కన్నీళ్లు పెట్టిస్తున్న అనాథగా మారిన రెండేళ్ల చిన్నారి తీరు
x

కన్నీళ్లు పెట్టిస్తున్న అనాథగా మారిన రెండేళ్ల చిన్నారి తీరు

జాతర ముగించుకుని వెళ్తుండగా మృత్యువు వెంటాడింది.


విధి ఎంత విచిత్రమైనది.. నిన్నటి వరకు తల్లిదండ్రుల ఒడిలో కేరింతలు కొట్టిన ఆ పసిపాప, నేడు ఆసుపత్రి బెడ్‌పై అపస్మారక స్థితిలో మృత్యువుతో పోరాడుతోంది. అత్తవారింటి జాతర ముగించుకుని సంతోషంగా ఇంటికి వెళ్తున్న ఆ కుటుంబాన్ని కారు రూపంలో వచ్చిన మృత్యువు వెంటాడింది. ఈ ప్రమాదంలో తండ్రి రమేష్ అక్కడిక్కడే ప్రాణాలు కోల్పోగా, తల్లి సుజాత ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూసింది. గంటల వ్యవధిలోనే అటు అమ్మా, ఇటు నాన్న ఇద్దరినీ కోల్పోయి రెండేళ్ల ధాత్రి శ్రీ అనాథగా మారిన తీరు స్థానికులను కన్నీరు పెట్టిస్తోంది.

సంతోషంగా వెళ్తుండగా వెనుక నుంచి దూసుకొచ్చిన మృత్యువు
వివరాల్లోకి వెళ్తే.. విశాఖపట్నం జిల్లా దాకమర్రి గ్రామానికి చెందిన రమేశ్‌ (32), తన భార్య సుజాత (28), రెండేళ్ల కుమార్తె ధాత్రి శ్రీతో కలిసి శ్రీకాకుళం జిల్లా గార మండలం నిజాంబాద్‌లోని అత్తవారింటికి జాతరకు వెళ్లారు. జాతర ముగించుకుని ద్విచక్ర వాహనంపై తిరిగి ఇంటికి ప్రయాణమయ్యారు. ఈ క్రమంలో టెక్కలి నుంచి విశాఖ వైపు అతివేగంగా వెళ్తున్న ఒక కారు, బుడుమూరు కూడలి సమీపంలో వీరి బైకును వెనుక నుంచి బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాద తీవ్రతకు రమేశ్‌ అక్కడిక్కడే ప్రాణాలు వదిలారు.
గంటల వ్యవధిలో దంపతుల మృతి..అనాథగా మారిన చిన్నారి
ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన సుజాత, చిన్నారి ధాత్రి శ్రీని వెంటనే ఆసుపత్రికి తరలించారు. అయితే, విధి వెక్కిరించినట్లుగా చికిత్స పొందుతూ సోమవారం ఉదయం సుజాత కూడా మృతి చెందింది. కళ్లముందే తల్లిదండ్రులు ఇద్దరూ లోకాన్ని విడిచి వెళ్లడంతో ఆ రెండేళ్ల చిన్నారి పరిస్థితి ఇప్పుడు అత్యంత దయనీయంగా మారింది. తీవ్ర గాయాలతో ఉన్న ధాత్రి శ్రీ ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. గంటల వ్యవధిలో భార్యాభర్తలు ఇద్దరూ మరణించడంతో అటు దాకమర్రిలోనూ, ఇటు నిజాంబాద్‌ గ్రామంలోనూ విషాదఛాయలు అలుముకున్నాయి.
కేసు నమోదు చేసిన పోలీసులు
ఈ ఘటనపై సమాచారం అందుకున్న లావేరు ఎస్సై కె. అప్పలసూరి ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. అతివేగమే ఈ ప్రమాదానికి కారణమని ప్రాథమికంగా భావిస్తున్నారు. కారు డ్రైవర్ అజాగ్రత్త వల్ల ఒక చిన్నారి అనాథగా మారిందని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Read More
Next Story