
బడ్జెట్ ను ప్రవేశపెడుతున్న నిర్మలా సీతారామన్
కేంద్ర బడ్జెట్ లో తగ్గేవి ఏమిటీ, పెరిగేవి ఏమిటంటే...
నిర్మలా సీతారామన్ బడ్జెట్ 2026–27లో ప్రభుత్వం “Ease of Living” అనే అంశాన్ని ముందుకు తెచ్చింది.
కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన యూనియన్ బడ్జెట్ 2026–27లో ప్రభుత్వం “Ease of Living” అనే అంశాన్ని ముందుకు తెచ్చింది. ఆదాయపన్ను వ్యవస్థను సరళతరం చేయడం, ఆరోగ్య రంగంలో ఉపశమనం కల్పించడం, మౌలిక పెట్టుబడులు పెంచడం వంటి చర్యలు సామాన్యుడికి ఊరటనిచ్చే ప్రయత్నంగా కనిపిస్తున్నాయి. అయితే మరోవైపు మార్కెట్ ట్రేడింగ్, కొన్ని రంగాలపై అదనపు పన్ను భారం పడనుంది.
“Ease of Living” అంటే ప్రభుత్వ విధానాలు, పథకాలు, చట్టాలు ప్రజల జీవితాన్ని తక్కువ భారం, ఎక్కువ సౌలభ్యం, తక్కువ ఖర్చు, సరళమైన ప్రక్రియలతో నడిపించేలా ఉండడం.
ఏప్రిల్ 1 నుంచి కొత్త ఆదాయపన్ను చట్టం అమల్లోకి
సామాన్యుడిపై బడ్జెట్ ప్రభావంలో అత్యంత కీలక అంశం కొత్త ఆదాయపన్ను చట్టం అమలు. Income Tax Act, 2025ను ఏప్రిల్ 1, 2026 నుంచి అమల్లోకి తీసుకొస్తున్నట్లు మంత్రి ప్రకటించారు. పన్ను ఫారాలు సరళతరం చేసి సాధారణ పౌరులు కూడా నేరుగా రిటర్నులు దాఖలు చేసేలా మార్పులు చేస్తున్నట్లు తెలిపారు.
స్మాల్ టాక్స్ పేయర్స్ (చిన్న పన్ను చెల్లింపుదారులకు) lower లేదా nil deduction certificate కోసం అధికారుల చుట్టూ తిరగాల్సిన అవసరం లేకుండా ఆటోమేటెడ్ విధానం తీసుకొస్తామని ప్రభుత్వం తెలిపింది.
రిటర్నుల సవరణకు మరింత గడువు.. ఇప్పటివరకు డిసెంబర్ 31 వరకు ఉన్న రిటర్ను సవరణ గడువును మార్చి 31 వరకు పొడిగించారు. ఇది ఉద్యోగులు, యువ ప్రొఫెషనల్స్‌కు ఊరటగా మారనుంది.
విదేశీ చదువు–వైద్యంపై ట్యాక్స్ తగ్గింపు
సామాన్య కుటుంబాలకు పెద్ద ఖర్చుగా మారుతున్న విదేశీ చదువు, వైద్య అవసరాలపై ప్రభుత్వం సడలింపునిచ్చింది. LRS కింద ఈ అవసరాలకు పంపే డబ్బుపై TCSను 5 శాతం నుంచి 2 శాతానికి తగ్గించారు.
అలాగే విదేశీ టూర్ ప్యాకేజీలపై TCS రేటును కూడా 2 శాతానికి తగ్గించారు.
ప్రమాద బాధితులకు ఉపశమనం
రోడ్డు ప్రమాదాల్లో బాధితులకు పరిహారం లభించినా, ఆ పరిహార వడ్డీపై పన్ను భారంగా మారేది. ఇకపై Motor Accident Claims Tribunal ఇచ్చే పరిహార వడ్డీపై ఆదాయపన్ను ఉండదని ప్రభుత్వం ప్రకటించింది. ఇది ప్రమాద బాధిత కుటుంబాలకు నేరుగా మేలు చేసే చర్యగా భావిస్తున్నారు.
క్యాన్సర్ మందులు చౌకయ్యే అవకాశం
ఆరోగ్య రంగంలో ముఖ్యమైన నిర్ణయంగా క్యాన్సర్ సహా కొన్ని తీవ్రమైన వ్యాధులకు ఉపయోగించే 17 మందులపై Basic Customs Duty పూర్తిగా మినహాయించారు. దీంతో మందుల ధరలు తగ్గే అవకాశముందని అంచనా.
విదేశాల నుంచి తెచ్చే వస్తువులపై డ్యూటీ తగ్గింపు
సామాన్యులు విదేశాల నుంచి personal use కోసం తెచ్చే వస్తువులపై డ్యూటీ రేటును ప్రభుత్వం 20 శాతం నుంచి 10 శాతానికి తగ్గించింది.
ఉద్యోగాల కోసం భారీ మౌలిక పెట్టుబడి
బడ్జెట్‌లో మౌలిక సదుపాయాల కోసం ప్రభుత్వం భారీగా ఖర్చు పెంచింది. క్యాపిటల్ ఎక్స్‌పెండిచర్‌ను ₹11.2 లక్షల కోట్ల నుంచి ₹12.2 లక్షల కోట్లకు పెంచింది.
ఇది రోడ్లు, రైల్వే, పట్టణాభివృద్ధి ద్వారా ఉద్యోగాలు పెంచే చర్యగా కేంద్రం చెబుతోంది.
సామాన్యుడికి భారం పడే అంశాలు
బడ్జెట్‌లో కొన్ని ప్రతిపాదనలు సామాన్యుడిపై పరోక్షంగా భారం పెంచే అవకాశమూ ఉంది.
స్టాక్ మార్కెట్ ట్రేడింగ్ ఖర్చు పెంపు
Futures, Optionsపై STT పెంపుతో ట్రేడర్లపై అదనపు భారం పడనుంది.
Scrap, minerals, liquorపై TCS (Tax collected at source) పెంపు
ఇవి పరిశ్రమల ధరలపై ప్రభావం చూపే అవకాశం ఉంది.
పొగాకు ఉత్పత్తులపై భారం పడేలా సంకేతం
Chewing tobacco, jarda వంటి ఉత్పత్తులపై NCCD రేటును 25 శాతం నుంచి 60 శాతానికి పెంచారు. అయితే effective duty rate మారదని ప్రభుత్వం స్పష్టం చేసింది.
దీంతో ఫిల్టర్ సిగరెట్లపై నేరుగా ధరల పెంపు ప్రకటించలేదని బడ్జెట్ స్పీచ్ ఆధారంగా తెలుస్తోంది. కానీ ఎంతో కొంత భారం తప్పదేమోనని విశ్లేషిస్తున్నారు.
మొత్తం మీద…
యూనియన్ బడ్జెట్ 2026–27లో ఆదాయపన్ను వ్యవస్థ సరళతరం, మందులపై డ్యూటీ మినహాయింపు, విదేశీ చదువు–వైద్యంపై ట్యాక్స్ తగ్గింపు వంటి ప్రతిపాదనలు సామాన్యుడికి ఊరటనిచ్చే చర్యలుగా కనిపిస్తున్నాయి. మరోవైపు మార్కెట్ ట్రేడింగ్, కొన్ని రంగాలపై పన్ను భారాలు పెరగడం కూడా ఈ బడ్జెట్‌లో మరో కోణం.
బడ్జెట్ ప్రతిపాదనల పూర్తి ప్రభావం అధికారిక నోటిఫికేషన్లు అమల్లోకి వచ్చిన తర్వాత మరింత స్పష్టమవుతుందని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు.
Next Story

