అమెరికాలో అధ్యక్ష ఎన్నికల్లో ఎన్నెన్ని వింతలో!
అమెరికా 47వ అధ్యక్ష ఎన్నికకు రంగం సిద్ధమైంది. నవంబర్ 5న ఎన్నికలు జరగనున్నాయి. పాపులర్ ఓట్లు ఎక్కువ వచ్చినా ఫలితం ఉండదట. ఎందువల్ల?
అమెరికా 47వ అధ్యక్ష ఎన్నికకు రంగం సిద్ధమైంది. నవంబర్ 5న ఎన్నికలు జరగనున్నాయి. అమెరికా అధ్యక్ష పదవికి ఇలా ఎన్నికలు జరగడం ఇది 60వ సారి. మొత్తం ఓట్లు సుమారు 25 కోట్లు కాగా ఇప్పటికే పోలింగ్ కేంద్రాలు, మెయిల్ ద్వారా దాదాపు 5.3 కోట్ల మందికి పైగా ఓటు వేశారు. ప్రధాన పార్టీలైన రిపబ్లికన్ పార్టీ తరపున మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తిరిగి పోటీ చేస్తుండగా, డెమొక్రటిక్ పార్టీ అభ్యర్థిగా ఉపాధ్యక్షురాలు కమలా హారిస్ తలపడుతున్నారు. బ్యాలెట్ పద్ధతిన ఓటింగ్ జరుగుతుంది. అందువల్ల ఇండియాలో మాదిరి ఫలితాలు వెంటనే వెలువడే అవకాశం ఉండదు. కనీసం ఓ వారమైనా పడుతుంది. అయితే ఓటింగ్ సరళి తెలిసిపోతుంది.
ఎన్నికల తేదీలో మార్పు ఉండదు...
అమెరికా రాజ్యాంగం ప్రకారం దేశంలో అధ్యక్ష పాలనా విధానం. కేంద్ర స్థాయిలో అధ్యక్షుడు, రాష్ట్ర స్థాయిలో గవర్నర్ నిజమైన అధికారాలు కలిగి ఉంటారు. అధ్యక్షుని పదవీ కాలం 4 ఏళ్లు. ప్రతి లీపు సంవత్సరంలో నవంబర్ మొదటి సోమవారం తర్వాత వచ్చే మంగళవారం నాడు ఎన్నిక జరుగుతుంది. ఎన్నికైన అభ్యర్ధి జనవరి 20న ప్రమాణ స్వీకారం చేస్తారు. అధ్యక్షుడిగా పోటీ చేయటానికి 35 ఏళ్ల వయసు, అమెరికాలో జన్మించిన పౌరుడై, కనీసం 14 ఏళ్ల పాటు అమెరికాలో నివశించి వుండాలి.
1850 నుండి అమెరికాలో డెమొక్రటిక్ పార్టీ, రిపబ్లికన్ పార్టీల ఆధిపత్యం కొనసాగుతున్నది. లిబర్టేరియన్ పార్టీ, కమ్యూనిస్ట్ పార్టీ, గ్రీన్స్ పార్టీ, కాన్‌స్టిట్యూషన్ పార్టీ తదితర పార్టీలు ఉన్నప్పటికి వాటి ప్రాబల్యం నామమాత్రమే. 180 ఏళ్లుగా ఈ రెండు పార్టీల అభ్యర్ధులే అధ్యక్షులుగా గెలుపొందుతున్నారు. డెమొక్రటిక్ పార్టీ చిహ్నం గాడిద. రిపబ్లికన్ పార్టీ చిహ్నం ఏనుగు. అధ్యక్షుడితో పాటు ఉపాధ్యక్షుడు కూడా ఎన్నికవుతారు. ఏ కారణం వల్లనైనా అధ్యక్ష పదవి ఖాళీ అయితే మిగిలిన కాలం ఉపాధ్యక్షులే అధ్యక్షులుగా కొనసాగుతారు.
పార్టీ అభ్యర్థుల ఎన్నిక ఎలా ఉంటుందంటే..
అమెరికా అధ్యక్ష ఎన్నికలలో రెండు పార్టీల అభ్యర్థుల ఎన్నిక ప్రక్రియ నవంబర్ నెలకి 8 నెలలు ముందే ప్రారంభం అవుతుంది. రిపబ్లికన్ లేదా డెమొక్రటిక్ పార్టీల తరపున అధ్యక్ష పదవికి పోటీ చేయాలనే కోరిక అనేక మందికి ఉండవచ్చు. కాని చివరకు ఒక్కొక్క పార్టీ తరపున ఒక్కరే రంగంలో ఉంటారు. అభ్యర్థి ఎన్నిక ప్రక్రియ దాదాపు 6 నెలల పాటు కొనసాగుతుంది.
ఈసారి డెమొక్రటిక్ పార్టీ అభ్యర్ధిత్వానికి బైడెన్ తిరిగి పోటీ చేయడానికే నిర్ణయించుకున్నప్పటికీ వయసు మీద పడడంతో సొంత పార్టీ నుంచే తప్పుకోమని డిమాండ్ వచ్చింది. దీంతో ఆయన తప్పుకుని ఉపాధ్యక్షురాలు హారిస్‌ను డెమొక్రటిక్ అభ్యర్థిగా ప్రకటించారు. హారిస్ డెమొక్రాటిక్ పార్టీ అభ్యర్థిత్వాన్ని దక్కించుకోడానికి 1976 డెలిగేట్ల మద్దతు అవసరం కాగా, ఆమెకు కాకసస్, ప్రైమరీస్‌లో 4,567 మంది డెలిగేట్ల మద్దతు లభించింది. అలాగే రిపబ్లికన్ పార్టీ అభ్యర్థిత్వం చేజిక్కించుకోడానికి ట్రంప్‌కు 1215 మంది డెలిగేట్ల మద్దతు అవసరం కాగా, 2,243 మంది డెలిగేట్ల మద్దతు లభించింది.
కాకసస్ అంటే ఏమిటీ?
తొలిదశలో జరిగే సమావేశం కాకసస్. (కాకసస్ అంటే ఓ ముఠా అని). ఒక రాష్ట్రంలో ఒక జిల్లాకు లేదా ఒక ప్రాంతానికి సంబంధించిన ఒక పార్టీ నాయకులు తమ పార్టీ తరపున ఏ అభ్యర్ధిని బలపరుద్దామనే విషయాన్ని చర్చించటానికి ఏర్పాటు చేసుకునే సమావేశాన్ని ”కాకసస్” అంటారు. కొన్ని కాకసస్‌లు కలిసి ‘కౌంటీ’గాను, కొన్ని కౌంటీలు కలసి స్టేట్ గ్రూప్ గాను ఏర్పడతాయి.
రెండో దశలో- పోటీ చేయాలనుకుంటున్న అభ్యర్ధి పార్టీకి చెందిన రిజిస్టర్ ఓటర్లు పాల్గొనే సమావేశాన్ని ”ప్రైమరీలు” అంటారు. ఈ సమావేశాలలో ఒక పార్టీ తరపున పోటీ చేస్తున్న అభ్యర్థులు తమ ఆర్థిక, సామాజిక, విదేశాంగ విధానాలు, ఇతర అంశాలు వివరిస్తారు. రహస్య ఓటింగ్ జరుగుతుంది. ప్రైమరీలలో తమకు వచ్చే ఓట్లను బట్టి అభ్యర్థులు పోటీలో కొనసాగడమో, విరమించుకోవడమో చేస్తారు. మూడవ దశలో ఆ పార్టీ జాతీయ సదస్సు జరిగి ఎక్కువ మంది డెలిగేట్లు మద్దతు పొందిన వారికి పార్టీ అభ్యర్థిగా నామినేట్ చేస్తారు.
అమెరికన్ కాంగ్రెస్ ఎలా ఉంటుందంటే...
1. అమెరికాలో పార్లమెంట్‌ను కాంగ్రెస్ అంటారు. దీనిలో ఎగువసభ పేరు సెనేట్. ఆ సభలో 100 మంది సభ్యులు వుంటారు. 50 రాష్ట్రాల నుంచి సమానంగా రాష్ట్రానికి ఇద్దరు చొప్పున సెనేట్‌కు ప్రాతినిధ్యం వహిస్తారు. వీరి పదవీ కాలం 6 ఏళ్లు. ప్రతి రెండేళ్లకు 1/3 వంతు చొప్పున పదవీ విరమణ చేసి ఎన్నికలు జరగుతాయి.
2.దిగువసభ పేరు ప్రతినిధుల సభ (హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్). దీనిలో 438 మంది సభ్యులుంటారు. వీరి ఎన్నిక అధ్యక్ష ఎన్నికలతో పాటే జరుగుతాయి. 50 రాష్ట్రాలకు ఆయా రాష్ట్రాల జనాభాను బట్టి ప్రతినిధుల సభలో ప్రాతినిధ్యం వుంటుంది. ఉదాహరణకు పెద్ద రాష్ట్రమైన కాలిఫోర్నియా నుండి ప్రతినిధుల సభలో 52 మంది ఉండగా టెక్సాస్ నుండి 36 మంది, చిన్న రాష్ట్రాలైన వెర్మాంట్, నెవడా, నార్త్ డకోటా నుండి ఒక స్థానం మాత్రమే ఉంది.
అధ్యక్ష ఎన్నికలో ఎలక్టొరల్ కాలేజీ పాత్ర...
చాలా దేశాలలో అధ్యక్ష పాలన ఉన్నప్పటికీ వాళ్లందరూ ప్రజలు వేసిన ”పాపులర్ ఓటు” ఆధారంగా గెలుపొందుతారు. అంటే మెజారిటీ ఓట్లు పొందినవారు గెలుస్తారు. కాని అమెరికా అధ్యక్ష ఎన్నిక భిన్నంగాను, సంక్షిష్టంగాను ఉంటుంది. అధ్యక్షుడిని ఎన్నుకోవటానికి ఒక "ఎలక్టొరల్ కాలేజి” ఏర్పడుతుంది. ఈ కాలేజీలో 538 మంది ఎలక్టొరేట్లు ఉంటారు. ఒక్కో రాష్ట్రం నుండి కాంగ్రెస్‌లో సభ్యుల సంఖ్యకు సరిపడా ఎలక్టొరల్ కాలేజీలో ప్రాతినిధ్యం వుంటుంది.
ఉదాహరణకు కాలిఫోర్నియా రాష్ట్రానికి ప్రతినిధుల సభలో 52, సెనేట్‌లో 2, మొత్తం 54 మంది సభ్యులుంటారు. ఆ రాష్ట్రానికి ఎలక్టొరల్ కాలేజీలో 54 మంది ఉంటారు. నార్త్ కరోలినా రాష్ట్రానికి ప్రతినిధుల సభలో 12 మంది, సెనేట్‌లో 2, మొత్తం 14 మంది ఉంటే, ఎలక్టొరల్ కాలేజీలో 14 మంది ప్రాతినిధ్యం పొందుతారు. అధ్యక్ష పదవికి ఎన్నికలు జరిగిన తరువాత ఏ రాష్ట్రంలోనైనా పాపులర్ ఓటు ఏ అభ్యర్థికి ఎక్కువగా వస్తే, ఆ రాష్ట్రంలోని ఎలక్టొరల్ ఓట్లన్నీ అతనికే చెందుతాయి. ఉదాహరణకు కాలిఫోర్నియా రాష్ట్రంలో నవంబర్ 5న జరిగే ఎన్నికలలో డెమొక్రటిక్ పార్టీ అభ్యర్థి హారిస్‌కు మెజారిటీ పాపులర్ ఓట్లు వస్తే ఎలక్టొరల్ కాలేజి లోని 54 ఓట్లు ఆమెకే లభిస్తాయి. అనగా 50 రాష్ట్రాలలో ఏ రాష్ట్రంలోనైనా పాపులర్ ఓటు పొందిన అభ్యర్థి ఆ రాష్ట్రానికి చెందిన ఎలక్టొరల్ ఓట్లన్నీ పొందుతాడు.
ఆ విధంగా 538 ఎలక్టొరల్ కాలేజీ ఓట్లలో మెజారిటీ (270కి పైగా) పొందిన వారిని విజేతగా ప్రకటిస్తారు. నవంబరు 5న ఎన్నికలు జరిగినా అధ్యక్షుడి ఎన్నిక లాంఛనంగా జరిగేది డిసెంబరు17, వచ్చే ఏడాది జనవరి 6 తేదీల్లో. ఆ రెండు రోజుల్లో ఎలక్టొరల్ కాలేజి ఓటు చేస్తుంది. అధ్యక్ష పదవికి ఎన్నికైనవారు జనవరి 20న ప్రమాణ స్వీకారం చేస్తారు.
పై విధానంలో కొన్నిసార్లు పాపులర్ ఓట్లు మెజారిటీ పొంది కూడా… ఎలక్టొరల్ కాలేజీలో మెజారిటీ పొందలేక ఓడిపోయిన సందర్భాలున్నాయి. 2016 ఎన్నికలలో డెమొక్రటిక్ పార్టీ అభ్యర్థి హిల్లరీ క్లింటన్ పాపులర్ ఓటు మెజారిటీ పొంది కూడా, ఎలక్టొరల్ కాలేజీలో తగినంత మెజారిటీ రాక ఓటమి పాలయ్యారు. 2000 ఎన్నికలలో డెమొక్రటిక్ పార్టీ అభ్యర్థి అల్‌గొరేకు రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి జార్జి బుష్ కంటే పాపులర్ ఓట్లు 5 లక్షల 40 వేలు అధికంగా వచ్చినప్పటికీ, ఎలక్టొరల్ కాలేజి ఓట్లు జార్జ్ బుష్‌కు 271, అల్‌గొరేకు 267 వచ్చి బుష్ గెలుపొందాడు. అమెరికా అధ్యక్ష ఎన్నికల విధానం ప్రజాస్వామ్య సూత్రాలకు విరుద్ధమైనదని రాజ్యాంగ నిపుణులు వ్యాఖ్యానిస్తున్నారు.
ఈసారి గెలిచేది ఎవరో?
నవంబర్ ఐదున జరిగే అధ్యక్ష ఎన్నికల ఫలితాల కోసం ప్రపంచం ఉత్కంఠంగా ఎదురు చూస్తున్నది. ట్రంప్- హారిస్ మధ్య నువ్వా నేనా అన్న రీతిలో పోటీ నెలకొంది. అమెరికా ఆర్ధిక విధానం పెట్టుబడిదారీ విధానమే అయినా ఈసారి ఆర్ధిక రాజకీయాంశాలతో పాటు ప్రధానంగా మహిళలకు అబార్షన్ హక్కు అంశం తెరపైకి వచ్చింది. ఈ హక్కును ఇచ్చేందుకు రిపబ్లికన్లు వ్యతిరేకిస్తున్నారు. డెమోక్రాట్లు అనుకూలంగా ఉన్నారు. ట్రంప్ అనుచరులు గతంలో పార్లమెంటుపై దాడి చేసిన తీరు, నిరుద్యోగం, మిడిల్ ఈస్ట్ యుద్ధం, వలసలు వంటివి ఈ ఎన్నికల్లో ప్రధానాంశాలుగా నిలిచాయి. శ్వేత జాతీయులు ట్రంప్ ను, నల్లజాతీయులు హారిస్ ను సమర్థిస్తున్నారు. ఓటింగ్ లో మూడో స్థానంలో ఉన్న హిస్పానియన్లు ఈసారి కీలకం అయ్యారు. గెలుపోటములను వీళ్లే నిర్ణయిస్తారని అంచనా. భారతీయ సంతతిలో మెజారిటీ ఓటర్లు కమలాహారిస్ ను బలపరుస్తున్నారు.
Next Story