తిరుమలలో లిక్కర్ ఖాళీ సిసాలు: : పోలీసులు చెప్పిన క్రైమ్ స్టోరీ
x

తిరుమలలో లిక్కర్ ఖాళీ సిసాలు: : పోలీసులు చెప్పిన క్రైమ్ స్టోరీ

ఇది తిరుమల పవిత్రతపై కుట్ర అంటున్న తిరుపతి పోలీసులు. ఇద్దరు ముద్దాయిలు అరెస్ట్


తిరుమల పోలీస్ అతిథి గృహం సమీపంలో పెద్ద సంఖ్యలో కనిపించిన మద్యం బాటిల్స్ ఒక కుట్ర అని తిరుపతి పోలీసులు తేల్చారు. జనవరి నాలుగున ప్రత్యక్షమయిన ఈ బాటిల్స్ గురించి వార్త సోషల్ మీడియా సెన్సేషన్ అయింది. అనంతరం దీని విచారణ జరిపి ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు గురువారం నాడు తెలిపారు.

తిరుమల బాలాజీ కాలనీ కౌస్తుభం గెస్ట్ హౌస్ వద్ద పాత ఖాళీ మద్యం సీసాలకు, పోలీస్ గెస్ట్ హౌస్ కి ఎలాంటి సంబంధం లేదని నిర్ధారణ అయిందని కూడా పోలీసులు తెలిపారు.
ఇది కుట్ర అని కుట్రకి కారణం ఒక వైఎస్ ఆర్ కాంగ్రెస్ కార్యకర్త, సాక్షి పత్రిక కు చెంది ఫోటోగ్రాఫర్స్ అని పోలీసులు చెప్పారు. వాళ్ల మీద కేసులు పెట్టినట్లు వెల్లడించారు.

సిసి కెమెరాల పరిశీలన, వాహన రాకపోకలు, Fastag, ఇతర సాంకేతిక దర్యాప్తు ద్వారా చేసినట్లు పోలీసుల తెలిపారు. దీని ప్రకారం ఇదంతా తిరుపతి YSRCP లో కార్యకర్త ఉండు ఆళ్ళపాక కోటి చేసిన పని అని పోలీసులు ఈ ప్రకటనలో తెలిపారు. కోటి కొంత మందితో చేతులు కలిపి తిరుపతి దేవస్థానం, పోలీస్ డిపార్ట్మెంట్ ని టార్గెట్ చేసి, ఒక పథకం ప్రకారం కొన్ని పాత ఖాళీ మద్యం సీసాలను తిరుపతి నుండి తీసుకొని వచ్చి, తిరుమల బాలాజీ కాలనీ ప్రాంతం లోని కౌస్తుభం అతిథి గృహం కాంపౌండ్ వాల్ బయట చెట్ల పొదల వద్ద పడవేశారని పోలీసులు చెప్పారు.

మద్యం సీసాలు ప్రత్యక్షం అంటూ వార్తలు వెలువడ్డాక చుట్టుప్రక్కల వున్న కమాండ్ కంట్రోల్ తో పాటు, వివిధ ప్రదేశాలలో సిసి కెమెరాలు పరిశీలించి, దర్యాప్తు నిర్వహించడం జరిగిందని పోలీసులు తెలిపారు. ఎక్సైజ్ డిపార్టుమెంటు వారి సహకారంతో ఖాళీ సీసాల పైన వున్న ఆధారాల ద్వారా, కొనుగోలు చేసిన దుకాణాలను గుర్తించారు. ఈ కేసు లో కొంత మంది సాక్షులను వీడియో రికార్డు చేసిన వ్యక్తులను విచారించడం జరిగిందని పోలీసులు తెలిపారు.
ఇప్పటి వరకు జరిగిన దర్యాప్తు మీద పోలీసు ప్రకటన
" 04.01.2026 వ తేదీ తిరుమలకు వచ్చి, ప్లాన్ లో భాగంగా కోటి, నవీన్ కు పాన్ తెలుపగా, నవీన్ వెంటనే మోహన్ కృష్ణ అనే మరొక వ్యక్తికి తెలిపినాడు. అంతట మోహన క్రిష్ణ తను పనిచేస్తున్న సాక్షి పత్రిక ఫోటో గ్రాఫర్లు అయిన గిరి, ప్రసాద్ ముకేష్ లను అక్కడికి పంపి వారి ద్వారా వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టడం జరిగింది. పోలీస్ అతిధి గృహం వద్ద మద్యం సీసాలు అని ప్రచారం చేయడం ద్వారా తాను పని చేస్తున్న సంస్థలో తన గుర్తింపు పెంచుకోవాలి అని కుట్ర పూరితంగా ముగ్గురు కలిసి రాష్ట్రానికి, TTD కి, ప్రపంచంలో ఉన్న హిందువుల మనోభావాలను దెబ్బతీసి, అటుపై సెన్సేషన్ కలుగ జేసి, వారు TTD కి, గవర్నమెంట్ కి చెడ్డపేరు తెప్పించాలానే విధంగా ఈ దుశ్చర్య కి పాల్పడ్డారు.
ఈ నేరపూరిత కుట్రలో, ఉమ్మడి ఉద్దేశాన్ని నెరవేర్చడంలో భాగంగా, మొదటి ముద్దాయి ఆళ్ళపాక కోటి, రెండవ ముద్దాయి సాక్షి స్టాఫ్ ఫోటోగ్రాఫర్ మోహన్ క్రిష్ణ అను వాళ్ళను ఈ దినము అనగా 07-01-2026 వ తేది సాయంత్రము 03:00 PM గంటలకు, తిరుపతి, జూపార్క్ రోడ్డు లోని, దేవలోక్ వద్ద అరెస్ట్ చేసి, వారి వద్ద నుండి ఈ నేరానికి ఉపయోగించిన రెండు మొబైల్ ఫోన్ లను, ఒక Swift Dzire కారును, ఒక laptop ను స్వాధీనం చేసుకోవడం జరిగింది. సదరు మొబైల్ ఫోన్ లను తగు పరిశీలన నిమిత్తం ఫోరెన్సిక్ ల్యాబ్ కి పంపడం జరుగుతుంది.
ఈ కేసులో రెండవ ముద్దాయి మోహనక్రిష్ణ ఉద్దేశ్యపూర్వకముగా తన మొబైల్ ను దాచిపెట్టి తన ఫోన్ పోయినట్లుగా చెబుతూ, పోలీసుల దర్యాప్తుకు సహకరించడం లేదు. ఈ ప్రవర్తన అతని నేర స్పృహ మరియు దర్యాప్తుకు సహకరించని ఉద్దేశ్యాన్ని మరింత బలపరుస్తున్నది.
ఈ కేసులో మూడవ ముద్దాయి YSRCP social మీడియా కార్యకర్త అయిన నవీన్ పరారీలో ఉన్నందున, అతనిని పట్టుకోవడం కోసం ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేయడం జరిగింది.
ఈ కుట్రలో దాగి వున్న ఇతర వ్యక్తుల పాత్ర గురించి అన్నీ కోణాల్లోనూ దర్యాప్తు చేయడం జరుగుతుంది.
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వర స్వామిని, తిరుమల తిరుపతి దేవస్థానం పవిత్రత ని కాపాడటంలో టీటీడీ, విజిలెన్స్ వారి సహకారంతో మున్ముందు కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. తప్పు చేసిన వారు ఎంతటి వారైనా ఉపేక్షించేదిలేదు.
సోషియల్ మీడియాలో తిరుమల తిరుపతి దేవస్థానం కి సంబంధించిన విషయాలను అధికారిక నిర్ధారణ కాకుండా ఎవరైనా ప్రచారం చేస్తే వారి పై చట్ట పరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. స్వామి వారి పాదాల చెంత వున్న మనమంతా దేవస్థానం యొక్క పవిత్రతకు కట్టుబడి ఉండాలి అని కోరడమైనది.


Read More
Next Story