కొడుకు లేకున్నా… నీకు నేనున్నా నాన్న!
x
తండ్రికి అంతిమ సంస్కారం చేసేందుకు బయలుదేరిన కుమార్తె సౌమ్య

కొడుకు లేకున్నా… నీకు నేనున్నా నాన్న!

ఓ తండ్రి జీవితాన్ని గౌరవంగా ముగించిన కుమార్తె...


చిత్తూరు జిల్లా వడమాలపేట మండలం వడమాల గ్రామం మంగళవారం ఓ భావోద్వేగ దృశ్యానికి సాక్ష్యమైంది. సానంబట్ల ఉపాధ్యాయుడు మునిశేఖర్‌ (54) అనారోగ్యంతో కన్నుమూశారు. గ్రామంలో ఎంతోమందికి గురువుగా, స్నేహితుడిగా, మార్గదర్శిగా నిలిచిన ఆయన మరణం కుటుంబానికే కాకుండా ఊరికి కూడా తీరని లోటుగా మారింది. ఆయనకు భార్య సంధ్య, ఇద్దరు కుమార్తెలు- సౌమ్య, హిమజ.
ఆయనకు కుమారులు లేరు. దీంతో ఊళ్లో అందరి నోట ఒకటే చర్చ. అంతిమ సంస్కారం ఎవరు చేయాలనే దానిపైన తర్జనభర్జనలు పడుతున్న దశలో.. మా నాన్న అంతిమ సంస్కారం నేనే చేస్తానంటూ ఓ అమ్మాయి ముందుకొచ్చింది. ఆమే సౌమ్య. మునిశేఖర్ పెద్ద కుమార్తె. మూఢనమ్మకాలు, కొడుకే అంతమ సంస్కారం నిర్వహించాలా అని ఆమె అనడంతో అందరూ ముగ్ధులయ్యారు. “కొడుకే కావాలా?” మానాన్నకు మేమిద్దరం కూతుళ్లం, మమ్మల్నే కొడుకులుగా పెంచారనడంతో కూతురే కొడుకైంది.
తండ్రి అంతిమయాత్రలో పెద్ద కుమార్తె సౌమ్య చేతిలో చక్ర, శూలం పట్టుకుని ముందుకు నడిచింది. ఆ అడుగుల్లో బాధ ఉంది… కానీ బలమూ ఉంది. “నాన్నకు చివరి కర్మలు నేను చేస్తాను” అన్న ఆమె నిర్ణయం కుటుంబాన్ని, గ్రామాన్ని కదిలించింది.
సాంప్రదాయంగా కొడుకు చేయాల్సిన కర్మలను సౌమ్యే స్వయంగా నిర్వహించింది. అంతిమ సంస్కారాల సమయంలో తండ్రి చుట్టూ తిరిగిన ప్రతి క్షణం, ఆమె కళ్లలో నీరు… కానీ మనసులో గర్వం. “జన్మనిచ్చిన తండ్రికి రుణం తీర్చుకోవడం కూతురి ధర్మం కూడా” అని ఆమె చర్య చెబుతున్నట్టుంది.
భావోద్వేగ క్షణాలు
అంతిమయాత్రలో గ్రామస్థులు నిశ్శబ్దంగా చూస్తూ నిలిచిపోయారు. “కొడుకు లేకపోతే కూతురు ఎందుకు చేయకూడదు?” అనే ప్రశ్న అక్కడ ఎవరూ గట్టిగా పలకలేదు. కానీ అందరి మనసులో వినిపించింది.
సౌమ్యకు తోడుగా చెల్లెలు హిమజ కూడా నిలబడ్డారు. తండ్రి చివరి ప్రయాణంలో ఇద్దరు కుమార్తెలు భుజం కలిపి నిలబడటం కుటుంబ బంధాల బలాన్ని చూపించింది.
మారుతున్న సమాజానికి ప్రతిబింబం
ఒకప్పుడు “కొడుకు తప్ప మరెవ్వరూ చేయరాదు” అన్న భావన బలంగా ఉండేది. కానీ నేడు పరిస్థితులు మారుతున్నాయి. కూతుళ్లు విద్యలో, ఉద్యోగంలో, బాధ్యతల్లో ముందుంటున్నారు. అంత్యక్రియల విషయంలోనూ వారు వెనుకాడడం లేదు.
మునిశేఖర్‌ జీవితంలో గురువుగా ఎన్నో పిల్లలకు దారి చూపించారు. చివరి ప్రయాణంలో తన కూతురు చూపిన ధైర్యం ఆయనకు నిజమైన గర్వకారణం అయి ఉండేది.
చివరి మాట…
కొడుకు లేకపోయినా… “నీకు నేనున్నా నాన్న” అని చెప్పిన కూతురు,
ఒక తండ్రి జీవితాన్ని గౌరవంగా ముగించింది. ఆ దృశ్యం- ఒక కుటుంబం మాత్రమే కాదు, మారుతున్న సమాజానికి అద్దం పట్టింది.
Read More
Next Story