
చిన్న గుళ్లకు తిప్పలు తప్పవేమో, రోజువారీ ఖర్చులకు వడ్డీ సొమ్మే ఆధారం!
స్థానిక ఆలయాల నిర్వహణలో టీటీడీ మార్పులు
టీటీడీ తీసుకున్న కొత్త నిర్ణయం చిన్న ఆలయాల మనుగడను దెబ్బతీస్తుందా అంటే అవుననే సమాాధానమే వస్తోంది ఆలయ అధికారుల నుంచి. టీటీడీ ఆధ్వర్యంలోని స్థానిక, అనుబంధ ఆలయాల నిర్వహణను ఆర్థికంగా స్వయం సమృద్ధిగా తీర్చిదిద్దేందుకు ప్రతి ఆలయానికి ప్రత్యేక కార్పస్ ఫండ్ ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఆలయాల రోజువారీ నిర్వహణ, చిన్నపాటి మరమ్మతులు వంటి ఖర్చులు కార్పస్ ఫండ్ వడ్డీ నుంచే భరించే విధంగా వ్యవస్థీకరణ చేయాలని టీటీడీ సూచించింది. పెద్ద స్థాయి మరమ్మతులు, వార్షిక ఉత్సవాలను మాత్రం కేపిటల్ ఖర్చుగా పరిగణించి టీటీడీ నిధులతో చేపట్టాలని టీటీడీ సూత్రప్రాయంగా నిర్ణయించింది.
టీటీడీ పరిపాలనా భవనంలోని ఈవో ఛాంబర్‌లో నిర్వహించిన సమీక్ష సమావేశంలో స్థానిక, అనుబంధ ఆలయాల ఆదాయాలు, ఖర్చులు, బడ్జెట్ వినియోగం, అభివృద్ధి పనులపై ఈవో అధికారులతో ఈవో అనిల్ కుమార్ సింఘాల్ సమగ్రంగా చర్చించారు. ప్రతి ఆలయానికి వార్షిక హుండీ ఆదాయం ఎంత, ఖర్చులు ఎంత, ఆదాయానికి మించి ఖర్చులు జరుగుతున్న ఆలయాలేమిటి అన్న అంశాలపై వివరాలు తీసుకున్నారు.
ఆలయాల ఆర్థిక నిర్వహణలో స్పష్టత కోసం ప్రతి ఆలయానికి ఒక జనరల్ అకౌంట్, అన్నదానం కోసం మరో ప్రత్యేక అకౌంట్ తెరవాలని సూచించారు. భక్తుల సౌకర్యాల పరంగా క్యూలైన్లు, సీసీటీవీ వ్యవస్థ, భద్రత, రవాణా, ట్రాఫిక్ నిర్వహణ వంటి అంశాలపై అధికారులకు మార్గనిర్దేశం చేశారు. వేసవి కాలం దృష్ట్యా వైద్య సేవలు, తాగునీరు, వ్యర్థాల నిర్వహణ, మరుగుదొడ్ల నిర్వహణ వంటి అంశాలపై ముందస్తు ప్రణాళికతో చర్యలు చేపట్టాలని ఆదేశించారు.
అలాగే, ఆలయాల్లో ఉద్యోగులు మరింత సమర్థవంతంగా విధులు నిర్వహించేలా ప్రామాణిక ఆపరేటింగ్ విధానం (SOP) రూపొందించాలని, ప్రతి ఆలయంలో భక్తులు విరాళాలు సులభంగా అందించేలా క్యూఆర్ కోడ్ విధానాన్ని పటిష్టంగా అమలు చేయాలని ఈవో స్పష్టం చేశారు.

