
పోలవరంలోకి పులి ఎంట్రీ..రంగంలోకి హనుమాన్ బృందాలు
పులి వెళ్లిన దారిలోనే మళ్లీ వెనక్కి వచ్చినట్లు పాదముద్రల ద్వారా గుర్తించారు.
గత కొన్ని రోజులుగా కాకినాడ జిల్లా ప్రజలను హడలెత్తించిన పెద్దపులి, ఇప్పుడు తన దిశను మార్చుకుని పోలవరం జిల్లాలోకి ప్రవేశించింది. ప్రత్తిపాడు మండలం బాపన్నదొర కొండల మీదుగా ప్రయాణించిన పులి, రాజవొమ్మంగి మండలం ఉర్లాకులపాడు ప్రాంతానికి చేరుకున్నట్లు అటవీశాఖ అధికారులు ధృవీకరించారు. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, పులి వెళ్లిన దారిలోనే మళ్లీ వెనక్కి వచ్చినట్లు పాదముద్రల ద్వారా గుర్తించారు.
అప్రమత్తంగా ఉండాల్సిన గ్రామాలు ఇవే..
పులి సంచారం నేపథ్యంలో రాజవొమ్మంగి, అడ్డతీగల మండలాల్లోని పలు గ్రామాల ప్రజలను అటవీశాఖ హెచ్చరించింది. మరి ముఖ్యంగా.. ఉర్లాకులపాడు, కోసూరివారి వీధి, జి.శరభవరం, వెంకట్ నగర్, మద్దిబందల, లోతావారి వీధి, చికిలింత, దుర్గానగర్, పెద గర్రంగి, చిన గర్రంగి, చెరువుకొమ్ముపాలెం, సంజీవ్‌నగర్, బోర్నగూడెం, కొట్టంపాలెం, మిరియాల వారి వీధి, గవరయ్యపేట గ్రామాల ప్రజలు రాత్రి సమయాల్లో బయటకు రావొద్దని, పశువుల కాపరులు అడవి ప్రాంతానికి వెళ్లవద్దని అధికారులు సూచించారు.
రంగంలోకి హనుమాన్ బృందాలు
పులి కదలికలను నిశితంగా పర్యవేక్షించేందుకు పోలవరం డీఎఫ్‌వో శివకుమార్ నేతృత్వంలో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. పులిని ట్రాక్ చేయడంలో ఆరితేరిన హనుమాన్ బృందాలు రంగంలోకి దిగాయి. ఆధునిక సాంకేతికతతో పాటు పులి పాదముద్రల ఆధారంగా అది ఏ దిశగా వెళ్తోందో ఈ బృందాలు నిరంతరం గాలిస్తున్నాయి.
అటవీశాఖ విన్నపం
పులి భయంతో ప్రజలు ఆందోళన చెందవద్దని, అయితే అప్రమత్తత తప్పనిసరని అధికారులు కోరుతున్నారు. పులి ఎక్కడైనా కనిపిస్తే వెంటనే అటవీశాఖ సిబ్బందికి సమాచారం అందించాలని, స్వయంగా దానిని పట్టుకోవడానికి ప్రయత్నించి ప్రాణాపాయం కొనితెచ్చుకోవద్దని హెచ్చరించారు.
Next Story

