
ఏపీకి పిడుగుల ముప్పు..రానున్న 3 రోజులు భారీ వర్షాలు
విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరిక.
వాతావరణంలో చోటుచేసుకున్న ఉపరితల ఆవర్తనం, ద్రోణి ప్రభావంతో ఆంధ్రప్రదేశ్‌లో రాగల మూడు రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ ప్రఖర్ జైన్ వెల్లడించారు. ముఖ్యంగా ఉరుములు, మెరుపులతో పాటు పిడుగులు పడే ప్రమాదం ఎక్కువగా ఉన్నందున ప్రజలు అత్యంత అప్రమత్తంగా ఉండాలని ఆయన సూచించారు.
రానున్న మూడు రోజుల వాతావరణ అంచనా
రాష్ట్రవ్యాప్తంగా వాతావరణ పరిస్థితులు మారుతున్న నేపథ్యంలో విపత్తుల నిర్వహణ సంస్థ జిల్లాల వారీగా అంచనాలను వెల్లడించింది. ఈరోజు రాత్రికి కోనసీమ, పశ్చిమగోదావరి, కృష్ణా, గుంటూరు, బాపట్ల జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఇక రేపు (శుక్రవారం) రాష్ట్రవ్యాప్తంగా విస్తారంగా ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు పడతాయని, పిడుగుల తీవ్రత అధికంగా ఉంటుందని అధికారులు తెలిపారు. ఎల్లుండి (శనివారం) , ఆదివారం ఉత్తరాంధ్ర, కోస్తా జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొన్నారు.
రైతులకు కీలక సూచనలు
అకాల వర్షాల నేపథ్యంలో అన్నదాతలు తమ పంటను కాపాడుకోవాలని అధికారులు కోరారు. ముఖ్యంగా మినుము, మిరప, పసుపు వంటి వాణిజ్య పంటలు తడవకుండా జాగ్రత్త పడాలని, కోసిన పంటను సురక్షిత ప్రాంతాలకు తరలించుకోవాలని సూచించారు. కల్లాల్లో ఉన్న ధాన్యం లేదా ఇతర వ్యవసాయ ఉత్పత్తులపై టార్పాలిన్ కవర్లు కప్పి ఉంచడం ద్వారా నష్టాన్ని నివారించవచ్చని తెలిపారు.
ప్రజలకు ముందస్తు జాగ్రత్తలు
ప్రజలు పిడుగుల బారిన పడకుండా ఉండటానికి విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ ప్రఖర్ జైన్ పలు సూచనలు చేశారు. ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం పడే సమయంలో పొరపాటున కూడా చెట్ల కింద నిలబడకూడదని హెచ్చరించారు. బహిరంగ ప్రదేశాల్లో ఉండేవారు, పొలాల్లో పనిచేసే వారు వాతావరణం మారగానే వెంటనే సురక్షితమైన పక్కా భవనాల్లోకి వెళ్లాలని విజ్ఞప్తి చేశారు. విద్యుత్ స్తంభాలు, తీగలకు దూరంగా ఉండాలని కోరారు.
Next Story

