కాకినాడ జిల్లాలో ఘోర ప్రమాదం: బాణసంచా పేలి 22 మంది మృతి
x
బాణాసంచా కేంద్రంలో పేలుడు

కాకినాడ జిల్లాలో ఘోర ప్రమాదం: బాణసంచా పేలి 22 మంది మృతి

వేట్లపాలెం గ్రామ పరిధిలోని 'సూర్యశ్రీ ఫైర్‌ వర్క్స్‌' బాణసంచా తయారీ కేంద్రంలో భారీ పేలుడు సంభవించింది


కాకినాడ జిల్లా సామర్లకోట మండలంలో శనివారం మధ్యాహ్నం పెను విషాదం చోటుచేసుకుంది. వేట్లపాలెం గ్రామ పరిధిలోని గోదావరి కెనాల్ సమీపంలో ఉన్న 'సూర్యశ్రీ ఫైర్‌ వర్క్స్‌' బాణసంచా తయారీ కేంద్రంలో భారీ పేలుడు సంభవించింది. ఈ ప్రమాదంలో సుమారు 22 మంది మృతి చెందినట్లు ప్రాథమిక సమాచారం అందుతోంది. మృతుల్లో అత్యధికులు మహిళా కూలీలే ఉండటం స్థానికంగా తీవ్ర విషాదాన్ని నింపింది. మరో నలుగురు తీవ్రంగా గాయపడి ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్నారు.
అసలేం జరిగిందంటే ...
శనివారం మధ్యాహ్నం 2 గంటల సమయంలో కార్మికులంతా పనిలో నిమగ్నమై ఉండగా ఒక్కసారిగా బాణసంచా నిల్వలు పేలాయి. పేలుడు ధాటికి ఆ ప్రాంతమంతా దట్టమైన పొగ కమ్ముకుంది.పేలుడు శబ్దం సుమారు 5 కిలోమీటర్ల మేర వినిపించిందంటే ప్రమాద తీవ్రత ఎంతలా ఉందో అర్థం చేసుకోవచ్చు. పేలుడు ధాటికి పక్క గ్రామంలోని ఒక ప్రైవేటు పాఠశాల స్లాబ్‌కు కూడా పగుళ్లు వచ్చాయి.
సహాయక చర్యలు: సమాచారం అందుకున్న వెంటనే రెండు అగ్నిమాపక యంత్రాలు ఘటనాస్థలికి చేరుకుని మంటలను అదుపు చేసే ప్రయత్నం చేస్తున్నాయి. తీవ్రంగా గాయపడిన మరో 8 మందిని అత్యవసర చికిత్స నిమిత్తం అంబులెన్స్‌లో ఆస్పత్రికి తరలించారు.
ప్రభుత్వ యంత్రాంగం అప్రమత్తం:
ప్రస్తుతం విజయనగరం జిల్లా పర్యటనలో ఉన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ ఘటనపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.
జిల్లా కలెక్టర్, ఎస్పీలతో మాట్లాడి తక్షణమే సహాయక చర్యలు ముమ్మరం చేయాలని ఆదేశించారు.
క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని అధికారులకు సూచించారు.
ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు రాష్ట్ర హోం మంత్రి వంగలపూడి అనిత ఇప్పటికే ఘటనాస్థలికి బయలుదేరారు.
జిల్లా ఉన్నతాధికారులు సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలను స్వయంగా పర్యవేక్షిస్తున్నారు. ప్రమాదానికి గల కారణాలపై దర్యాప్తు ప్రారంభమైంది.
గమనిక: మృతుల సంఖ్యకు సంబంధించి అధికారిక ధృవీకరణ రావాల్సి ఉంది.
Read More
Next Story