
అమరావతిలో నగరాలుగా మారనున్న గ్రామ కంఠాలు
అమరావతిలో గ్రామాలను నగరాల స్థాయికి తీసుకొచ్చే కార్యక్రమం కొనసాగుతోంది. ఆరు నెలల్లో మౌలిక సదుపాయాలు పూర్తవుతాయని మంత్రి నారాయణ చెప్పారు.
గత దశాబ్దంలో రాజకీయ సంక్షోభాలు, ల్యాండ్ పూలింగ్ వివాదాలు, నిర్మాణ ఆలస్యాలతో సాగిన అమరావతి ప్పుడు కొత్త మలుపు తీసుకుంది. రాజధాని నగరం నిర్మాణంలో గ్రామాలను ‘పక్కన పెట్టేయకుండా’ వాటిని సమానంగా ఒడిసిపట్టే వ్యూహం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం స్వీకరించింది. ప్రస్తుతం గ్రామ కంఠ భూముల్లో గ్రామాలు ఉన్నాయి. మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్, అర్బన్ డెవలప్‌మెంట్ మంత్రి పి. నారాయణ ఇటీవల అనంతవరం, నెక్కలు గ్రామాల్లో నిర్వహించిన గ్రామసభలు ఈ మార్పుకు స్పష్టమైన సంకేతం.
రాజధాని గ్రామాల్లో ఆరు నెలల్లో పనులు పూర్తి
ప్రస్తుతం రాజధాని పరిధిలోని గ్రామాల్లో అండర్‌గ్రౌండ్ వాటర్ పైప్‌లైన్లు, స్టార్మ్ వాటర్ డ్రైనేజీ, సిమెంట్ రోడ్లు, వీధి దీపాలు వంటి పనులు వేగంగా సాగుతున్నాయి. ఆరు నెలల్లోనే ఇవి పూర్తి చేస్తామని ప్రకటించడం ద్వారా ప్రభుత్వం ‘గ్రామాలను నగర స్థాయికి’ తీసుకు రావాలని సంకల్పించింది. ఇది కేవలం మౌలిక సదుపాయాల పనులకు మాత్రమే కాదు. అంగన్‌వాడీలు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, పాఠశాలలు, శ్మశానవాటికల వరకు విస్తరించింది. ఈ వ్యూహం గతంలో ఎదురైన ‘నగరం vs గ్రామం’ విభజనను అధిగమించి సమగ్ర అభివృద్ధిని లక్ష్యంగా పెట్టుకుంది.
టైమ్ లైన్ ఆహ్వానించ దగిందే కానీ...
ప్రభుత్వం ఇచ్చిన టైమ్‌లైన్‌లు ఆహ్వానించ దగినవే అయినా సవాలుతో కూడుకున్నవి. ఈ ఏడాది జూన్ నాటికి అధికారులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల నివాసాలు పూర్తి చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. 2027 జూన్ నాటికి 360 కి.మీ ట్రంక్ రోడ్లు, 1,500 కి.మీ లేఅవుట్ రోడ్లు పూర్తి కానున్నాయి. 2028 డిసెంబర్ నాటికి ఐకానిక్ భవనాలు నిర్మితమవుతాయి. ఇవన్నీ పూర్తి చేస్తామని పేర్కొనడం ద్వారా ప్రజలకు స్పష్టమైన రోడ్‌మ్యాప్ ప్రభుత్వం ఇచ్చింది. ప్రస్తుతం 30 వేల మంది కార్మికులు అమరావతి నిర్మాణంలో పనిచేస్తున్నారని మంత్రి నారాయణ చెప్పటం పనుల వేగాన్ని సూచిస్తోంది.
అయితే వాస్తవం ఏమిటంటే?
ల్యాండ్ పూలింగ్ సమస్యలు ఇప్పటికీ గ్రామాల వారీగా సాగుతున్నాయి. ఇన్నర్ రింగ్ రోడ్, కొత్త రైల్వే స్టేషన్, స్పోర్ట్స్ సిటీ వంటి ప్రాజెక్టులకు అదనపు భూమి సమీకరణం కీలకం. గ్రామసభల్లో స్థానికులు విన్నవించిన సమస్యలకు ‘వెంటనే చర్యలు’ అని హామీ ఇవ్వడం సానుకూలం. కానీ గత అనుభవాలు గుర్తు చేస్తున్నట్లు, హామీలు అమలు మధ్య అంతరం ఎంత ఉంటుందో చూడాలి.
చివరికి అమరావతి కేవలం ఒక నగరం కాదు. అది గ్రామాలతో కలిసి ఒక సమగ్ర రాజధాని అవ్వాలి. ఈ అభివృద్ధి పనులు పూర్తి అయితే స్థానికుల జీవన ప్రమాణాలు మారతాయి. రాజధాని ప్రాంతం పూర్తిగా మార్పు చెందుతుంది. కానీ ఆ మార్పు వాస్తవం కావాలంటే గ్రామాల సమస్యలు, భూమి సమస్యలు, సమయబద్ధత ఇవన్నీ ఒకేసారి సమతుల్యం చేయాల్సి ఉంటుంది. అదే నిజమైన ‘అంతర్జాతీయ స్థాయి’ అభివృద్ధి.

