కాళ్లకు గొలుసులు కట్టి.. చేతులకు సంకెళ్లేసే మనోళ్లను తిప్పి పంపారు!
x

ఇమేజ్ కర్టేసి-Instagram

కాళ్లకు గొలుసులు కట్టి.. చేతులకు సంకెళ్లేసే మనోళ్లను తిప్పి పంపారు!

అమెరికా అమానుషత్వంపై దేశవ్యాప్తంగా ఆగ్రహం వ్యక్తమవుతోంది. కాళ్లకు గొలుసులు కట్టి.. చేతులకు బేడీలు వేసి భారీతీయుల్ని విమానం ఎక్కించిన తీరు విమర్శలపాలైంది.


అమెరికా నుంచి అమానుషంగానే అక్రమ భారతీయ వలసదారుల్ని పంపించేస్తున్నారు. అక్రమంగా నివసిస్తున్న భారత వలసదారుల (Indian Migrants)తో అమెరికా అధికారులు అమానవీయంగా వ్యవహరించినట్టు వీడియోలు బయటకు వస్తున్నాయి. దీంతో ఇండియాలోని ప్రతిపక్ష పార్టీలు చేస్తున్న విమర్శలు నిజమేనని తేలిపోయింది. సరిగ్గా ఈ సమయంలో ఒక వీడియో వైరల్ అవుతోంది. దానిని యూఎస్ అధికారి తన సామాజిక మాధ్యమం ఎక్స్ లో షేర్ చేశారు. అక్రమ వలసదారుల్ని విజయవంతంగా భారత్‌కు తరలించామని పోస్టు పెడుతూనే కాళ్లకు గొలుసులు, చేతులకు బేడీలు ఉన్న వీడియోను షేర్ చేశారు. ఇప్పుడది తీవ్ర కలకలం రేపింది.
అసలేం జరిగిందీ...
అమెరికా హోంలాండ్‌ అధికారుల లెక్కల ప్రకారం 20,407 మంది భారతీయుల (Indian Migrants) వద్ద సరైన పత్రాలు లేవు. వీరిలో 17,940 మందిని వెనక్కి పంపేందుకు తుది ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఇందులో తొలివిడతగా 104 మందిని అమెరికా తన ప్రత్యేక విమానంలో వెనక్కి పంపింది. ఆ విమానం అమృతసర్ లో దిగింది. దీనికి సంబంధించి అమెరికా సరిహద్దు గస్తీ విభాగం (USBP) చీఫ్ మైఖెల్ డబ్ల్యూ బ్యాంక్స్ 'ఎక్స్' (X) వేదికగా ఒక వీడియోను షేర్‌ చేశారు.

‘‘చట్టవిరుద్ధంగా అమెరికాలో ఉంటున్న విదేశీయులను విజయవంతంగా తిరిగి పంపేశాం. ఇమ్మిగ్రేషన్ చట్టాలను అమలు చేయడంలో అనుసరిస్తోన్న నిబద్ధతను ఈ మిషన్ వెల్లడిచేస్తోంది’’ అని తన పోస్టులో పేర్కొన్నారు. అక్రమంగా సరిహద్దులు దాటితే వారిని తిరిగి పంపేస్తామంటూ హెచ్చరికలు చేశారు.
ఆ వీడియోలో సీ-17 విమానం డోర్ తెరిచి ఉంది. ఇది భారతీయులను తీసుకువచ్చిన విమానం. అందులో ఎక్కిస్తున్న వాళ్ల కాళ్లకు గొలుసులు కట్టి ఉన్న వలసదారులు వరుసలో నడుస్తూ ఆ విమానం డోర్ వైపు వెళ్లడం కనిపించింది. నేరస్థుల మాదిరి వారిని విమానంలోకి తరలించారు. వారి వెనక సైనికులు ఎక్కారు.
మైఖెల్ పోస్టు ప్రకారం.. ఆ భారతీయుల విమానం టెక్సాస్‌లో టేకాఫ్ అయి, అమృత్‌సర్‌లో ల్యాండ్ అయింది. దీన్నిబట్టి ఇండియన్స్ ను నేరస్తుల మాదిరిగా స్వదేశానికి తరలించినట్టు అర్థమవుతుతోందని కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఆక్షేపించింది. అమెరికా (USA) నుంచి భారత్‌ వచ్చిన విమానంలో వలసదారుల కాళ్లకు గొలుసులు, చేతికి సంకెళ్లు ఉన్న దృశ్యాలు నిన్న సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి. దీనిపై కాంగ్రెస్‌ నేతలు తీవ్రంగా స్పందించారు. వారిని నేరస్థులుగా పంపడం అవమానకరమని, ఓ భారతీయుడిగా ఇలాంటి దృశ్యాలు చూడలేకపోతున్నానని కాంగ్రెస్‌ నేత పవన్‌ ఖేడా ఆవేదన వ్యక్తంచేశారు. దీంతో ఇది కాస్తా చర్చనీయాంశమైంది.
సమాచార శాఖ ఫ్యాక్ట్ చెక్ ఏమందంటే...
ఈ ఆరోపణల్లో నిజానిజాలు నిగ్గుతేల్చేందుకు ప్రభుత్వానికి చెందిన పీఐబీ (ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో) ఫ్యాక్ట్‌చెక్‌ (PIB Factcheck) డిపార్ట్‌మెంట్ ఆ ఫొటోలపై నిజ నిర్దరణ ప్రక్రియ చేపట్టింది. ఇందులో అవి ‘ఫేక్‌’ అని తేలినట్లు పీఐబీ వెల్లడించింది. ‘‘భారత వలసదారులను సంకెళ్లు వేసి స్వదేశానికి పంపించినట్లుగా సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అవుతున్న దృశ్యాలు నకిలీవి. ఆ ఫొటోల్లో ఉన్నది భారతీయులు కారు. వాస్తవానికి అమెరికాలోని కొందరు అక్రమ వలసదారులను గ్వాటెమాలకు పంపిస్తున్న చిత్రాలవి’’ అని రాసుకొచ్చింది.
ఇప్పుడు మైఖైల్ పోస్టుతో పీఐబీ ఫ్యాక్ట్ చెక్ చెప్పిన దానిపై అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. కేంద్ర ప్రభుత్వం కావాలనే వాస్తవాన్ని దాస్తోందని విపక్షాలు విమర్శలకు దిగాయి. కేంద్ర విదేశాంగ శాఖ కూడా దీనిపై దృష్టి సారించింది. ఈనెల 12న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అమెరికా వెళ్లినపుడు ఈ అంశాన్ని ప్రస్తావిస్తారని సమాచారం. ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ పట్ల ఇంత అమానుషంగా ప్రవర్తించాల్సిన పని లేదంటూన్న ఇండియా ఆ విషయాన్నే ఓ ప్రకటన రూపంలో చెప్పడానికి వెనుకాడుతోందన్న విమర్శలు వినవస్తున్నాయి.
ఒక్కో బాధితునిది ఒక్కో దీనగాధ..
అమెరికా కలలు కంటూ తమ కుటుంబాలకు మంచి జీవితం ఇద్దామనుకొని అక్కడికి వెళ్లిన వారి ఆశలు అడియాశలయ్యాయి. భవిష్యత్తు అగమ్యగోచరంగా మారిపోయింది. ఈక్రమంలో వారి దీనగాథలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి.
అమెరికాలో వర్క్ వీసా ఇప్పిస్తానని నమ్మబలికిన ఏజెంట్‌కు రూ.42 లక్షలు ఇచ్చి హర్వీందర్ సింగ్‌ దారుణంగా మోసపోయాడు. ఆయనది పంజాబ్‌లోని హోషియాపుర్‌కు చెందిన తహ్లీ గ్రామం. తర్వాత వీసా రాలేదని చెప్పడంతో ఢిల్లీ నుంచి ఖతర్‌.. అక్కడి నుంచి బ్రెజిల్ వెళ్లి నానాయాతన పడుతూ అమెరికా వెళ్లాడు. ఇప్పుడు ట్రంప్ ఎఫెక్ట్‌తో ఉన్న డబ్బు పోయి, ఎక్కడ మొదలుపెట్టాడో అక్కడికే వచ్చి నిల్చున్నారు. ‘‘ఎలాగోలా బ్రెజిల్ చేరితే తర్వాత పెరూలో విమానం ఎక్కిస్తానని చెప్పారు. కానీ అలాంటి ఏర్పాటు ఏదీ చేయలేదు. తర్వాత ట్యాక్సీల్లో కొలంబియా, పనామా తీసుకెళ్లారు. అక్కడి నుంచి నౌక ఎక్కిస్తామన్నారు. అదీ లేదు. రెండురోజుల పాటు అక్రమమార్గంలో ప్రయాణించాం. తర్వాత పర్వతమార్గంలో ముందుకెళ్లాం. మెక్సికో సరిహద్దుకు వెళ్లడం కోసం మమ్మల్నందరినీ ఒక చిన్న బోటులో కుక్కేశారు. అందులో నాలుగు గంటలు ప్రయాణించిన తర్వాత బోటు తిరగబడింది. దానివల్ల ఒక వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడు. పనామా అడవిలో మరొకరు చనిపోయారు’’ అని సింగ్ కన్నీరు మున్నీరయ్యారు.

దారాపుర్‌ గ్రామానికి చెందిన సుఖ్‌పాల్‌ సింగ్‌ కూడా ఇలాంటి దుస్థితినే ఎదుర్కొన్నారు. 15 గంటల పాటు సముద్ర ప్రయాణం చేసి, దాదాపు 45 కి.మీ. పర్వతమార్గంలో ముందుకెళ్లారు. ‘‘ఎవరైనా గాయపడితే.. వారి పరిస్థితి అంతే. మిగిలేది మరణమే. దారివెంట ఎన్నో మృతదేహాలను చూశాం. ఇక కొద్దిసేపట్లో మెక్సికో సరిహద్దు దాటి అమెరికాలో అడుగుపెడతామనగా జలంధర్‌కు చెందిన ఓ వ్యక్తి అరెస్టు కావడంతో మా ప్రయణం అంతా వృథా అయింది. దాంతో మమ్మల్ని 14 రోజులపాటు చీకటి గదుల్లో బంధించారు. సూర్యుడు జాడే లేకుండా పోయింది. అక్కడ వేలాది మంది పంజాబీ కుటుంబాలకు చెందిన యువకులు, పిల్లలు కనిపించారు. అందరిదీ ఒక్కటే దుస్థితి. ఇలా అక్రమమార్గంలో విదేశాలకు వెళ్లొద్దని కోరుతున్నా’’ అని సుఖ్‌పాల్ ఆవేదన వ్యక్తంచేశారు.
అమెరికా వెనక్కి పంపిన వారిలో 33 మంది చొప్పున హరియాణా, గుజరాత్‌ల నుంచి, 30 మంది పంజాబ్‌ నుంచి, ముగ్గురేసి చొప్పున మహారాష్ట్ర, ఉత్తర్‌ ప్రదేశ్‌ల నుంచి, ఇద్దరు చండీగఢ్‌ నుంచి ఉన్నారు. అమృత్‌సర్‌కు తీసుకొచ్చిన వారిలో 19 మంది మహిళలు, 13 మంది మైనర్లు ఉన్నారు.
Read More
Next Story