
విజయవాడ టెర్రర్ లింకుల కేసు: రంగంలోకి ఎన్‌ఐఏ?
రెండు తెలుగు రాష్ట్రాలలో ఇప్పటివరకు 13 మందిపై పోలీసులు కేసులు నమోదు చేశారు.
దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన విజయవాడ ఉగ్ర లింకుల కేసు దర్యాప్తులో కీలక మలుపు చోటుచేసుకుంది. ఈ కేసును తమకు అప్పగించాల్సిందిగా ఎన్‌ఐఏ అధికారులు విజయవాడ పోలీస్ కమిషనర్‌కు అధికారికంగా లేఖ రాశారు. ఈ నెట్‌వర్క్ ఏడు రాష్ట్రాలతో ముడిపడి ఉన్నందున, సమగ్ర విచారణ కోసం జాతీయ సంస్థ దర్యాప్తు చేయడమే సరైనదని ఎన్‌ఐఏ భావిస్తోంది.
13 మందిపై కేసులు.. ముమ్మర విచారణ
ఉగ్రవాద కార్యకలాపాలకు పాల్పడుతున్నారన్న ఆరోపణలపై రెండు తెలుగు రాష్ట్రాలలో ఇప్పటివరకు 13 మందిపై పోలీసులు కేసులు నమోదు చేశారు. ప్రస్తుతం నిందితులు పోలీసు కస్టడీలో ఉన్నారు. కొత్తపేట పోలీసులతో పాటు, కౌంటర్ ఇంటెలిజెన్స్ (CI) అధికారులు, ఎన్‌ఐఏ ప్రతినిధులు సంయుక్తంగా వీరిని ప్రశ్నిస్తున్నారు. నిందితుల కస్టడీ గడువు ముగిసిన వెంటనే, కేసును అధికారికంగా ఎన్‌ఐఏకి అప్పగించే అవకాశం ఉంది.
పాక్ హ్యాండ్లర్లతో సంబంధాలు
విజయవాడ కేంద్రంగా సాగుతున్న ఈ కుట్ర వెనుక పాకిస్థాన్‌లోని హ్యాండ్లర్ల హస్తం ఉన్నట్టు కౌంటర్ ఇంటెలిజెన్స్ అధికారులు గుర్తించారు. మహమ్మద్ రహ్మతుల్లా షరీఫ్, మహమ్మద్ దానిష్, మీర్జా సోహైల్ వంటి నిందితులు సోషల్ మీడియా వేదికగా ఉగ్రవాద భావజాలాన్ని వ్యాప్తి చేస్తూ, విద్రోహ చర్యలకు వ్యూహరచన చేస్తున్నట్టు సమాచారం. విజయవాడ టాస్క్ ఫోర్స్, సి.ఐ. అధికారులు అత్యంత రహస్యంగా జరిపిన ఆపరేషన్‌లో వీరంతా పట్టుబడ్డారు.
ఏడు రాష్ట్రాల్లో నెట్‌వర్క్
విజయవాడలో దొరికిన నిందితులు కేవలం స్థానికంగానే కాకుండా, దేశంలోని మరో ఏడు రాష్ట్రాల్లోని ఉగ్ర సానుభూతిపరులతో సంబంధాలు కలిగి ఉన్నట్టు విచారణలో తేలింది. ఈ లింకులన్నీ దేశ భద్రతకు ముప్పు కలిగించే విధంగా ఉండటంతో, కేంద్ర హోంశాఖ ఆదేశాల మేరకు ఎన్‌ఐఏ రంగంలోకి దిగింది. ఉగ్రవాద కార్యకలాపాలకు నిధులు ఎక్కడి నుంచి వస్తున్నాయి? ఎవరిని టార్గెట్ చేశారు? అనే కోణంలో విచారణ సాగుతోంది.
Next Story

