ఉమ్మడి ‘విశాఖ’లో మూకుమ్మడి ‘ఉత్సవ్‌’!
x
విశాఖ ఉత్సవ్‌ బ్రోచర్‌ను ఆవిష్కరిస్తున్న మంత్రులు, ఎమ్మెల్యేలు

ఉమ్మడి ‘విశాఖ’లో మూకుమ్మడి ‘ఉత్సవ్‌’!

కూటమి ప్రభుత్వం సీ టూ స్కై పేరిట ఈనెల 24 నుంచి ఫిబ్రవరి ఒకటి వరకు ఉమ్మడి విశాఖ జిల్లాలో విశాఖ ఉత్సవ్‌ (బిగ్గెస్ట్‌ బీచ్‌ ఫెస్టివల్‌)ను నిర్వహించనుంది.

తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు విశాఖ ఉత్సవ్‌ను దాదాపు క్రమం తప్పకుండా నిర్వహించేది. డిసెంబర్‌/జనవరి నెలల్లో విశాఖ సాగరతీరంలో అట్టహాసంగా విశాఖ ఉత్సవ్‌ పేరిట హంగామా చేసేది. 2019లో వైఎస్సార్‌సీపీ అధికారాన్ని చేపట్టాక ఆ ఏడాది నిర్వహించింది. ఆ తర్వాత ఆ ఉత్సవ్‌కు మంగళం పాడింది. ఆరేళ్ల తర్వాత మళ్లీ ఇప్పుడు విశాఖ ఉత్సవ్‌కు కూటమి సర్కార్‌ తయారవుతోంది. అయితే ఈసారి ఉత్సవ్‌కు ఓ ప్రత్యేకత ఉంది. గతంలో టీడీపీ ప్రభుత్వం ఈ ఉత్సవ్‌ను నిర్వహించిన సమయంలో విశాఖపట్నం జిల్లా ఒక్కటే ఉండేది. కానీ నాలుగేళ్ల క్రితం వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం ఈ జిల్లాను విశాఖపట్నం, అనకాపల్లి, అల్లూరి సీతారామరాజు జిల్లాలుగా విభజించింది. దీంతో ఇప్పుడు ఆ మూడు జిల్లాలను కలుపుకుని విశాఖపట్నం, అనకాపల్లి, అరకులోయల్లో విశాఖ ఉత్సవ్‌ను ఉమ్మడిగా నిర్వహించాలని నిర్ణయించింది. గతంలో మూడు నాలుగు రోజులకే పరిమితమైన ఈ ఉత్సవ్‌ ఈసారి తొమ్మిది రోజుల పాటు అంటే ఈనెల 24 నుంచి ఫిబ్రవరి 1వ తేదీ వరకు కొనసాగించనుంది. తద్వారా దేశంలోనే బిగ్గెస్ట్‌ బీచ్‌ ఫెస్టివల్‌గా పర్యాటకరంగంలో సరికొత్త చరిత్ర సృష్టించాలని తపిస్తోంది.


గతంలో ఆర్కే బీచ్‌లో నిర్వహించిన విశాఖ ఉత్సవ్‌ (ఫైల్‌ ఫోటో)

సీ టూ స్కై ట్యాగ్‌ లైన్‌తో..
ఈసారి విశాఖ ఉత్సవ్‌కు ‘సీ టూ స్కై’ (సాగరం నుంచి ఆకాశం వరకు) అనే ట్యాగ్‌ లైన్‌ను తగిలించింది. ఈ ఉత్సవాల ద్వారా ఉత్తరాంధ్ర ప్రాంతంలో రూ.500 కోట్ల ఆర్థిక లావాదేవీలు జరుగుతాయని అంచనా వేస్తున్నారు. తద్వారా మూడు వేల మందికి ఉపాధి లభిస్తుందని భావిస్తున్నారు. విశాఖ ఉత్సవ్‌కు సుమారు పది లక్షల మంది సందర్శకులు వస్తారని ప్రభుత్వ యంత్రాంగం అంచనా వేస్తోంది. మూడు వేల మందికి ప్రత్యక్ష, 1,800 మందికి సహాయక సిబ్బందికి పరోక్ష ఉపాధి అవకాశాలు లభిస్తాయని చెబుతోంది.

విశాఖ ఉత్సవ్‌కు జ్యోతి ప్రజ్వలన చేస్తున్న మంత్రులు

ఈ ఉత్సవ్‌లో ఏమేమి ఉంటాయంటే?
ఈ ఉత్సవ్‌లో భాగంగా ఈ మూడు జిల్లాల్లోని 20 ప్రధాన కేంద్రాల్లో 500కు పైగా సాంస్కృతిక, పర్యాటక కార్యక్రమాలను ఏర్పాటు చేస్తున్నారు. ఈ వేడుకల్లో 650 మందికి పైగా స్థానిక, జాతీయ స్థాయి కళాకారులు పాల్గొంటున్నారు. విశాఖ ఆర్కే బీచ్‌ నుంచి భీమిలి వరకు 26 కి.మీల మేర సాగరతీరం ప్రధాన వేదికగా ఉత్సవ్‌ను నిర్వహిస్తారు. ఇంకా అడ్వెంచర్‌ స్పోర్ట్సు, బీచ్‌ వాలీబాల్, కబడ్డీ, బోట్‌ రైడింగ్, హెలికాప్టర్‌ రైడ్స్, హాట్‌ ఎయిర్‌ బెలూన్, సైక్లింగ్‌ వంటివి ఉంటాయి. వీటితో పాటు కిడ్స్‌ టాలెంట్, ముగ్గుల పోటీలు, వంటల పోటీలు, రంగోలీ, పాటలు, నృత్య పోటీలుంటాయి. వీటితో పాటు మెడిటేషన్‌ సెషన్లు, జాతర, ఫ్రీ మార్కెట్, షాపింగ్, ఫుడ్‌ స్టాల్స్, విజిటర్‌ మార్కెట్‌ మెడిటేషన్, సెషన్లు, జాతర, ఫ్రీ మార్కెట్, కాన్సెర్ట్స్‌లను ఏర్పాటు చేస్తున్నారు.
ఎక్కడ ఏ వేడుక జరుగుతుందంటే?
విశాఖపట్నం జిల్లాలోః
విశాఖ ఆర్కే బీచ్ః ప్రధాన వేదిక. రోజూ సాయంత్రం 6 నుంచి రాత్రి 10 గంటల వరకు లైవ్‌ కచేరిలు, డ్రోన్‌ షోలు ఉంటాయి.
ఎంజీఎం గ్రౌండ్స్ః ప్రారంభ వేడుక, పోటీలు, సాంస్కృతిక కార్యక్రమాలు, పుష్ప ప్రదర్శన (ఫ్లవర్‌ షో), కిడ్స్‌ జోన్‌లు, ఫుడ్, షాపింగ్‌ స్టాల్స్‌.
రుషికొండ బీచ్ః సాహస, జలక్రీడలు, స్కూబా డైవింగ్, హెలికాప్టర్‌ రైడ్స్‌.
పోర్టు స్టేడియంః 50 శాతం తగ్గింపు ధరతో వినోద క్రీడలు, వాటర్‌ స్పోర్ట్స్‌.
సాగర్‌నగర్‌ బీచ్ః లైఫ్‌ స్టైల్, విశ్రాంతి జోన్‌లు.
భీమిలి బీచ్ః సాంస్కృతిక ప్రదర్శనలు, బోట్‌ రేస్‌లు (జనవరి 27–28), కార్నివాల్‌ వాక్‌ (జనవరి 31)
జనవరి 28, 29ః ఉదయం 10 నుంచి వంటల పోటీలు (సన్‌ ఇంటర్నేషనల్‌ కాలేజి)
అనకాపల్లి జిల్లాలోః
బొజ్జన్నకొండః ధ్యానం, వారసత్వ కార్యక్రమాలు
ఉపమాక, అనకాపల్లి నూకాంబిక ఆలయాలుః జానపద నృత్య కార్యక్రమాలు
కొండకర్ల ఆవః ఎకో–టూరిజం వర్క్‌షాపులు, హస్తకళలు, బోటింగ్‌.
ముత్యాలమ్మపాలెం, రేవు పోలవరం బీచ్‌లుః
పారామోటార్‌ రైడ్స్‌.
అనకాపల్లి బెల్లం మార్కెట్ః ఫ్రీ మార్కెట్, సామాజిక వినోదం.
ఎన్టీఆర్‌ స్టేడియంః సాంస్కృతిక ప్రదర్శనలు, స్టార్‌ కన్సెర్ట్స్ః 29న రామ్‌ మిరియాల లైవ్‌ పెర్ఫార్మెన్స్‌. 30న సునీత/భీమ్స్‌ సిసిరోలియో సంగీత విభావరి.
అల్లూరి జిల్లా అరకులోయలో..
జనవరి 30–ఫిబ్రవరి 1ః సైక్లింగ్‌ ట్రైల్స్, గిరిజన ఊరేగింపులు, జానపద ప్రదర్శనలు, నేచర్‌ వాక్స్, కాఫీ ఫెస్టివల్, ఎకో టూరిజం, అరకు పరిసర ప్రాంతాల్లో ప్రతిరోజూ సాంస్కృతిక, వినోద కార్యక్రమాలు.
ఏ జిల్లా విశిష్టతలు.. ఆ జిల్లావే..
విశాఖ ఉత్సవ్‌లో ఈ మూడు జిల్లాల ప్రత్యేకతలను, విశిష్టతలను బాహ్య ప్రపంచానికి తెలిసేలా ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. వీటిలో..
విశాఖపట్నం (సముద్రం, నగరం): అంతర్జాతీయ తీర ప్రాంత నగరం, ఓడరేవులు, సాంకేతికత, భారీ వినోద కార్యక్రమాలు, నైట్‌ లైఫ్‌.
అనకాపల్లి (సంస్కృతి, సమాజం, వినోదం): వారసత్వం, హస్తకళలు, ఎకో–టూరిజం, లైవ్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ హబ్‌లు, లాజిస్టిక్‌ కనెక్టివిటీ.
అరకు (ఆకాశం, ప్రకృతి, సంస్కృతి): ఎకో–టూరిజం, గిరిజన వారసత్వం, సాహస క్రీడలు, సాంస్కృతిక వినోదం, స్థిరమైన జీవనోపాధి.
విశాఖ ఉత్సవ్‌ నిర్వహణ వెనక..
విశాఖ ఉత్సవ్‌ ద్వారా ప్రభుత్వం అంతర్జాతీయ పెట్టుబడులను, పర్యాటకులను ఆకర్షించాలన్నది లక్ష్యం. మౌలిక సదుపాయాలు, పాలన, భద్రత, జీవనశైలి, అభివృద్ధి స్థాయిలో విశాఖ నగరం ప్రపంచంలోని తీర ప్రాంత నగరాలతో పోటీ పడగలదని చాటి చెప్పడం. వైజాగ్‌–అనకాపల్లి– అరకు కారిడార్‌ను ‘సీ టూ స్కై’ అనే కాన్సెప్ట్‌తో ప్రపంచ స్థాయి ఒకే పర్యాటక, అభివృద్ధి వారధిగా, లైఫ్‌ స్టైల్‌ గమ్యస్థానంగా నిలబెట్టడం.. వేలాదిగా ప్రత్యక్ష, పరోక్ష ఉపాధి అవకాశాలను సృష్టించడం వంటివి. ఈ ఉత్సవ్‌తో సుమారు రూ.500 కోట్లకు పైగా జీడీపీ ప్రభావం చూపడం ద్వారా స్థానిక జీవనోపాధి, ఆతిథ్యరంగాన్ని గణనీయంగా మెరుగు పరుస్తుందని ప్రభుత్వం అంచనా వేస్తోంది. కాగా విశాఖ ఉత్సవ్‌ జనవరి 24న విశాఖపట్నంలో ప్రారం¿¶ మై. ఫిబ్రవరి 1న అనకాపల్లిలో ముగుస్తుంది.
విశాఖలో కర్టెన్‌ రైజర్‌కు శ్రీకారం..
ఈనెల 24 నుంచి జరగనున్న విశాఖ ఉత్సవ్‌కు మంగళవారం రాత్రి మంత్రులు కర్టెన్‌ రైజర్‌ కార్యక్రమాని శ్రీకారం చుట్టారు. రాష్ట్ర మంత్రులు డోలా శ్రీబాల వీరాంజనేయస్వామి, కందుల దుర్గేష్, కొల్లు రవీంద్ర, వంగలపూడి అనిత, గుమ్మడి సంధ్యారాణి, ఎంపీ శ్రీభరత్, మూడు జిల్లాల ఎమ్మెల్యేలు, కలెక్టర్లు, టూరిజం కార్పొరేషన్‌ చైర్మన్‌ ఎన్‌.బాలాజీ, డైరెక్టర్‌ ఆమ్రపాలి తదితరులు పాల్గొన్నారు.
Read More
Next Story