
ప్రతీకాత్మక చిత్రం
అదిగో పులి, కొయ్యలగూడెం ఏజెన్సీని వణికిస్తున్న టైగర్
కొయ్యలగూడెం పులి మళ్లీ తప్పించుకుంది. ఎటు పోయిందో… ఏం చేస్తుందో!
కొయ్యలగూడెం డిప్పకాయలపాడు మొక్కజొన్న తోటలో కనిపించిన పులి బిల్లిమిల్లి–మర్రిగూడెం వైపు కదిలింది. Eluru Agency tiger movementపై అటవీశాఖ డ్రోన్ గాలింపు కొనసాగిస్తోంది.
పులిని పట్టుకునేందుకు ప్రయత్నం చేస్తున్నట్టున్న ప్రతీకాత్మక చిత్రం
ఏలూరు జిల్లా ఏజెన్సీ ప్రాంతంలో పులి కదలికలు జనాన్ని ఉలిక్కిపడేలా చేస్తున్నాయి. కొయ్యలగూడెం మండలం డిప్పకాయలపాడు గ్రామంలో ఆదివారం ఓ రైతుకు చెందిన మొక్కజొన్న తోటలో పులి తిష్ఠ వేసిన ఘటన తీవ్ర కలకలం రేపింది. సమాచారం అందగానే అటవీశాఖ అధికారులు అప్రమత్తమయ్యారు.
పులి కదలికలను నిశితంగా గమనించేందుకు మొక్కజొన్న తోట చుట్టూ ట్రాప్ కెమెరాలను ఏర్పాటు చేశారు. పులిని బంధించేందుకు నాలువైపులా బోన్లను సిద్ధం చేశారు. ఈ ఏర్పాట్లతో పులి త్వరలోనే చిక్కుతుందనే ఆశలు వ్యక్తమయ్యాయి.
అయితే సోమవారం ఉదయానికి పరిస్థితి ఒక్కసారిగా మారిపోయింది. సోమవారం సాయంత్రం వరకు మొక్కజొన్న తోటలోనే ఉన్న పులి, ఆ తర్వాత అక్కడి నుంచి బిల్లిమిల్లి, మర్రిగూడెం గ్రామాల వైపు కదిలినట్టు అడుగు జాడల ఆధారంగా అటవీ అధికారులు గుర్తించారు. దీంతో పులి ఎటు వెళ్లిందన్న అంశంపై స్పష్టత లేకపోవడంతో స్థానికుల్లో ఆందోళన మరింత పెరిగింది.
పులి కదలికల నేపథ్యంలో ఆయా గ్రామాల రైతులు ముందస్తు జాగ్రత్తలు తీసుకున్నారు. పొలాల్లో ఉన్న పశువులను ఇళ్లకు తరలించారు. రాత్రి వేళల్లో బయటకు రావద్దని గ్రామస్థులు నిర్ణయించుకున్నారు. అటవీశాఖ సూచనలను పాటిస్తూ అప్రమత్తంగా ఉన్నారు. ఈ చర్యల వల్ల సోమవారం రాత్రి వరకు పులి కారణంగా ఎక్కడా ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు.
ఇదిలా ఉండగా పులి ఆచూకీని ఖచ్చితంగా గుర్తించేందుకు అటవీశాఖ అధికారులు డ్రోన్ కెమెరాలతో గాలింపు చర్యలను ముమ్మరం చేశారు. ట్రాప్ కెమెరాల నుంచి వచ్చే సమాచారం ఆధారంగా పులి కదలికలను మ్యాప్ చేస్తూ, జనావాసాల వైపు రాకుండా చర్యలు చేపడుతున్నట్టు అధికారులు తెలిపారు. అవసరమైతే ప్రత్యేక బృందాలతో పులిని బంధించి సురక్షిత ప్రాంతానికి తరలిస్తామని వెల్లడించారు.
ఎటుచూసినా టెన్షన్, టెన్షన్
ప్రస్తుతం కొయ్యలగూడెం, బిల్లిమిల్లి, మర్రిగూడెం పరిసర గ్రామాల్లో ఉద్విగ్న వాతావరణం నెలకొంది. పులి ఎక్కడ ఉందన్నదానిపై స్పష్టత వచ్చే వరకు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ఒంటరిగా అడవులు లేదా పొలాల వైపు వెళ్లవద్దని అటవీశాఖ మరోసారి హెచ్చరికలు జారీ చేసింది.
పులి కదలికలపై తాజా సమాచారం కోసం ఏజెన్సీ ప్రాంతం మొత్తం ఉత్కంఠతో ఎదురుచూస్తోంది.
Next Story

