
ఆ పెద్దపులే రంపచోడవరంలో రంకెలేస్తోంది!
పోలవరం జిల్లాలో మరోసారి పులి సంచారం కలకలం రేపుతోంది
పోలవరం జిల్లాలో మరోసారి పులి సంచారం కలకలం రేపుతోంది. రంపచోడవరం మండలం అటవీ ప్రాంతంలో పెద్దపులి తిరుగుతున్నట్లు అటవీశాఖ అధికారులు గుర్తించారు. గ్రామాల సరిహద్దుల్లో పులి జాడలు కనిపించడంతో స్థానికుల్లో ఆందోళన నెలకొంది.
పాపికొండల నుంచి మళ్లీ బయటకు?
ఇటీవల ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో సంచరించిన ఇదే పులిని అటవీ అధికారులు బంధించి విశాఖపట్నం జూకు తరలించారు. చికిత్స అనంతరం ప్రత్యేక కమిటీ సూచనల మేరకు పాపికొండలు అభయారణ్యంలో వదిలిపెట్టారు. అయితే విడుదలైన ఈ పులే మళ్లీ అటవీ అంచులకు చేరిందా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
మారేడుమిల్లి నుంచి రంపచోడవరం వైపు..
గత రెండు రోజులుగా మారేడుమిల్లి మండలం పరిధిలోని కాకవాడ, దారగూడెం, నూరుపూడి, సీమగండి, రామన్నవలస, తుర్రూరు, దేవరపల్లి, సున్నంపాడు గ్రామాల అటవీ అంచుల్లో పులి సంచరించినట్లు సమాచారం. ప్రస్తుతం రంపచోడవరం మండలంలోని గెద్దాడ, చిలకమామిడి, బూసిగూడెం ప్రాంతాల్లో తిరుగుతున్నట్టు అధికారులు వెల్లడించారు.
పులి కదలికలపై ప్రత్యేక బృందాలు నిఘా పెట్టాయి. అవసరమైతే మళ్లీ బంధించే చర్యలు చేపడతామని అధికారులు తెలిపారు. గ్రామస్తులు రాత్రి వేళల్లో బయటకు వెళ్లకూడదని, పశువులను అడవి అంచులకు వదలవద్దని హెచ్చరికలు జారీ చేశారు.
గ్రామాల్లో భయాందోళనలు నెలకొన్నప్పటికీ పరిస్థితిని నియంత్రణలో ఉంచేందుకు అటవీశాఖ చర్యలు కొనసాగుతున్నాయి.

