
అమెరికాలో కనీస వేతనాలు పెరిగే అవకాశం.
భారతీయ నిపుణులపై ప్రభావం ...
అమెరికాలో విదేశీ ఉద్యోగులకు జీతాలు పెరిగే అవకాశం ఉంది. అమెరికా కార్మిక శాఖ వేతన సవరణకు చేసిన ప్రతిపాదనతో జీతాలు పెరిగే అవకాశం ఉన్నట్లు తాజా సమాచారం. ఇటీవల యునైటెడ్ స్టేట్స్ డిపార్ట్‌మెంట్ ఆఫ్ లేబర్ ఈ ప్రతిపాదిత నియమాన్ని రూపొందించింది. విదేశీ కార్మికులకు కంపెనీలు ఎంత చెల్లించాలనే దాన్ని లక్ష్యంగా చేసుకుని ఈ చర్య తీసుకుంది. ప్రస్తుతం అమలులో ఉన్న ‘ప్రీవైలింగ్ వేతనాలు’ ఉద్యోగ స్వభావం, పని చేసే ప్రదేశం ఆధారంగా నిర్ణయించారు. ప్రత్యేకంగా టెక్నాలజీ, ఆరోగ్య రంగాల్లో విదేశీ ప్రతిభపై ఆధారపడే సంస్థలపై ప్రభావం ఎక్కువగా ఉండొచ్చు. యజమానులు స్పాన్సర్ చేసే నిర్ణయాల్లో కూడా మార్పులు రావచ్చు.
H-1B వీసా హోల్డర్లలో భారతీయులు అధిక శాతం ఉన్నారు. 2024 ఆర్థిక సంవత్సరంలో ఆమోదించిన మొత్తం H-1B పిటిషన్లలో 71 శాతం భారతీయులకు మంజూరైనట్లు అమెరికా పౌరసత్వం, ఇమ్మిగ్రేషన్ సర్వీసెస్ డేటా చెబుతోంది. దాదాపు 2.8 లక్షల ఆమోదాలు నమోదయ్యాయి. ఈ నేపథ్యంలో వేతన నియమాల్లో మార్పులు అమలైతే భారతీయ నిపుణులు, వారిని నియమించే కంపెనీలపై గణనీయ ప్రభావం ఉండే అవకాశముంది. అయితే ఇది ఇప్పటికీ ప్రతిపాదన దశలోనే ఉంది. తుది నిర్ణయం వెలువడాల్సి ఉంది.

