దివ్యాంగులతో కలిసి..ప్రయాణం చేసి
x

దివ్యాంగులతో కలిసి..ప్రయాణం చేసి

దివ్యాంగ శక్తి పథకాన్ని ప్రారంభించిన సీఎం చంద్రబాబు.


ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్‌లు మంగళగిరి నుంచి పెనుమాక వరకు ఆర్టీసీ బస్సులో దివ్యాంగులతో కలిసి ప్రయాణించి సరికొత్త ఒరవడికి శ్రీకారం చుట్టారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఈదివ్యాంగ శక్తి‘ పథకం ప్రారంభోత్సవం సందర్భంగా ఈ ముగ్గురు నేతలు బస్సులో దివ్యాంగుల పక్కన కూర్చుని, వారి సాధకబాధకాలను అడిగి తెలుసుకున్నారు. దారిపొడుగునా ప్రజలు, కూటమి కార్యకర్తలు తమ నేతలకు ఘనస్వాగతం పలికారు.


దివ్యాంగులతో సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, మంత్రి నారా లోకేష్

క్యాంప్ కార్యాలయంలో ఆత్మీయ భేటీ
బస్సు ప్రయాణం అనంతరం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేష్ లబ్ధిదారులను తమ క్యాంప్ కార్యాలయానికి ఆహ్వానించారు. అక్కడ దివ్యాంగులను ప్రతి ఒక్కరినీ సీఎం ఆప్యాయంగా పలకరించి, వారితో ముచ్చటించారు. అనంతరం నేతలు దివ్యాంగులతో కలిసి సహపంక్తి భోజనం చేశారు. ఈ సందర్భంగా లబ్ధిదారులు తమకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కల్పించినందుకు, అలాగే తమ సహాయకులకు (Helpers) టికెట్ ధరలో 50 శాతం రాయితీ ఇచ్చినందుకు ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు తెలిపారు.

దివ్యాంగులతో ముచ్చటిస్తున్న చంద్రబాబు, పవన్ కల్యాణ్, నారా లోకేష్
సంక్షేమానికి పెద్దపీట.. ముఖ్యమంత్రి
లబ్ధిదారులతో మాట్లాడిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు.. కూటమి ప్రభుత్వం గడిచిన 21 నెలల్లో పేదల సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తోందని స్పష్టం చేశారు. దివ్యాంగులు అంటే విభిన్న ప్రతిభావంతులు. వారి ఆత్మవిశ్వాసం పెంచడమే మా లక్ష్యం. అందుకే గతంలో రూ. 500 ఉన్న పింఛనును ఏకంగా రూ. 6,000కు పెంచాం. తీవ్ర అనారోగ్యంతో ఉన్న వారికి రూ. 10 వేలు, మంచానికే పరిమితమైన వారికి రూ. 15 వేలు అందిస్తున్నాం అని ఆయన పేర్కొన్నారు.

దివ్యాంగులతో కలిసి ఆత్మీయ విందులో సీఎం చంద్రబాబు
దివ్యాంగ శక్తితో ఆర్థిక ఊరట
దివ్యాంగ శక్తి పథకం ద్వారా సుమారు 12.75 లక్షల మందికి ఐదు రకాల ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యం కలుగుతుందని సీఎం వివరించారు. దీనివల్ల ప్రతి లబ్ధిదారునికి నెలకు సుమారు రూ. 2,000 వరకు ఆదా అవుతుందని ఆయన అంచనా వేశారు. మహిళల కోసం ఇప్పటికే అమలవుతున్న స్త్రీ శక్తి పథకం ద్వారా 52 కోట్ల ఉచిత ప్రయాణాలు సాగాయని, ఇప్పుడు దివ్యాంగులకు కూడా అదే గౌరవాన్ని అందిస్తున్నామని తెలిపారు. ఈ పథకం దివ్యాంగుల జీవితాల్లో కొత్త వెలుగులు నింపుతుందని ఆకాంక్షిస్తూ, అందరికీ ముందస్తు ఉగాది శుభాకాంక్షలు తెలియజేశారు.
Read More
Next Story