ప్రధానమంత్రి పదవికి రాజీనామా చేయబోతున్న ‘జస్టిన్ ట్రూడో’?
పార్టీలోనూ, ప్రజల్లోనూ తీవ్ర వ్యతిరేకత నేపథ్యంలో నిర్ణయం
దేశంలో, పార్టీలో తీవ్ర వ్యతిరేకత ఎదుర్కొంటున్న కెనడా ప్రధానమంత్రి జస్టిన్ ట్రూడో తన పదవికి రాజీనామా చేయబోతున్నట్లు స్థానిక మీడియా వార్తలు ప్రచురించింది. అధికారంలో ఉన్న లిబరల్ పార్టీ అంతర్గత సమావేశం ఎల్లుండి అంటే బుధవారం జరగబోతోంది. అందులో ట్రూడో ను పదవి నుంచి బలవంతంగా దింపే అవకాశాలు ఉండటంతో ఆయనే స్వయంగా తప్పుకుంటానని ప్రకటించే అవకాశం ఉందని గ్లోబ్ అండ్ మెయిల్ ఆదివారం వార్తను ప్రచురించింది.
కొన్ని వార్తా నివేదికల ప్రకారం.. ట్రూడో లిబరల్ పార్టీ నాయకత్వానికి సోమవారమే రాజీనామా చేస్తారని, కీలక కాకస్ సమావేశం డిమాండ్ చేయడం కంటే ముందే రాజీనామా చేస్తే గౌరవంగా ఉంటుందని ఆయన భావిస్తున్నారని పేర్కొంది.
ఈ ఏడాది అక్టోబర్ లో కెనడా పార్లమెంట్ కు ఎన్నికలు జరగనున్నాయి. ప్రస్తుతం నడుస్తున్న ట్రెండ్స్ ప్రకారం అధికారంలో ఉన్న లిబరల్స్ కు కన్జర్వేటీవ్ ల చేతిలో ఘోర ఓటమి తప్పదని సంకేతాలు వెలువడుతున్నాయి. దీనితో దాదాపుగా పది సంవత్సరాలుగా అధికారం చెలాయిస్తున్న ట్రూడోకు పదవీ గండం పట్టుకుంది.
అయితే ట్రూడో రాజీనామాతో ముందుస్తు ఎన్నికలు సైతం జరిగే అవకాశం ఉంది. ఇప్పటికే అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైనా ట్రంప్, కెనడాను తన దేశంలో 51 వ దేశంగా చేరాలని బహిరంగంగానే పిలుపునిచ్చాడు. లేకపోతే అక్రమ వలసలు, డ్రగ్స్ ను నిరోధించాలని, వాటిపై నియంత్రణ సాధ్యం కాకపోతే 25 శాతం పన్ను కట్టాలని హెచ్చరించాడు. ఇది ట్రూడో అసమర్థతతోనే జరిగిందని కెనడియన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ప్రస్తుతం ట్రూడో పాపులారిటీ దారుణంగా పడిపోయింది. కొన్ని నివేదికల ప్రకారం ఆయన పాపులారిటీ ఓటు కేవలం 24 శాతంగా ఉంది. 2013 లో అధికారంలోకి వచ్చిన తరువాత ఆయన పాపులారిటీ ఇంత దారుణంగా పడిపోవడం ఇదే మొదటి సారి. నిరుద్యోగం, అధిక ధరలు, ఇమ్మిగ్రేషన్ తో కెనడా అతలాకుతలం అవుతోంది.
ప్రస్తుతం ఉన్న పరిస్థితుల ప్రకారం ఆయన రాజీనామా చేస్తే ఆర్థిక మంత్రి డొమినిక్ లెబ్లాంక్ తాత్కాలిక నాయకుడిగా, ఉండటానికి సిద్ధంగా ఉన్నారా, లేరా అని పార్టీ నాయకులను ట్రూడో కోరినట్లు పలు నివేదికలు ఉటంకిస్తూ వార్తలు ప్రచురణ అయ్యాయి. లేకపోతే తాత్కాలిక నాయకుడిగా ఆయననే ఉండమని కాకస్ కూటమి కోరే అవకాశం ఉంది.
Next Story