కాకినాడ జిల్లాను వదలని పులి భయం
x

కాకినాడ జిల్లాను వదలని పులి భయం

రాజవొమ్మంగి నుంచి ప్రత్తిపాడుకు మృగరాజు మకాం.


కాకినాడ జిల్లా వాసులకు పులి భయం వదలడం లేదు. ఒక ప్రాంతం నుంచి పులి వెళ్ళిపోయిందని ఊపిరి పీల్చుకునేలోపే, మరో మండలంలో ప్రత్యక్షమవుతూ జనాన్ని బెంబేలెత్తిస్తోంది. కొద్దిరోజులుగా పోలవరం జిల్లా రాజవొమ్మంగి పరిసరాల్లో హల్‌చల్ చేసిన పెద్దపులి, ఇప్పుడు మళ్ళీ కాకినాడ జిల్లా ప్రత్తిపాడు మండలంలోకి ప్రవేశించడంతో జిల్లా యంత్రాంగం ఉలిక్కిపడింది.

దారపల్లి అడవుల్లో రాయల్ ఎంట్రీ

గత కొంతకాలంగా అటవీ సరిహద్దుల వెంబడి దోబూచులాడుతున్న పెద్దపులి, బుధవారం నాటికి ప్రత్తిపాడు మండలంలోని దారపల్లి అటవీ ప్రాంతంలో అడుగుపెట్టింది. అటవీ శాఖ అధికారులు ఈ ప్రాంతంలో పులి కదలికలను స్పష్టంగా గుర్తించారు. అటవీ ప్రాంతం నుంచి జనారణ్యం వైపు పులి అడుగులు పడుతుండటంతో, సమీప గ్రామాల ప్రజలు పొలాలకు వెళ్లాలంటేనే వెన్నులో వణుకు పుడుతోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ఎటువైపు ఈ ప్రయాణం? అధికారుల్లో ఉత్కంఠ

ప్రస్తుతం దారపల్లి పరిసరాల్లో తిష్టవేసిన ఈ పులి తదుపరి గమ్యం ఎటువైపు ఉంటుందనేది ఇప్పుడు అటవీ శాఖకు సవాల్‌గా మారింది. ఇది ప్రత్తిపాడు, శంఖవరం మండలాల్లోనే సంచరిస్తుందా? లేక మెల్లగా సరిహద్దులు దాటి అనకాపల్లి జిల్లా వైపు తన మకాం మారుస్తుందా? అన్న దానిపై అటవీ నిపుణుల బృందాలు డేగకన్నుతో నిఘా పెట్టాయి. పులి ప్రయాణించే మార్గాలను బట్టి ట్రాప్ కెమెరాలను ఏర్పాటు చేసి, ప్రతి కదలికను పర్యవేక్షిస్తున్నారు.

గ్రామాల్లో హై అలర్ట్.. అధికారుల హెచ్చరిక

పెద్దపులి సంచారంతో ప్రత్తిపాడు మండలంలోని అటవీ గ్రామాల్లో అధికారులు హై అలర్ట్ ప్రకటించారు. దారపల్లి, ప్రత్తిపాడు పరిసర ప్రాంతాల ప్రజలు రాత్రి వేళల్లో బయటకు రావొద్దని, ఒంటరిగా అటవీ ప్రాంతాలకు వెళ్లొద్దని మైకుల ద్వారా హెచ్చరికలు జారీ చేశారు. పశువుల కాపరులు అప్రమత్తంగా ఉండాలని, పశువులను ఊరి బయట వదిలేయకుండా సురక్షితంగా ఉంచాలని సూచించారు.

కంటిమీద కునుకు లేదు

అటు పోలవరం జిల్లా, ఇటు కాకినాడ జిల్లా అధికారులకు ఈ పెద్దపులి కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. ఒక జిల్లా నుంచి మరో జిల్లాకు చాప కింద నీరులా మారుతున్న పులి స్థావరాలు అటవీ శాఖను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. అటవీ నిపుణుల బృందాలు రంగంలోకి దిగి, పులిని సురక్షితంగా అడవిలోకి పంపేందుకు లేదా బంధించేందుకు ప్రయత్నాలను ముమ్మరం చేశాయి.

Read More
Next Story