అమెరికా నుంచి ఇంటిబాట పట్టిన 90 వేల మంది భారతీయులు
x

అమెరికా నుంచి ఇంటిబాట పట్టిన 90 వేల మంది భారతీయులు

చట్టబద్ధమైన పత్రాలు లేకుండా అమెరికాలో ఉంటున్న వారిని, అక్రమంగా చొరబాటుకు ప్రయత్నించి పట్టుబడిన వారిని అమెరికా తిరిగి వెనక్కిపంపించి వేస్తోంది.


2024 నవంబర్ 5న జరుగనున్న అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ప్రధానాంశమైన అక్రమ వలసదారుల వేట ప్రారంభమైంది. అమెరికాలో ఉంటున్న సుమారు 29 లక్షల మంది అక్రమ వలసదారులను ఆయా దేశాలకు పంపించేస్తున్నారు. ఇందులో భాగంగా భారతదేశానికి చెందిన సుమారు 92 వేల మందిని వెనక్కుపంపుతున్నారు. అక్రమ వలసదారులతో నిండిన తొలి విమానం రెండు రోజుల కిందట ఇండియా చేరింది. యూఎస్‌ డిపార్ట్‌ ఆఫ్‌ హోంల్యాండ్‌ (డీహెచ్‌ఎస్‌) తెలిపిన వివరాల ప్రకారం అక్టోబర్ 22న ప్రత్యేక విమానంలో తొలి విడతగా అక్రమ వలసదారులను వెనక్కిపంపారు. భారత ప్రభుత్వ సహకారంతోనే ఈ చర్యలు చేపట్టింది అమెరికా. ఇలా తిరిగి వచ్చిన వారిలో ఎక్కువ మంది గుజరాతీలు, మరాఠీ, మలయాళం, పంజాబీ, తమిళ్, తెలుగు ప్రజలు ఉన్నారు.


‘చట్టబద్ధత లేకుండా అమెరికాలో ఉంటున్న భారతీయ పౌరులను వెనక్కి పంపాలని నిర్ణయించుకున్నాం. వలస వచ్చిన ప్రజలు స్మగ్లర్ల చేతిలో బందీలు కాకుండా ఉండేందుకే ఈ చర్యలు తీసుకుంటున్నాం’ అని డీహెచ్‌ఎస్‌ అధికారి తెలిపారు.

గత జూన్‌ లో అమెరికా ప్రకటించిన వివరాల ప్రకారం .. అమెరికాకు అక్రమ వలసలు పెరిగాయి. సుమారు 29 లక్షల మంది వరకు ఉన్నారు. 2024 ఆర్థిక సంవత్సరంలో దాదాపు 1 లక్షా60 వేల మంది అక్రమ వలసదారులను వెనక్కిపంపారు. 495కు పైగా ప్రత్యేక విమానాల్లో 145 దేశాలకు చెందిన వలసదారులను వెనక్కి పంపింది. వీరిలో భారత్‌తో పాటు కొలంబియా, ఈక్వెడార్‌, పెరూ, ఈజిప్ట్‌, మారిటానియా, సెనెగల్‌, ఉజ్బెకిస్థాన్‌, చైనా దేశాల పౌరులు ఉన్నారు. చట్టబద్ధమైన వలసల మార్గాలను ప్రోత్సహించేందుకే ఈ చర్యలు చేపట్టినట్టు అమెరికా తెలిపింది.
ప్రస్తుతం అందిన సమాచారం ప్రకారం 2023 అక్టోబర్ 1 నుంచి ఇప్పటి వరకు సుమారు 29 లక్షల మంది అక్రమంగా అమెరికాలోకి ప్రవేశించడానికి ప్రయత్నించారు. వీరిలో ఎక్కువ మంది కెనడా, మెక్సికో సరిహద్దుల నుంచి చొరబాటుకు ప్రయత్నించారు. ఇలా దొరికి పోయిన వారిలో 90,415 మంది భారతీయులు కాగా సగానికి పైగా గుజరాతీయులు ఉన్నారు. ఈ ఏడాది కాలంలో సగటున గంటకు పది మంది చొప్పున భారతీయుల్ని అరెస్ట్ చేసినట్టు అమెరికా ప్రభుత్వం ప్రకటించింది.
ఇండియన్స్ ఎక్కువ మంది కెనడా సరిహద్దుల్లో అరెస్ట్ అయ్యారు. కెనడా సరిహద్దులో 43,764 మంది బోర్డర్ ఫోర్స్ కి దొరికిపోయారు. మెక్సికో సరిహద్దుల్లో చిక్కిపోయిన వారి సంఖ్య తక్కువ. ఈ మధ్యకాలంలో భారతీయులు దుబాయ్ లేదా టర్కి వెళ్లి అక్కడి నుంచి ఎడారి మార్గం గుండా మెక్సికో చేరి అక్కడ నుంచి సరిహద్దులు దాటి అమెరికా భూ భాగంలోకి ప్రవేశించేందుకు ప్రయత్నం చేసినట్టు ఇమిగ్రేషన్ అధికారులు చెప్పారు.
"భారతదేశం నుంచి అమెరికాకు చట్టబద్ధంగా వలసలు వచ్చేలా మరిన్ని మార్గాలను అన్వేషిస్తున్నాం. చార్టర్డ్ ఫ్లైట్ ద్వారా భారతీయ పౌరులను ఇండియా పంపుతున్నాం. ఇండియా ప్రభుత్వం ఇందుకు సహకరించింది. ఇలా వెనక్కిపంపడం ఇదే తొలిసారి కాదు" అని అమెరికా డీహెచ్ఎస్ ప్రకటించింది.
అమెరికాలో నివసించడానికి వీలైన ధృవీకరణ పత్రాలు చూపించని ఇండియన్స్ ను యునైటెడ్ స్టేట్స్ బహిష్కరించింది. అక్టోబరు 22న భారతీయ పౌరులను తిరిగి భారత్‌కు పంపేందుకు చార్టర్డ్ విమానాన్ని ఉపయోగించింది. అక్రమ వలసలను నిరోధించే ప్రక్రియలో ఇరు దేశాలు పరస్పరం సహకరించుకుంటున్నాయి అని తెలిపింది.


Read More
Next Story