
చంద్రబాబుకి మచ్చ రాకూడదు..జంగా కృష్ణమూర్తి భావోద్వేగ వివరణ
రాజకీయం కంటే ఆత్మగౌరవం ముఖ్యం. నిబంధనల సాకుతో నాపై విమర్శలు చేసేవారికి, నా రాజీనామానే సమాధానం అని జంగా పేర్కొన్నారు.
"నేను రాజకీయాల్లోకి వచ్చింది, పదవులు పొందింది ప్రజలకు సేవ చేయడానికే తప్ప.. ఆస్తులు వెనకేసుకోవడానికి కాదు. నా ఆత్మగౌరవాన్ని దెబ్బతీసేలా ప్రచారం జరుగుతున్నప్పుడు పదవిలో కొనసాగడం నాకు ఇష్టం లేదు. ముఖ్యంగా నాకు శ్రీవారిని సేవించుకునే అవకాశం కల్పించిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి నా వల్ల ఇబ్బంది కలగకూడదనే ఉద్దేశంతోనే టీటీడీ బోర్డు సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నాను" అని జంగా కృష్ణమూర్తి స్పష్టం చేశారు. శనివారం విజయవాడలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన ఈ విషయాలను వెల్లడించారు. ఇంకా ఆయన మాట్లాడుతూ..
2005లోనే నేను డొనేషన్ స్కీమ్ కింద తిరుమలలో ప్లాట్ కోసం దరఖాస్తు చేసుకున్నాను. అప్పట్లో టీటీడీ నాకు 500 గజాల స్థలాన్ని కేటాయించింది. కానీ, డొనేషన్ మొత్తం రూ. 10 లక్షల నుంచి రూ. 50 లక్షలకు పెరగడం వల్ల అప్పట్లో ఆర్థిక ఇబ్బందుల వల్ల ఆ సొమ్ము చెల్లించలేకపోయాను. అప్పటి నుంచి ఆ స్థలం కోసం నిరంతరం ప్రయత్నిస్తూనే ఉన్నాను అని వెల్లడించారు. గతంలో కేటాయించిన ప్లాట్‌ను నా వ్యక్తిగత పేరు మీద కాకుండా.. 'ఓం శ్రీ నమో వేంకటేశ్వర గ్లోబల్ ట్రస్ట్' పేరు మీద పునరుద్ధరించమని కోరాను. అక్కడ 12 గదుల అతిథి గృహం నిర్మిస్తే.. అందులో 11 గదులు సామాన్య భక్తులకే ఇస్తామని, ఒక్క గది మాత్రమే ట్రస్ట్ నిర్వహణ కోసం ఉంచుకుంటామని స్పష్టం చేశాను. భక్తి భావంతో నేను చేసిన ఈ విన్నపాన్ని బోర్డు పరిశీలించి ఆమోదించింది. కానీ, కొందరు దీనిని వివాదాస్పదం చేస్తూ నేను ఏదో తప్పు చేసినట్లు ప్రచారం చేశారని పేర్కొన్నారు.
కేబినెట్ సమావేశంలో ముఖ్యమంత్రి నా వివరణ తీసుకోకుండానే ప్లాట్ కేటాయింపు రద్దు గురించి చర్చించారని తెలిసింది. ఆ వార్తలు విన్నప్పుడు నా మనసు చాలా బాధపడింది. కొన్ని పత్రికలు నా వ్యక్తిత్వాన్ని దెబ్బతీసేలా కథనాలు రాశాయి. అందుకే, నేను ఈ పదవిలో ఉంటే ప్రభుత్వానికి, బోర్డుకు చెడ్డపేరు వస్తుందని భావించి.. తక్షణమే నా రాజీనామా లేఖను సీఎం గారికి, టీటీడీ చైర్మన్ గారికి పంపించాను అని వెల్లడించారు. శ్రీవారిని సేవించుకోవడానికి నాకు ముచ్చటగా మూడోసారి అవకాశం ఇచ్చిన చంద్రబాబు నాయుడుకి నేను ఎప్పటికీ రుణపడి ఉంటాను. కానీ, రాజకీయం కంటే ఆత్మగౌరవం ముఖ్యం. నిబంధనల సాకుతో నాపై విమర్శలు చేసేవారికి, నా రాజీనామానే సమాధానం అని పేర్కొన్నారు.

