
ఏపీలో రెండు ఆరోగ్య భయాలు.. వెంటిలేటర్లపై ఎనిమిది మంది!
రాజమహేంద్రవరంలో ప్రాణాలు తీస్తున్న కల్తీ పాలు, శ్రీకాకుళంలో డయేరియా విజృంభణ.
ఒకవైపు రాజమహేంద్రవరంలో ఇథలిన్ గ్లైకాల్ కలిసిన పాలు తాగి నలుగురు ప్రాణాలు కోల్పోగా, మరోవైపు శ్రీకాకుళంలో రోడ్డు మరమ్మతు పనుల వల్ల వ్యాపించిన డయేరియా వైరస్ ప్రజల ప్రాణాలను బెంబేలెత్తిస్తోంది. రాష్ట్రంలో ఏకకాలంలో రెండు ప్రధాన ఆరోగ్య సంక్షోభాలు తలెత్తడంతో ప్రభుత్వం అప్రమత్తమైంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రెండు ఘటనలపైనా స్వయంగా సమీక్షించి, బాధితులకు అత్యుత్తమ వైద్య సహాయం అందించాలని ఆదేశాలు జారీ చేశారు.
శ్రీకాకుళం నగరంలో ఈ నెల 23వ తేదీ నుంచి డయేరియా వ్యాప్తి చెందడం ప్రారంభమైంది. రోడ్ రిపేర్ పనుల కారణంగా మురుగునీరు, తాగునీటి లైన్లు కలిసిపోవడం వల్ల ఈ వ్యాధి వేగంగా వ్యాపించినట్లు అధికారులు గుర్తించారు. మొదట మున్సిపల్ మంత్రి సమీక్షించి చర్యలు చేపట్టగా, మంగళవారం రాత్రి ముఖ్యమంత్రి చంద్రబాబు జిల్లా అధికారులతో రెండు సార్లు ఫోన్‌లో మాట్లాడి పరిస్థితిని సమీక్షించారు.
ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న డయేరియా బాధితులు
65 మంది ఆస్పత్రుల్లో.. ఇద్దరి పరిస్థితి విషమం
ఈ ఘటనలో ఇప్పటివరకు 65 మంది వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొందారు. వీరిలో 8 మంది డిశ్చార్జ్ అయ్యారు. ప్రస్తుతం 55 మంది ఆస్పత్రుల్లో ఉన్నారు. శ్రీకాకుళం కిమ్స్‌లో 30 మంది, జిజిహెచ్‌లో 11 మంది, జెమ్స్‌లో 6 మంది, యుపిహెచ్‌సిలో 4 మంది, మెడికవర్‌లో ఒక్కరు, ఇతర ప్రైవేట్ ఆసుపత్రుల్లో 3 మంది చికిత్స పొందుతున్నారు. జెమ్స్ ఆసుపత్రిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. వారికి వెంటిలేటర్‌పై చికిత్స అందిస్తున్నారు. మిగిలిన 53 మంది ఆరోగ్యం నిలకడగా ఉంది.
నగరంలో క్షేత్రస్థాయి సర్వేలో డయేరియా లక్షణాలు ఉన్న మరో 79 మందిని గుర్తించారు. వారి పరిస్థితి సాధారణంగా ఉండటంతో ఆసుపత్రుల్లో చేర్చాల్సిన అవసరం లేదని డాక్టర్లు తెలిపారు. వీరికి ఇంటి వద్దే మందులు, ఓఆర్ఎస్ ప్యాకెట్లు అందజేస్తూ నిరంతరం పర్యవేక్షిస్తున్నారు.
సీఎం ఆదేశాలు.. అప్రమత్తం కావాలి
ముఖ్యమంత్రి చంద్రబాబు బాధితులందరికీ అత్యుత్తమ వైద్యం అందేలా చూడాలని, ప్రత్యేకించి వెంటిలేటర్‌పై ఉన్న ఇద్దరి ఆరోగ్యంపై ప్రత్యేక దృష్టి పెట్టాలని ఆదేశించారు. వ్యాధి మరింత వ్యాప్తి చెందకుండా అన్ని ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని స్పష్టం చేశారు. తాగునీటి కాలుష్యం నివారణకు క్లోరినేషన్ ప్రక్రియను వేగవంతం చేయాలని, మురుగునీటి కాలువల నిర్వహణపై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. ప్రజలు భయపడకుండా అవగాహన కల్పించాలని, క్షేత్రస్థాయిలో వైద్య బృందాలు అందుబాటులో ఉండి బాధితులకు ధైర్యం చెప్పాలని అధికారులను ఆదేశించారు.
రాజమహేంద్రవరం కల్తీ పాల ఘటనలో ఇప్పటికే నలుగురు మృతి చెందగా, 15 మంది ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. వీరిలో ఎనిమిది మంది పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. రెండు ఘటనల్లోనూ ప్రభుత్వం తీవ్ర స్థాయిలో స్పందించి, రాష్ట్రవ్యాప్తంగా ఆరోగ్య భద్రతా చర్యలు ముమ్మరం చేసింది. ప్రజలు శుభ్రమైన నీరు, ఆహారం వాడాలని, లక్షణాలు కనిపించిన వెంటనే వైద్యులను సంప్రదించాలని అధికారులు విజ్ఞప్తి చేశారు.

