వెనెజులా మదురోకి పుట్టపర్తి సాయికి లింకేమిటంటే..
x
పుట్టపర్తి సాయిబాబాతో మదురో, ఆయన కుటుంబ సభ్యులు (ఇస్ స్టాగ్రామ్ సౌజన్యంతో)

వెనెజులా మదురోకి పుట్టపర్తి సాయికి లింకేమిటంటే..

ఎవరీ మదురో? ఎందుకు పుట్టపర్తి వచ్చారు? మదురో విడుదలకు వెనెజులాలో ప్రార్థనలు


ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా మార్మోగుతున్న పేరు నికోలస్ మదురో. వెనిజులా అధ్యక్షుడు, అమెరికా సైనిక బలగాల చేతిలో బందీ. ఒక దేశాధినేతను అమెరికా బంధించి న్యూయార్క్ తరలించడం 2026లో అతిపెద్ద అంతర్జాతీయ సంచలనం. అయితే ఈ రాజకీయ తుఫాను మధ్య, ఆంధ్రప్రదేశ్‌లోని ఒక చిన్న గ్రామం "పుట్టపర్తి" పేరు మళ్లీ హెడ్‌లైన్స్‌లోకి వచ్చింది.
14 వేల కిలోమీటర్ల దూరం.. ఒకే ఒక అనుబంధం!
ఎక్కడ ఆంధ్రప్రదేశ్.. ఎక్కడ వెనిజులా.. మధ్యలో 14 వేల కిలోమీటర్ల దూరం. కానీ, నికోలస్ మదురో జీవితంలో పుట్టపర్తి ఒక చెరగని సంతకం. 2005 మార్చిలో మదురో తన భార్య సిలియా ఫ్లోరెస్‌తో కలిసి పుట్టపర్తి ప్రశాంతి నిలయానికి వచ్చారు. ఇది దౌత్య పర్యటన కాదు, పూర్తి వ్యక్తిగత ఆధ్యాత్మిక పర్యటన. అప్పుడు ఆయన వెనిజులాలో కీలక నేతగా ఉన్నప్పటికీ, ఒక సాధారణ భక్తుడిలా బాబా దర్శనం కోసం వేచి చూశారని స్థానిక జర్నలిస్టు గంగిరెడ్డి చెప్పారు. ఇదే విషయాన్ని ఆంధ్రప్రదేశ్ లోని చాలా పత్రికలు కూడా రాశాయి.
2026 జనవరి 3న అమెరికా సైనిక బలగాలు వెనెజులా రాజధాని కారకాస్‌లో మదురోను పట్టుకుని అమెరికాకు తరలించాయి. రాజకీయ తుఫాన్‌లో పడిపోయిన ఈ నాయకుడి గురించి ప్రపంచం మాట్లాడుతున్న వేళ, అతని జీవితంలోని “ఇండియా లింక్”లో పుట్టపర్తి కనిపించింది
ఎవరీ మదురో, ఏమా కథ..
మదురో కథ చాలా పెద్దది. “బస్సు డ్రైవర్ నుంచి అధ్యక్షుడు” దాకా చెప్పాల్సి ఉంటుంది. నిజానికది ఓ రాజకీయ ప్రయాణం మాత్రమే కాదు, కార్మిక వర్గానికి చెందిన ఓ వ్యక్తి, యూనియన్ నాయకుడు, చావేజ్‌ విప్లవ రాజకీయాలు… వీటన్నింటి మధ్య పెరిగిన ఆయన్ను రాజకీయ నేతగా తీర్చిదిద్దాయి.

మదురో వెనిజులా రాజధాని నగరం కారకాస్ (Caracas) లోని ఎల్ వల్లే (El Valle) అనే మధ్యతరగతి పరిసర ప్రాంతంలో జన్మించారు. ఇది కారకాస్ నగరానికి దక్షిణ భాగంలో ఉంటుంది. కార్మికవర్గం నివసించే ప్రాంతం. చుట్టూ కొండలు, జనసాంద్రత కలిగిన బహుళ అంతస్తుల భవనాలతో ఈ ప్రాంతం ఉంటుంది. మదురో ఇక్కడే పెరిగారు, తన రాజకీయ పునాదులను ఇక్కడే నిర్మించుకున్నారు.
ఆయన తండ్రి పేరు నికోలస్ మదురో గార్సియా. ఆయన ఒక ట్రేడ్ యూనియన్ నాయకుడు. మదురోకు రాజకీయాల పట్ల ఆసక్తి కలగడానికి ఆయన తండ్రే కారణం. ఆయన తల్లి తెరెసా డి జేసుస్ మొరోస్. ఆమె కొలంబియా సరిహద్దు ప్రాంతానికి చెందిన వారు.
మదురోకు ముగ్గురు అప్పచెల్లెళ్లు. వారే మరియా తెరెసా, జోసెఫినా, అనితా మదురో. ఆయనకు అన్నదమ్ములు లేరు. మదురో తన పాఠశాల విద్యను కారకాస్‌లోని లిసియో జోస్ అవలోస్ (Liceo José Ávalos) అనే ప్రభుత్వ పాఠశాలలో పూర్తి చేశారు.
ఆయన ఉన్నత విద్యను (యూనివర్సిటీ) పూర్తి చేయలేదు. విద్యార్థి దశలోనే రాజకీయాల్లో చురుగ్గా పాల్గొనడం వల్ల చదువు మధ్యలోనే ఆగిపోయింది. ఆ తర్వాతే ఆయన బస్సు డ్రైవర్‌గా తన వృత్తిని ప్రారంభించారు.
ఆయన భార్య పేరు సిలియా ఫ్లోరెస్ (Cilia Flores). ఆమె ఒక న్యాయవాది, ప్రముఖ రాజకీయ నాయకురాలు. వెనెజులా నేషనల్ అసెంబ్లీకి స్పీకర్‌గా కూడా పనిచేశారు. ఆమె మదురో కంటే వయసులో పెద్దవారు. వెనెజులాలో ఆమెను "సిలియా మదురో" అని లేదా గౌరవప్రదంగా "ఫస్ట్ కాంబాటెంట్" (First Combatant) అని పిలుస్తారు. వెనెజులా రాజకీయాల్లో సిలియా ఫ్లోరెస్ (Cilia Flores) పాత్ర చాలా కీలకమైనది. ఆమెను కేవలం అధ్యక్షుడి భార్యగానే కాకుండా, ఆ దేశంలో అత్యంత శక్తివంతమైన మహిళా నాయకురాలిగా పరిగణిస్తారు.
మదురోకు తన మొదటి భార్య (అడ్రియానా గెర్రా) ద్వారా ఒక కుమారుడు ఉన్నాడు. అతని పేరు నికోలస్ మదురో గెర్రా (దీన్నే 'మదురిటో' అని కూడా అంటారు). అతను ప్రస్తుతం వెనిజులా ప్రభుత్వంలో కీలక పదవుల్లో ఉన్నాడు. భార్య సిలియా ఫ్లోరెస్ మొదటి వివాహం ద్వారా కలిగిన పిల్లలను కూడా మదురో తన సొంత పిల్లలుగానే చూసుకుంటారు. కారకాస్ ట్రాన్స్‌పోర్ట్/మెట్రో వ్యవస్థ చుట్టూ యూనియన్ కార్యకలాపాల్లో అతని పేరు మార్మోగింది. అదే అతన్ని చావేజ్‌ రాజకీయ జైలు గోడలకు దగ్గర చేసింది.

చావేజ్‌తో మదురో సంబంధం ‘గురువు–శిష్యుడు’ కథలా మారింది. చావేజ్‌ అతన్ని విదేశాంగ మంత్రిగా నియమించాడు (2006). 2012లో ఉపాధ్యక్షుడిగా గుర్తించాడు. చావేజ్ మరణం తరువాత 2013లో మదురో అధ్యక్షుడయ్యాడు. ఇక్కడిదాకా ఇది లాటిన్ అమెరికా రాజకీయ కథ. కానీ తర్వాత వచ్చే పేజీ మన రాష్ట్ర మ్యాప్‌లోకి వస్తుంది
క్రైస్తవుడే అయినా బాబాను ప్రేమిస్తారు...
మదురో కుటుంబం సెఫార్డిక్ జ్యూయిష్ (Sephardic Jewish) మూలాలను కలిగి ఉందని మదురో ఒకసారి పేర్కొన్నారు, కానీ ప్రస్తుతం ఆయన కాథలిక్ క్రైస్తవ మతాన్ని అనుసరిస్తున్నారు.
ఆయనకు సత్యసాయి బాబా అంటే చాలా గౌరవం. 2005లో ఆయన పుట్టపర్తిని సందర్శించి బాబా దర్శనం కూడా చేసుకున్నారు.
మదురో–సిలియా ఫ్లోరెస్ దంపతులు 2005లో పుట్టపర్తి ప్రశాంతి నిలయానికి వచ్చి సత్యసాయి బాబాను కలిశారని తాజా కథనాలు చెబుతున్నాయి. ఇది ఒక అధికారిక దౌత్య పర్యటనగా కాకుండా—వ్యక్తిగత ఆధ్యాత్మిక పర్యటనగా సాగింది.
ఈ “ఇండియా లింక్”లో కీలక పాత్ర సిలియా ఫ్లోరెస్‌ది. ఆమె ముందుగా సత్యసాయి బాబా బోధనల గురించి మదురోకు పరిచయం చేసిందన్నది పలు రిపోర్టుల్లో కనిపిస్తుంది. 2005లో అతను చావేజ్ ప్రభుత్వంలో కీలక నేతగానే ఉన్నారు.
ఒక విప్లవ నేతకు, ఒక ఆధ్యాత్మిక గురువుకు ఏం సంబంధం?
ఇక్కడే కథ సినిమాలా అనిపిస్తుంది. విప్లవ రాజకీయాల భాషలో “పేదలు, సమానత్వం, పోరాటం” ఉంటాయి. సత్యసాయి బాబా బోధనల్లో “ప్రేమ, సేవ, క్రమశిక్షణ” ఉంటాయి. రెండూ వేర్వేరు ప్రపంచాల్లా కనిపిస్తాయి. కానీ మదురో లాంటి నేతకు అవి ఒకే దారిలో కలిసిపోయే అవకాశం ఉంది. ఎందుకంటే అతని రాజకీయ ప్రతిష్ఠ కూడా “సామాన్యుడి పక్షం” అనే ఇమేజ్‌పై నిలబడింది. సాయి బాబా ‘సేవ’ అనే భావనను తన మనస్తత్వానికి సరిపోయే నైతిక ఆవర్తనంగా తీసుకున్నాడని కొన్ని కథనాలు అర్థం చెప్పే ప్రయత్నం చేస్తాయి.

బయట ప్రపంచాన్ని మార్చాలనే రాజకీయ యుద్ధానికి, లోపల ధైర్యం ఇచ్చే నమ్మకం అవసరం. మదురో ఆ నమ్మకాన్ని పుట్టపర్తిలో వెతికాడన్నది నీతిగా మీడియాలో కథనాలు వస్తున్నాయి.
“పుట్టపర్తి ఫోటో” ఎందుకు వైరల్ అయ్యింది?
ఈ మధ్య సోషల్ మీడియాలో ఒక ఫోటో తరచూ తిరుగుతోంది. మదురో, సిలియా ఫ్లోరెస్ బాబా దగ్గర కూర్చుని ఉన్న దృశ్యం అది. పలు మీడియా కథనాలు (Deccan Chronicle, The Tribune, India Today) కూడా ఈ ఫోటోను ప్రస్తావించాయి.
సాయి మరణం… వెనెజులాలో స్పందన
సత్యసాయి బాబా 2011లో మరణించిన తరువాత, వెనెజులా వైపు నుంచి సంతాప ప్రకటనలు వచ్చాయని కొన్ని నివేదికలు పేర్కొన్నాయి. (The American Bazaar). “ఇది ఒక్కసారి వచ్చిన దర్శనం కాదు—దీర్ఘకాల భావోద్వేగ అనుబంధం.” అని ఆవేళ వెనెజులా అధ్యక్ష భవనం సంతాపసందేశంలో పేర్కొన్నట్టు తెలుస్తోంది.
పుట్టపర్తి ఎందుకు మళ్లీ గుర్తొస్తోంది?
ఇప్పటి పరిణామాల్లో మదురోను అరెస్ట్ చేసి అమెరికాకు తరలించడం ప్రపంచ రాజకీయాల్లో పెద్ద ప్రకంపన. అటువంటి వేళ “మదురో ఎలాంటి వ్యక్తి?” అనే ప్రశ్నకు సమాధానం వెతుక్కుంటూ ప్రపంచ మీడియా అతని వ్యక్తిగత కోణాల్ని కూడా బయటకు తీస్తోంది. అందులోనే పుట్టపర్తి కథ బయటికి వచ్చింది. ఆంధ్రప్రదేశ్ లోని ఓ ఆధ్యాత్మిక కేంద్రం ప్రపంచ రాజకీయాల్లో హెడ్లైన్స్‌లో ఉన్న వ్యక్తి జీవితంలో ఒక “ప్రైవేట్ నమ్మకం”గా నిలిచింది. ఆ నమ్మకం నిజంగా అతన్ని మార్చిందా? లేక ప్రతీకగా మాత్రమే నిలిచిందా? అది చర్చ.
మదురో ను క్షేమంగా విడుదల చేయాలంటూ వెనెజులాలోని సత్యసాయి మందిరాల్లో ప్రార్థనలు సాగుతున్నాయని రిపోర్టులు అందుతున్నాయి. ఆయన జేబులో కూడా సత్యసాయి చిత్రపటం ఉన్నట్టు చెబుతున్నారు. (ది ఫెడరల్ నిర్దారించడం లేదు)
పరస్పర భిన్న దృక్పధాలు, భిన్న ధృవాలు.. కానీ వీరిద్దరూ ఒకర్నొకరు గౌరవించుకున్నారు. అభిమానించుకున్నారు. ప్రజలకు మేలు చేయాలని ఆకాంక్షించారు. ఆ ఇద్దరే ఒకరు వెనెజులా అధ్యక్షుడు మదురో మరొకరు పుట్టపర్తి సత్యసాయిబాబా.. ఆశ్చర్యపోతున్నారు కదూ.. కానీ నిజం.
Read More
Next Story