మీ విద్యతో దేశానికి, సమాజానికి ఉపయోగపడండి!
x
ఏయూ కల్చరల్‌ ఫెస్ట్‌లో మాట్లాడుతున్న పవన్‌ కల్యాణ్‌

మీ విద్యతో దేశానికి, సమాజానికి ఉపయోగపడండి!

విద్యార్థులు తమ విద్యతో దేశానికి, సమాజానికి, తల్లిదండ్రులకు ఉపయోగపడాలని ఏపీ ఉపముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్‌ పిలుపునిచ్చారు.

శత వసంతాలు పూర్తి చేసుకుంటున్న ఆంధ్ర విశ్వవిద్యాలయం ఒక క్యాంపస్‌ మాత్రమే కాదు.. విలువలు, వ్యక్తిత్వంతో పాటు భారతీయ వారసత్వ సంపదకు నిదర్శనమని ఆంధ్రప్రదేశ్‌ ఉప ముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్‌ అభివర్ణించారు. ఇక్కడ పనిచేసిన, విద్యాభ్యాసం చేసిన ఎందరో ప్రయోజకులయ్యారని కొనియాడారు. విశాఖ ఆంధ్ర యూనివర్సిటీ శతాబ్ది ఉత్సవాల మెగా కల్చరల్‌ ఫెస్ట్‌ ముగింపు వేడుకలకు బుధవారం రాత్రి ముఖ్య అతిథిగా ఆయన హాజరయ్యారు. అనంతరం ఆయన విద్యార్థులు, అధ్యాపకులు, ఇతర ప్రముఖులనుద్దేశించి ప్రసంగించారు. పవన్‌ కల్యాణ్‌ తన ప్రసంగంలో ఏమన్నారంటే?


ఏయూ కల్చరల్‌ ఫెస్ట్‌లో మాట్లాడుతున్న పవన్‌ కల్యాణ్‌

ఏయూ అంటే అమితమైన గౌరవం..
‘ఆంధ్ర విశ్వవిద్యాలయం అంటే నాకు చాలా గౌరవం. ఈ యూనివర్సిటీ గొప్పతనం గురించి తెలుసుకున్నాకు నాకు ఆ గౌరవం ఏర్పడింది. ఎప్పుడు వైజాగ్‌ వచ్చినా ఏయూను చూస్తాను. నాకు ఏయూలో చదువుకునే అవకాశం భగవంతుడు ఇవ్వలేదు. కానీ ఈరోజు శతాబ్ది వేడుకల్లో పాల్గొనే అవకాశం వచ్చింది. సినీ రచయిత త్రివిక్రం శ్రీనివాస్‌ ఏయూలో ఎమ్మెస్సీ నూక్లియర్‌ ఫిజిక్స్‌లో మాస్టర్స్‌ చేశారు. ఏయూలో ఒక్కో డిపార్ట్‌మెంట్‌ విశిష్టత గురించి నాకు ఆయన చెబితే తెలిసింది ఏయూ ఎంత గొప్పదోనని. ప్రపంచ వ్యాప్తంగా విద్యనందించే విద్యాసంస్థలు చాలా ఉన్నప్పటికీ వందేళ్లుగా తరాలను తీర్చిదిద్దే కొద్దివాటిలో ఏయూ ఒకటి. మనమంతా ఏయూ గురించి ఎంతో గర్వపడాలి. ఇక్కడ విద్యాభ్యాసం చేసిన వారెన్నో ఉన్నత శిఖరాలనధిరోహించారు. ఎందరో చరిత్రలో నిలిచారు. ఏయూ శతాబ్ది ఉత్సవాల సందర్భంగా సీఆర్‌ రెడ్డిని, మాజీ ఉపరాష్ట్రపతి రాధాకృష్ణన్, సీవీరామన్‌లకు కృతజ్ఞతలు. నాకు కొట్టే చప్పట్లు ఆ మహానీయుల పాదాలకు అంకితమిస్తున్నాను.

కల్చరల్‌ ఫెస్ట్‌ విజేతకు సర్టిఫికెట్‌ను అందజేస్తున్న పవన్‌..

విద్యార్థుల ముందు నా నటన కుదరదు..
విద్యార్థులున్న చోటకు రమ్మంటే నేను చాలా ఆలోచిస్తాను. వారి ప్రశ్నలకు నా దగ్గర సమాధానాలుండవు. వాళ్లు గుండె లోతుల్లోంచి ప్రశ్నలు అడుగుతారు. అందుకే వారి ముందు చాలా తక్కువ మాట్లాడాలనుకుంటాను. ఉదయం లేస్తే పుస్తకాలతో కుస్తీ పట్టే మీతో మాట్లాడడం కష్టం. మీ దగ్గర నా తెలివితేటలు వాడను. నా నటన కుదరదు. నేను మేథస్సుతో పోటీ పడలేను. ఏయూ లాంటి సంస్థకు అతిథిగా అర్హత ఉందో లేదో నాకు తెలియదు. కానీ మీరు ప్రేమతో పిలిచారని వచ్చాను.
మార్పు తీసుకొచ్చేది యువతే..
సమాజంలో మార్పు తీసుకొచ్చేది యువతే. మన జీవితంలో ఎటువైపు వెళ్లాలో నిర్దేశించేది విశ్వవిద్యాలయమే. విద్యంటే పుస్తకాల్లో జ్ఞానమొక్కటే కాదు..
మీ లక్ష్యం సమాజ సేవ కూడా కావాలి. దేశానికి ఉపయోగపడాలి. మన భవిష్యత్తును మన ఆలోచనలు, మన చర్యలే నిర్ణయిస్తాయి. యువత బలమైన కలలు కనండి. నిబద్ధతో నాయకత్వం వహించండి. విద్యార్థులు ఐడియాలజీ సరైనది కాకపోతే దెబ్బతింటారు. మీరు రెండు తరాలను ముందే చూడాలి.
ఐడియాలజీలకు ప్రభావితమయ్యే అవకాశం ఉంది. జీవితకాలం ప్రతి ఐడియాలజీని టెస్ట్‌ చేయాలి. మీలో ప్రతి ఒక్కరిలోనూ నూక్లియర్‌ ఎనర్జీ ఉంటుంది. ఏం చేయాలన్న ఆలోచన ఉండాలి. బలమైన ఆలోచనలతో ముందుకెళ్లండి. దేశానికి, సమాజానికి, తల్లిదండ్రులకు ఉపయోగపడండి. చదివిన చదువుతో వారికి సేవ చేసి రుణం తీర్చుకోండి. చదివిన చదువు ఎప్పడూ వృధా కాదు. నేను చదువు కోసం యూనివర్సిటీకి వెళ్లలేదు కానీ ఎప్పుడూ పీహెచ్‌డీ విద్యార్థిలా చదువుతాను. నా ఆఖరి స్వాస వరకు భావితరాల కోసం పని చేయాలని అనుకుంటాను. శృంగేరి మఠాధిపతి చెప్పినట్టు ఏ వ్యక్తిని కలిసినా వారిలో మంచిని తీసుకోండి. చెడును లోపలే ఉంచుకోండి.
సరిగా లేకపోతే నన్నైనా పక్కన పడేయండి..
ఓటమికి సిద్ధమపడే రాజకీయాల్లోకి వచ్చాను. గెలుస్తానో లేదో తెలియదు. రేపు నేను సరిగా లేకపోతే పక్కన పడేయండి.. రాజకీయాల్లో ఎవరిని నచ్చకపోయినా ఉపేక్షించకండి. నాలోంటోడు చెప్పినా వినకండి. నమ్మకండి.’ అని పవన్‌ కల్యాన్‌ ఉద్బోధించారు. అంతకుముందు కల్చరల్‌ ఫెస్ట్‌ విజేతలకు సర్టిఫికెట్లను ప్రదానం చేశారు. కార్యక్రమంలో ఏయూ వీసీ రాజశేఖర్, ప్రొఫెసర్లు, ఎమ్మెల్యేలు వంశీకృష్ణ శ్రీనివాస్, పంచకర్ల రమేష్‌బాబు, సుందరపు విజయ్‌కుమార్‌ తదితరులు పాల్గొన్నారు.
Read More
Next Story