జర్నలిజంలో విలువల పునరుద్ధరణ జరగాలి
x

జర్నలిజంలో విలువల పునరుద్ధరణ జరగాలి

తమది జర్నలిస్ట్ ఫ్రెండ్లీ ప్రభుత్వమని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు.


ప్రజాస్వామ్యంలో మీడియా పాత్ర అత్యంత కీలకం, కానీ ప్రస్తుతం జర్నలిజంలో విలువలు, సిద్ధాంతాలు పడిపోతుండటం ఆందోళనకరమని, అబద్ధాలను నిజాలుగా చిత్రీకరించే ధోరణిని వీడి, విలువల పునరుద్ధరణకు జర్నలిస్టులు కృషి చేయాలి అని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పిలుపునిచ్చారు. శనివారం విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో జరిగిన ఐజేయూ 11వ ప్లీనరీలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. గత ఐదేళ్ల అణచివేత పాలనలో జర్నలిస్టులకు ప్రశ్నించే స్వేచ్ఛ కూడా లేదని, నేడు తమ ప్రభుత్వం విలేకరులకు పూర్తి భరోసాను, స్వేచ్ఛను కల్పించిందని ఆయన స్పష్టం చేశారు. సోషల్ మీడియాలో జరుగుతున్న తప్పుడు ప్రచారాలను అరికట్టడంలో జర్నలిస్టులు బాధ్యతాయుతంగా వ్యవహరించాలని కోరుతూనే, విలేకరుల సంక్షేమానికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని సీఎం పునరుద్ఘాటించారు.

తప్పుడు వార్తలు.. నారాసుర రక్తచరిత్రపై ధ్వజమెత్తారు
ఇటీవలి కాలంలో మీడియా పోకడలు ఆందోళనకరంగా మారాయని సీఎం వ్యాఖ్యానించారు. వైఎస్ వివేకానంద రెడ్డి మరణాన్ని తొలుత గుండెపోటుగా చిత్రీకరించి, వాస్తవాలు బయటకు రాగానే తనపై నారాసుర రక్తచరిత్ర అంటూ సాక్షి మీడియాలో తప్పుడు కథనాలు వండారని మండిపడ్డారు. ఇలాంటి విపరీత పోకడలు సమాజానికి ఏమాత్రం మంచిది కాదని, అబద్ధాలను నిజాలుగా చూపే జర్నలిజం పట్ల అప్రమత్తంగా ఉండాలని ఆయన కోరారు.
జర్నలిస్ట్ ఫ్రెండ్లీ ప్రభుత్వం.. సంక్షేమానికి పెద్దపీట
జర్నలిస్టుల సంక్షేమానికి తమ ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యతనిస్తుందని, తమది ముమ్మాటికీ జర్నలిస్ట్ ఫ్రెండ్లీ ప్రభుత్వమని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పునరుద్ఘాటించారు. కేవలం నగరాలకే పరిమితం కాకుండా, మారుమూల ప్రాంతాల్లో వార్తలు సేకరించే మండల స్థాయి రిపోర్టర్లకు కూడా అక్రిడిటేషన్లు మంజూరు చేయడం ద్వారా వారికి వృత్తిపరమైన గుర్తింపును కల్పించామని పేర్కొన్నారు. క్షేత్రస్థాయిలో జర్నలిస్టులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను తాము గుర్తించామని, వారికి అండగా ఉంటామని భరోసా ఇచ్చారు.
రక్షణ .. ఆర్థిక భరోసా
జర్నలిస్టుల భద్రత విషయంలో రాజీ పడే ప్రసక్తే లేదని సీఎం స్పష్టం చేశారు. విధి నిర్వహణలో ఉన్న జర్నలిస్టులపై ఎక్కడైనా దాడులు జరిగితే, ఆ కేసులను కింది స్థాయి అధికారులకు కాకుండా నేరుగా ఎస్పీ స్థాయి అధికారితో విచారణ చేయిస్తున్నామని వెల్లడించారు. ఇది జర్నలిస్టులకు మరింత రక్షణ కల్పిస్తుందని ఆయన అభిప్రాయపడ్డారు. దీనితో పాటు, జర్నలిస్టుల కుటుంబాలకు ఆపద సమయంలో అండగా నిలిచేందుకు ప్రత్యేకంగా జర్నలిస్ట్ వెల్ఫేర్ ఫండ్ ను ఏర్పాటు చేసినట్లు గుర్తుచేశారు.
ప్రెస్ క్లబ్ స్థలం.. అమరావతిలో ఆఫీసు
జర్నలిస్టుల చిరకాల కోరికలను నెరవేర్చే క్రమంలో ప్రభుత్వం విప్లవాత్మక నిర్ణయాలు తీసుకుందని చంద్రబాబు తెలిపారు. గతంలో మంత్రుల క్వార్టర్ల కోసం కేటాయించిన అత్యంత విలువైన స్థలాన్ని కూడా జర్నలిస్టుల సౌకర్యార్థం ప్రెస్ క్లబ్ కోసం కేటాయించడం మీడియా పట్ల తమకున్న గౌరవానికి నిదర్శనమని పేర్కొన్నారు. అలాగే, రాజధాని అమరావతిలో ఐజేయూ (IJU) కార్యాలయానికి స్థలం కేటాయించాలన్న విజ్ఞప్తిని సానుకూలంగా స్పందిస్తూ, ఆ అంశాన్ని పరిశీలించి త్వరగా నిర్ణయం తీసుకోవడానికి ఒక ప్రత్యేక సబ్ కమిటీని వేస్తున్నట్లు ముఖ్యమంత్రి హామీ ఇచ్చారు.
సోషల్ మీడియా పెను సవాలు
ప్రస్తుతం సోషల్ మీడియా అతిపెద్ద సమస్యగా పరిణమించిందని సీఎం ఆందోళన వ్యక్తం చేశారు. రాజకీయ పార్టీలే స్వయంగా మీడియా సంస్థలను నడపడం ప్రజాస్వామ్యానికి చేటు చేస్తుందని, సోషల్ మీడియాలో జరిగే తప్పుడు ప్రచారాన్ని అరికట్టే బాధ్యతను జర్నలిస్టులు తీసుకోవాలని కోరారు. మీడియాలో పడిపోతున్న విలువలని, సిద్ధాంతాలని పునరుద్ధరించుకోవాల్సిన అవసరం ఉందని ఆయన పిలుపునిచ్చారు.
అమరావతి.. ఫ్యూచర్ సిటీ
రాష్ట్రాభివృద్ధిలో మీడియా భాగస్వామ్యం కావాలని, కేవలం పాజిటివ్ న్యూస్ కాకుండా ప్రోగ్రెసివ్ న్యూస్ (అభివృద్ధిని కాంక్షించే వార్తలు) ఇవ్వాలని కోరారు. అమరావతిని భవిష్యత్ నగరంగా తీర్చిదిద్దుతున్నామని, నేడే అసెంబ్లీలో దానికి చట్టబద్ధత కల్పించే తీర్మానం చేశామని గుర్తుచేశారు. రాబోయే ఐదేళ్లలో అమరావతి అద్భుతమైన అభివృద్ధిని చూస్తుందని, ఈ ప్రగతిని ప్రపంచానికి చాటిచెప్పే బాధ్యత జర్నలిస్టులదేనని ఆయన పేర్కొన్నారు.
Read More
Next Story