అమరావతిలో సీడ్ యాక్సెస్ రోడ్డుకు మలుపుల తిప్పలు
x

అమరావతిలో సీడ్ యాక్సెస్ రోడ్డుకు మలుపుల తిప్పలు

అమరావతిలో రాయపూడి దగ్గర నుంచి ఎన్ హెచ్ 16 వరకు నిర్మిస్తున్న సీడ్ యాక్సెస్ రోడ్డుకు అవాంతరాలు ఎదురవుతున్నాయి. ఎందుకు?


ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి నిర్మాణంలో రోడ్లు కీలక పాత్ర పోషిస్తున్నాయి. సీడ్ యాక్సెస్ రోడ్ (ఇ-3) వంటి ముఖ్యమైన ప్రాజెక్టులు రాజధాని కనెక్టివిటీని మెరుగుపరచాలనే లక్ష్యంతో ముందుకు సాగుతున్నప్పటికీ, భూ సేకరణ సమస్యలు, రాజకీయ ఒత్తిళ్లు, ఆర్థిక దుర్వినియోగ ఆరోపణలు వివాదాస్పదం చేస్తున్నాయి. ఇటీవల సీడ్ యాక్సెస్ రోడ్‌లో వెంకటపాలెం వద్ద ఊహించని మలుపు ఈ వివాదాలకు కొత్త మలుపు ఇచ్చింది. అక్కడి నుంచి ఉండవల్లి వరకు ముక్కలు, ముక్కలుగా రోడ్డు వేశారు. మిగిలిన ప్రాంతాల్లో భూమిని రోడ్డుకు స్థానికులు ఇవ్వలేదు. ప్రభుత్వం భూ సేకరణలో విఫలమవడం, పాలకుల ఇష్టానుసార వ్యవహారాలు ప్రజలలో అసంతృప్తిని పెంచుతున్నాయి.

సీడ్ యాక్సెస్ రోడ్ మలుపు ఎందుకు?

సీడ్ యాక్సెస్ రోడ్ మొత్తం 21 కి.మీ. పొడవున్న 9 లేన్ల ఆర్టీరియల్ రోడ్‌గా రూపుదిద్దుకుంటోంది. ఫేజ్-1లో 14 కి.మీ. 8 లేన్ల రోడ్ వెంకటపాలెం వరకు పూర్తయింది. ఫేజ్-2లో 3.92 కి.మీ. వెంకటపాలెం నుంచి ఉండవల్లి వరకు పనులు జరుగుతున్నాయి. అయితే రాయపూడి దగ్గర నుంచి ఎన్‌హెచ్-16లో కలిసే ఈ రోడ్ వెంకటపాలెం వద్ద మంతెన సత్యనారాయణ ప్రకృతి వైద్యశాల దగ్గర మలుపు తిరిగింది. దీని వెనుక కారణం 90 సెంట్ల భూమి సేకరణలో విఫలత. ఆ భూమి యజమాని హైకోర్టు న్యాయవాది కావడంతో ల్యాండ్ పూలింగ్‌కు అంగీకరించకుండా, ల్యాండ్ అక్విజిషన్‌కు మాత్రమే సిద్ధమని చెప్పారు. ప్రభుత్వం తక్షణ నోటిఫికేషన్ ఇవ్వలేకపోవడంతో రోడ్‌ను మలుపు తిప్పాల్సి వచ్చింది. ఇది అమరావతిలో హాట్ టాపిక్‌గా మారింది.


రెండు నెలల క్రితం వరకు ఆకుకూర పండించిన భూమి, నేడు ఖాళీగా ఉంది...

కరకట్ట వైపు తిరిగిన మలుపు

ఈ మలుపు ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయానికి సమీపంలోని కరకట్టపైకి వస్తుంది. అసలు రోడ్ నేరుగా ఉండవల్లి పొలాల మీదుగా ప్రకాశం బ్యారేజ్ వద్దకు వెళ్లి, అక్కడ స్టీల్ బ్రిడ్జి ద్వారా తాడేపల్లి నుంచి ఎన్‌హెచ్-16లో కలవాలి. కానీ ఉండవల్లి వాసులు భూ సమీకరణకు అంగీకరించకుండా కోర్టులో పిటిషన్లు వేయడంతో ఆ భూములు విచారణలో ఉన్నాయి. దీంతో ప్రభుత్వం రోడ్‌ను కరకట్ట వైపు తిప్పింది. విచిత్రం ఏమిటంటే, వెంకటపాలెం వరకు 9 లేన్లుగా ఉన్న రోడ్ అక్కడి నుంచి సీఎం ఇంటి సమీపం వరకు కేవలం 2 లేన్లుగానే నిర్మితమైంది. ప్రజలు ఈ ఎక్స్‌టెన్షన్‌ను కోరలేదు. కానీ పాలకులు ఇష్టానుసారం చేస్తున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. కరకట్ట రోడ్‌ను 4 లేన్లుగా విస్తరిస్తున్నారు. దీనిని ఎన్‌హెచ్-16తో కలుపుతున్నారు. అయితే సీడ్ యాక్సెస్ రోడ్ పూర్తయితే కరకట్ట మార్గం అనవసరమవుతుందని మంత్రి పి నారాయణ పేర్కొన్నారు.

దుర్వినియోగం, ఎంత నష్టం?

సీడ్ యాక్సెస్ రోడ్ నిర్మాణానికి కి.మీ.కు సగటున 80-100 కోట్ల రూపాయలు ఖర్చవుతోందని విమర్శలు వినిపిస్తున్నాయి. మొత్తం ప్రాజెక్టు ఖర్చు రూ.2,300 కోట్లు (సుమారు 21 కి.మీ.కు), కానీ ఫేజ్-2 విస్తరణకు రూ.3,197 కోట్లు, ఎన్‌హెచ్-16తో కనెక్షన్‌కు రూ.532 కోట్లు, ప్రకాశం బ్యారేజ్ నుంచి 3.5 కి.మీ.కు రూ.593 కోట్లు కేటాయించారు. ఎన్‌హెచ్‌ఎఐ రోడ్లకు కి.మీ.కు 20-30 కోట్లు ఖర్చవుతుండగా, అమరావతి రోడ్లు ఎందుకు ఇంత ఖరీదు? మలుపు తిప్పడం వల్ల అదనపు ఖర్చు 50-100 కోట్లు అవుతుందని అంచనా. ఇది దుర్వినియోగమని విపక్షాలు ఆరోపిస్తున్నాయి. ‘‘అందితే జుట్టు, లేకుంటే కాళ్లు’’ అన్నట్లు పాలకులు వ్యవహరిస్తున్నారని విమర్శలు ఉన్నాయి. భూ సేకరణ సాధ్యం కాకపోతే మలుపులు తిప్పి, సీఎం ఇంటి సమీపంలోకి రోడ్ తీసుకురావడం వ్యక్తిగత ప్రయోజనాలకు సంకేతమా అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి.

ప్రజల అసంతృప్తి ఎందుకు?

అమరావతి రోడ్ల నిర్మాణంలో ప్రజల అసంతృప్తికి ప్రధాన కారణాలు భూ సేకరణ వివాదాలు, ఆలస్యాలు. ల్యాండ్ పూలింగ్ స్కీమ్ (ఎల్‌పిఎస్) ద్వారా 37,941 ఎకరాలు సేకరించారు. కానీ 2 శాతం రైతులు ఇంకా ప్లాట్లు పొందలేదు. వార్షిక అన్యూటీ చెల్లింపులు ఆలస్యం, ప్లాట్ అలాట్‌మెంట్లలో వివాదాలు ఉన్నాయి. గ్రామాల్లో రోడ్లు వేస్తుంటే ఇండ్లు కూల్చేసి, ప్రభుత్వం నోటిఫికేషన్లు జారీ చేస్తోంది. కానీ కొన్ని సందర్భాల్లో సీడ్ రోడ్ మలుపు వంటివి ఒకే వ్యక్తి వల్ల మార్పులు చేయడం అన్యాయమని రైతులు భావిస్తున్నారు. 2019-2024 మధ్య మూడు రాజధానుల నిర్ణయంతో పనులు నిలిచిపోయాయి. ఇప్పుడు తిరిగి ప్రారంభమైనా వేగం సరిపోవడం లేదు. రైతులు 1,631 రోజులు నిరసనలు చేశారు. ప్రభుత్వం రూ.58,000 కోట్ల ప్రాజెక్టులు ప్రకటించినా, ఆన్‌గ్రౌండ్ ప్రోగ్రెస్ నెమ్మదిగా ఉండటం అసంతృప్తికి కారణం.

అమరావతి రోడ్లు రాజధాని అభివృద్ధికి మూల స్తంభాలు. కానీ భూ సమస్యలు, ఖర్చు దుర్వినియోగ ఆరోపణలు ప్రభుత్వానికి సవాల్‌గా మారాయి. పారదర్శకత, వేగవంతమైన సేకరణలు లేకుంటే ప్రజల విశ్వాసం కోల్పోయే ప్రమాదం ఉంది. ఈ విషయంలో ప్రభుత్వం మరింత జవాబుదారీతనంతో ముందుకు సాగాలి.

Read More
Next Story