‌ ఓషన్‌ నేవల్‌ సింపోజియం (ఐయాన్స్‌)లను వరుసగా నిర్వహిస్తోంది. భారత్‌ మూడు ప్రతిష్టాత్మక అంతర్జాతీయ మారిటైమ్‌ ఈవెంట్స్‌కు ఆతిథ్యమిస్తోంది.


రిహార్సల్‌లో భాగంగా హెలికాప్టర్‌ విన్యాసం

ఈరోజు నుంచి పది రోజుల పాటు..
విశాఖ సాగరతీరం వేదికగా ఐఎఫ్‌ఆర్, మిలాన్, ఐయాన్స్‌ కార్యక్రమాలు జరగనున్నాయి. సోమవారం నుంచి పది రోజుల పాటు అంటే ఈనెల 25 వరకు వీటిని నిర్వహించనున్నారు. సోమ, మంగళవారాల్లో ఐఎఫ్‌ఆర్‌కు సంబంధించి సన్నాహక విన్యాసాలు (ఎక్సర్‌సైజ్‌లు) నిర్వహిస్తారు. 18న ఐఎఫ్‌ఆర్, 19న మిలాన్, 20న ఐయాన్స్‌ ఉంటాయి.

సాగరతీరంలో రిహార్సల్స్‌లో పాల్గొన్న యుద్ధ ట్యాంకు

ఐఎఫ్‌ఆర్‌కు రాష్ట్రపతి ముర్ము రాక..
ఐఎఫ్‌ఆర్‌లో పాల్గొనేందుకు భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము విశాఖ వస్తున్నారు. మంగళవారం ఆమె ఢిల్లీ నుంచి విశాఖ చేరుకుంటారు. 18న బుధవారం జరిగే ఐఎఫ్‌ఆర్‌లో పాల్గొంటారు. యాంకరేజి ఏరియాలో దేశ, విదేశాలకు చెందిన యుద్ధ నౌకలు, ఎయిర్‌క్రాఫ్ట్‌లు, జలాంతర్గాములను తిలకిస్తారు. ఇందుకోసం ఐఎన్‌ఎస్‌ సుమేధను ప్రెసిడెన్షియల్‌ యా^Œ గా సిద్ధం చేశారు. ఈ యాచ్‌లో ప్రయాణిస్తూ సముద్రంలో లంగరు వేసిన యుద్ధనౌకలు, ఎయిర్‌క్రాఫ్ట్‌లను సమీక్షిస్తారు. ఈ సందర్భంగా 21 గన్‌ల ఫైరింగ్‌తో రాష్ట్రపతి ముర్ముకి గౌరవ వందనాన్ని సమర్పిస్తారు.

ఐఎఫ్‌ఆర్‌ ఎందుకోసమంటే..?
హిందూ మహాసముద్రం ప్రాంతంలో సముద్ర భద్రత, పరస్పర సహకారం, సముద్ర దౌత్యం పెంచే లక్ష్యంతో ఈ ఐఎఫ్‌ఆర్‌ను నిర్వహిస్తున్నారు. ఐఎఫ్‌ఆర్‌ ద్వారా భారత్‌ తన నావికాదళ పటిష్టతను, ప్రతిభా పాటవాలను ప్రపంచానికి చాటి చెబుతుంది. 2001 నుంచి ఐఎఫ్‌ఆర్‌ సంప్రదాయం మొదలైంది. దేశంలో ఇప్పటివరకు రెండు ఐఎఫ్‌ఆర్‌లు జరిగాయి. గతంలో 2016లో జరిగిన ఐఎఫ్‌ఆర్‌కు కూడా విశాఖే వేదికైంది. ఇప్పడు మూడో ఐఎఫ్‌ఆర్‌కు కూడా విశాఖే ఆతిథ్యమిస్తుండడం విశేషం. ఈ తరహా ఒకే చోట మూడు మారిటైమ్‌ ఈవెంట్లు నిర్వహించడం ఇదే తొలిసారి. ప్రతి పదేళ్లకోసారి ఐఎఫ్‌ఆర్‌ జరగనుండగా, రెండేళ్లకోసారి మిలాన్‌ నిర్వహిస్తారు. 1995లో నాలుగు దేశాలతో మొదలైన మిలాన్‌లో ఇప్పడు 65 దేశాలు భాగం పంచుకుంటున్నాయి.
50 దేశాల నుంచి 71 యుద్ధనౌకలు..
ఐఎఫ్‌ఆర్‌లో పాల్గొనడానికి ప్రపంచ వ్యాప్తంగా 50 దేశాల నుంచి 71 అత్యాధునిక యుద్ధనౌకలు భాగస్వామ్యం అవుతున్నాయి. వీటిలో 19 విదేశీ నౌకలున్నాయి. మరో 50 ఎయిర్‌క్రాఫ్ట్‌లు పాల్గొంటున్నాయి. విమాన వాహక యుద్ధనౌక ఐఎన్‌ఎస్‌ విక్రాంత్‌ సహా దాదాపు 25 వరకు యుద్ధనౌకలు ఇప్పటికే విశాఖ చేరుకున్నాయి.
ఐఎఫ్‌ఆర్‌లో పాల్గొనే యుద్ధనౌకలివే..
ఇంకా ఈ ఫ్లీట్‌ రివ్యూలో భారత్‌కు చెందిన ఎయిర్‌క్రాఫ్ట్‌ క్యారియర్‌ ఐఎన్‌ఎస్‌ విక్రమాదిత్య, విశాఖపట్నం క్లాస్‌ డిస్ట్రాయర్స్, ఐఎన్‌ఎస్‌ విక్రమాదిత్య ఎయిర్‌క్రాఫ్ట్‌ క్యారియర్, విశాఖపట్నం క్లాస్‌ డిస్ట్రోయర్స్, నీల్‌గిరి క్లాస్‌ ఫ్రిగేట్స్, అర్నాల క్లాస్‌ యాంటీ సబ్‌మెరైన్‌ వార్‌ఫేర్‌ కార్వెట్టీస్, ఇండియన్‌ కోస్ట్‌ గార్డ్‌ వెస్సల్స్‌ పాలు పంచుకుంటున్నాయి. ఇక విదేశీ యుద్ధనౌకల్లో బీఆర్‌పీ మిగ్యుయెల్‌ మల్వార్‌ (ఎఫ్‌ఎఫ్‌జీ–06 ఫిలిప్పీన్స్‌), ఎస్‌సీజీఎస్‌ జొరోస్టర్‌ (పి609 సియాచెల్స్‌), సీజీఎస్‌ హరువీ (మాల్దీవ్స్‌), వీపీఎన్‌ఎస్‌ 17 (వియత్నాం), అల్‌ ఎమిరేట్‌ (యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌), హెచ్‌ఎంఎఎస్‌ వార్ముంగా (ఆస్ట్రేలియా), హెచ్‌టీఎంఎస్‌ క్రాబి (థాయ్‌లాండ్‌), ఎస్‌ఎల్‌ఎన్‌ఎస్‌ నంది మిత్ర అండ్‌ ఎస్‌ఎల్‌ఎన్‌స్‌ సాగర (శ్రీలంక), రష్యన్‌ నేవీ ఫ్రిగేట్, పసిఫిక్‌ ఫ్లీట్‌ జెర్మన్‌ నేవీ వెస్సెల్స్‌తో పాటు యూఎస్, జపాన్, ఇరాన్, దక్షిణాఫ్రికా తదితర దేశాల నుంచి కూడా యుద్ధనౌకలు ఐఎఫ్‌ఆర్‌కు వస్తున్నాయి. ఫ్లీట్‌ రివ్యూలో యుద్ధనౌకలు ఆరు వరసల్లో మోహరిస్తాయి. ఈ వేడుకల్లో నాలుగు వేల మందికి పైగా విదేశీ అతిథులు పాల్గొంటున్నారు.
విశాఖలో ట్రాఫిక్‌ ఆంక్షలు..
ఐఎఫ్‌ఆర్, మిలాన్, ఐయాన్స్‌ కార్యక్రమాల నేపథ్యంలో విశాఖ నగరంలో పోలీసులు ట్రాఫిక్‌ ఆంక్షలు విధించారు. సోమవారం నుంచి ఈనెల 19 వరకు ఈ ఆంక్షలను అమలు చేయనున్నారు. ఈ కార్యక్రమాలు జరిగే ఆర్కే బీచ్, ఎన్టీఆర్‌ సర్కిల్, పార్క్‌ హోటల్‌ జంక్షన్ల వద్ద వాహనాలను దారి మళ్లిస్తున్నారు. సందర్శకులను సాయంత్రం 6 గంటల తర్వాతే అనుమతిస్తున్నారు. 18న ఫుల్‌ రిహార్సల్, 19న సిటీ పరేడ్‌ ఉన్నందున మధ్యాహ్నం ఒంటి గంట నుంచి రాత్రి తొమ్మిది వరకు పాస్‌లు లేనివారిని బీచ్‌ రోడ్డులోకి అనుమతించరు. కలెక్టరేట్‌ జంక్షన్, సీఆర్‌ రెడ్డి జంక్షన్, పాండురంగాపురం, నేవల్‌ క్యాంటీన్, పందిమెట్ట ప్రాంతాల నుంచి బీచ్‌ వైపు వెళ్లే మార్లాన్నిటినీ మూసివేస్తారు. పాస్‌లు లేని సాధారణ ప్రజలు తమ వాహనాలను ఎంజీఎం గ్రౌండ్స్, ఏయూ సమతా హాస్టల్‌ గ్రౌండ్, జెడ్పీ ప్రాంగణం/మెడికల్‌ కాలేజీ గ్రౌండ్‌లో పార్కింగ్‌కు వీలు కల్పించారు. ఆర్టీసీ బస్సుల్లో వచ్చే వారు జగదాంబ, జీసీసీ జంక్షన్ల వద్ద దిగి కాలి నడకన బీచ్‌ రోడ్డులోని ఎన్‌క్లోజర్లలోకి వెళ్లాలి. కాగా ఈనెల 17 నుంచి 19 వరకు ఉదయం 7 నుంచి రాత్రి 10 గంటల వరకు కాన్వెంట్‌ జంక్షన్‌ నుంచి షీలానగర్, సింథియా మార్గాల్లో భారీ వాహనాలను పూర్తిగా నిషేధించినట్టు నగర పోలీస్‌ కమిషనర్‌ శంఖబ్రత బాగ్చీ తెలిపారు.
Read More
Next Story