పాలనలో ఏఐని వినియోగించండి
x

పాలనలో ఏఐని వినియోగించండి

ప్రభుత్వ శాఖల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) వినియోగంచాలని సీఎం చంద్రబాబు సూచించారు.


పాలనలో వేగం, పారదర్శకత పెంచేందుకు అన్ని ప్రభుత్వ శాఖల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌ను విరివిగా ఉపయోగించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశించారు. అమరావతిలోని క్యాంపు కార్యాలయంలో సోమవారం జరిగిన సమీక్షలో ఆయన మాట్లాడుతూ.. డ్రోన్లు, సీసీ టీవీ కెమెరాలు , శాటిలైట్ డేటాను ఒకే వేదికపైకి తెచ్చి సమీకృతం చేసే మెకానిజం తీసుకురావాలని అధికారులకు సూచించారు. టెక్నాలజీని అందిపుచ్చుకోవడం ద్వారానే ప్రజలకు మెరుగైన సేవలు అందించగలమని ఆయన స్పష్టం చేశారు.

బాణసంచా ప్రమాదాలపై ప్రత్యేక నిఘా - శివకాశీ అధ్యయనం
రాష్ట్రంలో ఇటీవల జరిగిన బాణసంచా పేలుడు ఘటనలను తీవ్రంగా పరిగణించిన ముఖ్యమంత్రి, ఇలాంటివి పునరావృతం కాకుండా కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. రక్షణ ప్రమాణాలపై అవగాహన కోసం తమిళనాడులోని శివకాశీకి వెళ్లి అక్కడి భద్రతా పద్ధతులను అధ్యయనం చేయాలని అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. ప్రజల ప్రాణాలకు ముప్పు కలిగించే నిర్లక్ష్యాన్ని సహించేది లేదని హెచ్చరించారు.
వేసవి సన్నద్ధత: బస్టేషన్లలో తాగునీటి సౌకర్యం
రానున్న వేసవి కాలాన్ని దృష్టిలో ఉంచుకుని ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడాలని ముఖ్యమంత్రి సూచించారు. ముఖ్యంగా ఆర్టీసీ బస్టేషన్లలో మంచినీటి సరఫరాపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని, ప్రయాణికులు బస్ ఎక్కిన దగ్గర నుండి గమ్యస్థానం చేరే వరకు ప్రయాణం సౌకర్యవంతంగా ఉండాలని అధికారులను ఆదేశించారు. క్షేత్రస్థాయిలో పర్యటించి పరిస్థితులను ఎప్పటికప్పుడు సమీక్షించాలని చెప్పారు.
సర్వేలతో ప్రజలను ఇబ్బంది పెట్టవద్దు
ప్రభుత్వ పనితీరుపై పబ్లిక్ పర్సెప్షన్ తెలుసుకునే క్రమంలో ప్రజలను, సిబ్బందిని ఇబ్బంది పెట్టవద్దని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. ప్రభుత్వం వద్ద ఇప్పటికే ఉన్న సమాచారాన్ని కాకుండా, కేవలం అదనపు సమాచారం అవసరమైనప్పుడు మాత్రమే సర్వేలు నిర్వహించాలని చెప్పారు. పదే పదే ఒకే రకమైన సమాచారం కోసం ప్రజల సమయాన్ని వృథా చేయవద్దని హెచ్చరించారు.
వాట్సప్ మనమిత్ర సేవల విస్తరణ
ప్రజలకు మరింత చేరువయ్యేలా వాట్సప్ ద్వారా అందించే సేవల సంఖ్యను 953కి పెంచినట్లు అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. ఈ సేవలపై సామాన్యులకు అవగాహన కల్పించాలని, ప్రతి ఒక్కరూ సులభంగా వీటిని వినియోగించుకునేలా ప్రచారం నిర్వహించాలని సీఎం సూచించారు. అలాగే పెన్షన్ల పంపిణీలో అట్టడుగున ఉన్న స్వర్ణ గ్రామాలు, స్వర్ణ వార్డులపై ప్రత్యేక దృష్టి సారించాలని ఆదేశించారు.
Read More
Next Story