టీటీడీ నెయ్యి నేలపాలు
x

టీటీడీ నెయ్యి నేలపాలు

రోడ్డుపై నెయ్యి ఏరులై పారడంతో జనం బకెట్లతో ఎగబడ్డారు.


పుణె నుండి కలియుగ దైవం తిరుమల శ్రీవారి సన్నిధికి వెళ్తున్న నెయ్యి ట్యాంకర్ మార్గమధ్యలో ప్రమాదానికి గురైంది. కడప జిల్లా కొండాపురం మండలం పెంజిఅనంతపురం గ్రామం వద్ద జాతీయ రహదారి-67పై ఆదివారం సాయంత్రం ఈ ఘటన చోటుచేసుకుంది.

మలుపు వద్ద అదుపు తప్పిన ట్యాంకర్
సుమారు 21 వేల లీటర్ల నెయ్యితో పుణె నుండి తిరుమలకు వస్తున్న ఈ భారీ ట్యాంకర్, పెంజిఅంతపురం వద్ద ఉన్న ప్రమాదకరమైన మలుపులో ఒక్కసారిగా అదుపుతప్పి రోడ్డు పక్కన బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ట్యాంకర్ డ్రైవర్, క్లీనర్‌లకు అదృష్టవశాత్తూ స్వల్ప గాయాలయ్యాయి. అయితే, ట్యాంకర్ దెబ్బతినడంతో లోపల ఉన్న నెయ్యి రోడ్డుపైకి భారీగా కారిపోయింది.
బకెట్లు, బిందెలతో జనం క్యూ
ట్యాంకర్ నుంచి నెయ్యి కారిపోతుండటాన్ని గమనించిన స్థానికులు, క్షణాల్లోనే అక్కడికి చేరుకున్నారు. చేతికి దొరికిన బకెట్లు, బిందెలు, ప్లాస్టిక్ క్యాన్లతో నెయ్యిని పట్టుకోవడానికి ఎగబడ్డారు. కొందరు పోటీపడి మరీ నెయ్యిని నింపుకుని ఇళ్లకు తీసుకెళ్లారు. రహదారిపై నెయ్యి ఏరులై పారడంతో వాహనాల రాకపోకలకు కూడా కొంత అంతరాయం కలిగింది.
పోలీసుల రంగప్రవేశం
సమాచారం అందుకున్న కొండాపురం పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్నారు. నెయ్యి కోసం ఎగబడుతున్న జనాన్ని చెదరగొట్టి, ట్రాఫిక్ ఇబ్బందులు కలగకుండా చర్యలు చేపట్టారు. ఎస్‌ఐ జయరాములు తెలిపిన వివరాల ప్రకారం.. ఘటనపై కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నామన్నారు. తిరుమలకు వెళ్లాల్సిన నెయ్యి ఇలా రోడ్డు పాలు కావడం భక్తులలో చర్చనీయాంశంగా మారింది.
Read More
Next Story