నేరం చేయాలంటే నిందితులకు వణుకు పుట్టాలి: చంద్రబాబు
x

నేరం చేయాలంటే నిందితులకు వణుకు పుట్టాలి: చంద్రబాబు

కలెక్టర్ల కాన్ఫరెన్స్‌లో జిల్లా కలెక్టర్లు, ఎస్పీలకు సీఎం చంద్రబాబు దిశా నిర్థేశం చేశారు.


రాష్ట్రంలో శాంతిభద్రతల పరిరక్షణ కేవలం కాగితాలకే పరిమితం కాకూడదని, నేరం చేయాలంటేనే నిందితులకు వెన్నులో వణుకు పుట్టేలా వ్యవస్థ ఉండాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. గురువారం సచివాలయంలో జరిగిన కలెక్టర్ల కాన్ఫరెన్స్‌లో జిల్లా కలెక్టర్లు, ఎస్పీలు, ఇతర పోలీసు ఉన్నత అధికారులను ఉద్దేశించి ఆయన చేసిన ప్రసంగం ఒక హెచ్చరికలా సాగింది. ప్రజల ప్రాణాల కంటే ఏదీ ముఖ్యం కాదు.. నిబంధనల అమలులో ఎంత కఠినంగా ఉన్నారన్నదే ముఖ్యం అని ఆయన దిశానిర్దేశం చేశారు.

మహిళల భద్రతలో జీరో టాలరెన్స్

మహిళలపై జరుగుతున్న నేరాల విషయంలో ముఖ్యమంత్రి అత్యంత కఠినమైన వైఖరిని ప్రదర్శించారు. మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తించినా, అరాచకాలకు పాల్పడినా చట్టం తాలూకు శిక్ష నిందితులకు సింహస్వప్నంలా ఉండాలని ఆయన ఆదేశించారు. మహిళా భద్రతలో జీరో టాలరెన్స్ పాటించాలి. నిందితులకు భయం ఉంటేనే సమాజంలో మార్పు వస్తుంది అని పేర్కొంటూ, మదనపల్లి వంటి ఘటనలు రాష్ట్రంలో మరెక్కడా పునరావృతం కాకూడదని ఎస్పీలను హెచ్చరించారు. గృహ హింస కేసుల్లోనూ తక్షణమే స్పందించి బాధితులకు అండగా నిలవాలని సూచించారు.

రహదారి భద్రత - ప్రాణం విలువైంది

శాంతిభద్రతలతో పాటు రోడ్డు ప్రమాదాల నివారణపై సీఎం ప్రత్యేక దృష్టి సారించారు. ప్రతి ప్రాణమూ విలువైనదే.. ప్రమాదాల్లో ప్రాణాలు కోల్పోవడం అత్యంత బాధాకరం అని ఆవేదన వ్యక్తం చేశారు. డ్రంక్ అండ్ డ్రైవ్, సెల్ ఫోన్ డ్రైవింగ్, అతివేగం వంటి అంశాలపై ఎటువంటి ఉపేక్ష లేకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. నిబంధనలను ఉల్లంఘించే వారిని పట్టుకోవడానికి ఆధునిక పరికరాలైన బ్రీత్ అనలైజర్లు, స్పీడ్ గన్ల కొనుగోలు కోసం తక్షణమే రూ.44 కోట్లు విడుదల చేస్తున్నట్లు ప్రకటించి, అధికారులకు పూర్తి స్వేచ్ఛను ఇస్తున్నట్లు తెలిపారు.

బ్లాక్ స్పాట్లపై ఫోకస్.. ఫలితమే లక్ష్యం

అనకాపల్లి, పశ్చిమ గోదావరి, విశాఖపట్నం వంటి జిల్లాల్లో ప్రమాదాలు ఎక్కువగా జరిగే 'బ్లాక్ స్పాట్లపై' ప్రత్యేకంగా దృష్టి పెట్టాలని అధికారులను కోరారు. ఎస్పీలు, కలెక్టర్లు స్వయంగా ఆయా ప్రాంతాలను తనిఖీ చేసి, ప్రమాదాల నివారణకు పటిష్టమైన యాక్షన్ ప్లాన్ రూపొందించాలని సూచించారు. శ్రీకాకుళం వంటి జిల్లాల్లో అమలు చేస్తున్న ఉత్తమ విధానాలను (Best Practices) మిగిలిన చోట్ల కూడా పాటించండి.. నాకు రిజల్ట్ కావాలి అని సీఎం ఖరాఖండిగా చెప్పారు. రాష్ట్రంలో శాంతిభద్రతలు మెరుగుపడటమే కాకుండా, ప్రమాదాల రేటులో జాతీయ సగటు కంటే ఏపీ మెరుగ్గా ఉండాలని ఆయన స్పష్టం చేశారు.

Read More
Next Story