రాజమండ్రిలో ’పులి‘ పంజా..మూడు మండలాల్లో స్కూళ్లకు సెలవు
x

రాజమండ్రిలో ’పులి‘ పంజా..మూడు మండలాల్లో స్కూళ్లకు సెలవు

ప్రజలు ఎవరూ ఒంటరిగా పొలాలకు వెళ్లవద్దని అధికారులు విజ్ఞప్తి చేస్తున్నారు.


గోదావరి తీర ప్రాంత ప్రజలకు పులి భయం పట్టుకుంది. రాజమహేంద్రవరం రూరల్ మండలం తొర్రేడు (Torredu) గ్రామ సమీపంలోని అరటి, మొక్కజొన్న తోటల్లో పెద్దపులి (Royal Bengal Tiger) సంచరిస్తున్నట్లు అటవీ శాఖ అధికారులు ధృవీకరించడంతో స్థానికులు హడలెత్తిపోతున్నారు. ఆదివారం తెల్లవారుజామున ఈ మృగరాజు జనావాసాలకు అతి సమీపంలో పంజా విసిరి పశువులను పొట్టనబెట్టుకోవడంతో.. ఎప్పుడు, ఎటు వైపు నుంచి వచ్చి దాడి చేస్తుందోనని గ్రామస్తులు కంటిమీద కునుకు లేకుండా గడుపుతున్నారు. పులి సంచారంతో అటు అటవీ శాఖ, ఇటు పోలీస్ యంత్రాంగం హై అలర్ట్ (High Alert) ప్రకటించాయి.

ఏం జరిగింది?

తొర్రేడు గ్రామ శివార్లలో ఆదివారం తెల్లవారుజామున ఒక్కసారిగా చోటుచేసుకున్న ఈ పరిణామం స్థానికులను ఉలిక్కిపడేలా చేసింది. అటవీ ప్రాంతం నుంచి జనారణ్యంలోకి ప్రవేశించిన పెద్దపులి, గ్రామ సమీపంలోని పశువుల మందపై పంజా విసిరింది. ఈ దాడిలో ఒక ఎద్దుతో పాటు రెండు ఆవులు మృత్యువాత పడగా, వాటి కళేబరాలను పులి సమీపంలోని దట్టమైన తోటల్లోకి లాక్కెళ్లడం ఆ మృగరాజు పాశవిక బలానికి నిదర్శనంగా నిలిచింది.

మరో వైపు ఘటనా స్థలానికి చేరుకున్న అటవీ శాఖ రేంజ్ ఆఫీసర్ డేవిడ్ రాజు నేతృత్వంలోని బృందం, అక్కడ లభ్యమైన భారీ పాదముద్రలను (Pugmarks) పరిశీలించి అది పెద్దపులి సంచారమేనని నిర్ధారించింది. అయితే ఈ పులి ఎక్కడి నుంచి వచ్చిందనే అంశంపై అధికారులు ఒక ఆసక్తికరమైన అంచనాకు వచ్చారు. పొరుగు రాష్ట్రమైన ఛత్తీస్‌గఢ్ లేదా మహారాష్ట్రలోని ప్రసిద్ధ తడోబా (Tadoba) టైగర్ రిజర్వ్ నుంచి తనకంటూ ఒక ప్రత్యేక సామ్రాజ్యాన్ని ఏర్పాటు చేసుకునే క్రమంలో, వందల కిలోమీటర్లు ప్రయాణించి ఈ ప్రాంతానికి చేరుకుని ఉండవచ్చని అధికారులు భావిస్తున్నారు.

పులి ప్రయాణం.. ఒక మిస్టరీ

ఈ పెద్దపులి ప్రయాణం అటవీ అధికారులను సైతం విస్మయానికి గురిచేస్తోంది. గత నెలలో ఏలూరు జిల్లాలోని బుట్టాయగూడెం, పోలవరం మండలాల్లోని అటవీ గ్రామాలను గజగజలాడించిన ఈ మృగరాజు, జనవరి 29న పాపికొండలు నేషనల్ పార్క్ వైపు వెళ్లిపోయిందని అంతా భావించారు. కానీ, అందరి అంచనాలను తలకిందులు చేస్తూ, ఊహించని విధంగా ఉగ్రరూపంలో ఉన్న గోదావరి నదిని ఈదుకుంటూ దాటి, ఇప్పుడు రాజమహేంద్రవరం రూరల్ ప్రాంతంలో ప్రత్యక్షమైంది. నిరంతరం తన ఉనికిని మారుస్తూ, ఎక్కడా స్థిరంగా ఉండకుండా కిలోమీటర్ల మేర ప్రయాణిస్తున్న ఈ పులి, తదుపరి అడుగు ఎటు వేస్తుందో అంచనా వేయడం అటవీ శాఖకు పెను సవాలుగా మారింది.

యుద్ధ ప్రాతిపదికన ఆపరేషన్ టైగర్

పులి సంచారం ఖరారు కావడంతో అధికార యంత్రాంగం యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపట్టింది. స్కూళ్లకు సెలవు ప్రకటించిారు. విద్యార్థుల భద్రత దృష్ట్యా రాజమహేంద్రవరం రూరల్, కోరుకొండ, సీతానగరం మండలాల్లోని అన్ని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలకు డీఈవో (DEO) సోమవారం సెలవు ప్రకటించారు. ట్రాప్ కెమెరాలు ఏర్పాటు చేశారు. పులిని బంధించేందుకు తొర్రేడు తోటల్లో ప్రత్యేక పులిబోన్లు, 15కు పైగా ట్రాప్ కెమెరాలను, డ్రోన్లను ఏర్పాటు చేశారు. పర్యాటకులకు నో ఎంట్రీ అని చెబుతున్నారు. పోలవరం జిల్లా దేవీపట్నం మండలంలోని ప్రజలతో పాటు పర్యాటకులను అధికారులు అప్రమత్తం చేశారు. రాత్రి సమయాల్లో బయటకు రావద్దని హెచ్చరించారు. ప్రస్తుతం పులి తొర్రేడు పరిసర తోటల్లోనే నక్కి ఉన్నట్లు భావిస్తున్న అటవీ అధికారులు, నైట్ విజన్ డ్రోన్ కెమెరాల సాయంతో నిరంతర నిఘా ఉంచారు. ప్రజలు ఎవరూ ఒంటరిగా పొలాలకు వెళ్లవద్దని, అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దని అధికారులు విజ్ఞప్తి చేస్తున్నారు.

Read More
Next Story