
ఇకపై అక్రమ వలసదారుల తరలింపు సాధారణ విమానాల్లోనే..కారణమేంటి?
ఖర్చు మోపెడవుతుందని అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌కు సలహా ఇచ్చినట్లున్నారు. అందుకే అక్రమ వలసదారులను ఇక నుంచి సాధారణ విమానాల్లోనే తరలించాలన్న నిర్ణయానికి వచ్చారు.
అత్యధిక ఖర్చుల కారణంగా.. అక్రమ వలసదారులను వారి స్వదేశాలకు పంపేందుకు సైనిక విమానాల వాడకాన్ని అమెరికా ప్రభుత్వం తాత్కాలికంగా నిలిపివేసింది.
అమెరికా(America) అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్(Donald Trump) రెండోసారి అధికారంలోకి వచ్చాక ఎన్నికల హామీలను అమలు చేయడం మొదలుపెట్టారు. వాటిల్లో ఒకటి.. తమ దేశం నుంచి అక్రమవలసదారులను (Illegal immigrants) తిరిగి వారి స్వదేశాలకు పంపించడం. అక్రమ వలసదారుల పట్ల తమ వైఖరి ఎంత కఠినంగా ఉంటుందో చెప్పేందుకు ట్రంప్ యుద్ధవిమానాలను వినియోగించారు. అయితే వీటిలో ప్రయాణం చాలా ఖర్చుతో కూడుకున్నదన్న రక్షణ శాఖ అధికారుల సూచనతో..ఇక సాధారణ విమానాల్లోనే తరలించాలన్న నిర్ణయానికి వచ్చారు.
వాల్ స్ట్రీట్ జర్నల్ కథనం ప్రకారం.. ఇటీవల 30 C-17, 12 C-130 విమానాలు వలసదారులను భారత్, పెరూ, గ్వాటెమాలా, ఈక్వడార్, హోండురాస్, పనామా, గ్వాంటనామో బే(Guantanamo Bay) వంటి ప్రాంతాలకు తీసుకెళ్లాయి. వీటిల్లో తీసుకెళ్లడం వల్ల అమెరికాకు చాలా ఖర్చయ్యింది. భారత్‌కు బయలుదేరిన ఒక్కో విమానానికి 3 మిలియన్ డాలర్లు ఖర్చయింది. గ్వాంటనామోకు తీసుకెళ్లడానికి ఒక్కో వలసదారుడికి 20వేల డాలర్లు ఖర్చు చేసింది.
అమెరికా ఇమ్మిగ్రేషన్, కస్టమ్స్ ఎన్‌ఫోర్స్మెంట్ (ICE) విమానానికి గంటకు 8,500 డాలర్లు ఖర్చయితే.. అదే C-17 విమానానికి గంటకు 28,500 డాలర్లు ఖర్చు అవుతుంది.
ఆ నిబంధనతో పెరిగిన ఖర్చు..
కొన్ని దేశాలు తమ గగనతలంలో సైనిక విమానాలు (Military planes) ఎగిరేందుకు అనుమతించవు. ఆ జాబితాలో మెక్సికోతో పాటు మరికొన్ని దేశాలు ఉన్నాయి. దీంతో మెక్సికో తమ దేశ వాణిజ్య విమానాన్ని అమెరికాకు పంపి తమ వాళ్లను తెచ్చుకుంది. తమ గగనతలం మీదుగా ఇతర దేశాలకు సైనిక విమానాలు వెళ్లేందుకు కూడా మెక్సికో అంగీకరించకపోవడంతో.. అమెరికా సైనిక విమానాలు మరో రూట్లో గమ్యస్థానం చేరుకుంటున్నాయి. దీంతో ఇంధనానికి బోలెడంత ఖర్చవుతుంది.
మెక్సికో బాటలో కొలంబియా, వెనిజులా..
2024 జనవరిలో కొలంబియా అధ్యక్షుడు గుస్తావో.. తమ భూభాగం మీదకు పెట్రో C-17 విమానాలను ప్రవేశాన్ని నిరాకరించారు. దీంతో కొలంబియానే తమ స్వంత విమానాలను అమెరికాకు పంపి తమ పౌరులను స్వదేశానికి తీసుకెళ్లింది. ఇప్పటి వరకు ఏ C-17 విమానం కొలంబియాలో దిగలేదు. అలాగే 2024 ఫిబ్రవరిలో వెనిజులా తన పౌరులను తిరిగి తీసుకెళ్లేందుకు రెండు వాణిజ్య విమానాలను అమెరికాకు పంపింది. ఈ పరిణామాల నేపథ్యంలో అమెరికా ప్రభుత్వం అక్రమ వలసదారులను సైనిక విమానాల్లో తరలించకూడదన్న నిర్ణయం తీసుకుంది.