విశాఖ ఉత్సవ్
x
విశాఖ ఉత్సవ్ లో కాళీమాత కళాకేళి..

ఏమి హాయిలే హలా, విశాఖ వెళితే పోలా!

కొత్త జంటల కుషీ కేంద్రం విశాఖ, సాగరతీరంలో సంబరాల జాతర


కొత్త జంటలు కుషీకుషీగా గడపడానికి అనువైన సెంటర్ విశాఖ.. ఆ బీచ్ లో అలా ఒకరి ఒళ్లో ఒకరు తలపెట్టి కూర్చుంటే ఎన్ని గంటలైనా అలా గడిపేయవచ్చు.. అటువంటి సాగర తీరాన్ని వర్ణించడం మాటల్లో సాధ్యం కాదు.. కచ్చితంగా చూసి తీరాల్సిందే. నిన్న సాయంత్రం ఈ విశాఖ తీరాన్ని మరిన్ని సొబగులు అద్దేలా సాగర తీరంలో సంబరాల జాతర జరిగింది.
పర్యాటక శాఖ ఆధ్వర్యంలో విశాఖపట్నం ఆర్కే బీచ్‌లో 'విశాఖ ఉత్సవ్‌-2026' అత్యంత వైభవంగా ప్రారంభమైంది. వేడుకల ఆరంభంలో కిలోమీటరు మేర నిర్వహించిన భారీ కార్నివాల్‌ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. కళాకారులు, క్రీడాకారులు, చిన్నారులు ఉత్సాహంగా పాల్గొన్న ఈ ర్యాలీకి ప్రజాప్రతినిధులు తోడవ్వడంతో కోలాహలం నెలకొంది. ప్రముఖ వ్యాఖ్యాత సుమ తనదైన శైలిలో అతిథులకు సాదర స్వాగతం పలికారు. అనంతరం 20 నిమిషాల పాటు సాగిన బాణసంచా ప్రదర్శన తీర ప్రాంతాన్ని వెలుగులతో నింపేసింది.

మంత్రముగ్ధులను చేసిన సంగీత విభావరి

ప్రముఖ గాయని సునీత, గాయకుడు ధనుంజయ్ తమ గీతాలతో ప్రేక్షకులను ఉర్రూతలూగించారు. ముఖ్యంగా "ప్రియతమా నీవచట కుశలమా..", "అందంగా లేనా.." వంటి పాటలకు యువత, మహిళలు కేరింతలు కొట్టారు. గాయని సునీతతో కలిసి సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేశ్‌, హోంమంత్రి అనిత గొంతు కలపడం విశేషం. అభిమానుల కోరిక మేరకు సునీత వారితో సెల్ఫీలు దిగి, కోరిన పాటలను ఆలపించి అలరించారు.
ఇక, కాళీమాత వేషధారణలో కళాకారులు చేసిన నృత్య ప్రదర్శన ప్రేక్షకులను కట్టిపడేసింది.

విశాఖ అందాలపై ప్రశంసల జల్లు

ఈ వేడుకల్లో నగర పోలీస్ కమిషనర్ శంఖబ్రత బాగ్చీ మాట్లాడుతూ, కొత్త జంటల హనీమూన్‌కు విశాఖపట్నం దేశంలోనే అత్యంత అనువైన ప్రాంతమని కొనియాడారు. కొండలు, సముద్రం కలగలిసిన ఇక్కడి ప్రకృతి సౌందర్యం మరెక్కడా ఉండదని తన వ్యక్తిగత అనుభవాలను పంచుకున్నారు.
జిల్లా కలెక్టర్‌ హరేంధిరప్రసాద్‌ మాట్లాడుతూ.. విశాఖ ప్రజలు ఎంతో సౌమ్యులని, ఇంతటి అందమైన నగరంలో కలెక్టర్‌గా పనిచేసే అవకాశం రావడం తన అదృష్టమని పేర్కొన్నారు.
Read More
Next Story