బెంగళూరులో హోటళ్లకు బాంబు బెదిరింపులు..
కొంతకాలంగా దేశవ్యాప్తంగా బాంబు బెదిరింపుల సంఘటనలు వెలుగుచూస్తున్నాయి. కొన్ని ప్రాంతాల్లో హోటళ్లకు బెదిరింపులు వస్తే మరికొన్ని ప్రాంతాల్లో స్కూళ్లకు కూడా..
కొంతకాలంగా దేశవ్యాప్తంగా బాంబు బెదిరింపుల సంఘటనలు వెలుగుచూస్తున్నాయి. కొన్ని ప్రాంతాల్లో హోటళ్లకు బెదిరింపులు వస్తే మరికొన్ని ప్రాంతాల్లో స్కూళ్లకు బెదిరింపులు వస్తున్నాయి. ఇంకా కొన్ని రాష్ట్రాల్లో అయితే ప్రముఖ వ్యక్తులకు బాంబు బెదిరింపులు వస్తున్నాయి. వీటిపైన పోలీసులు దర్యాప్తులు చేపట్టడం ప్రత్యేక బృందాలు రంగంలోకి దిగడం తీరా దర్యాప్తు పూర్తి చేసి ఇదంతా బూటకమని అధికారులు తేల్చడం మనం చూస్తూనే ఉన్నాం. అయితే తాజాగా బెంగళూరులోని మూడు ప్రముఖ హోటళ్లకు ఇటువంటి హెచ్చరికలే వచ్చాయి. ఆ హోటళ్లను బాంబు పెట్టి పేల్చేస్తామని వార్నింగ్ వచ్చింది. ఆ హోటళ్లలో ఒటెర్రా వంటి ఫైవ్ స్టార్ హోటళ్లు ఉన్నాయి. ఈ మేరకు సమాచారం తెలియడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు.
మెయిల్ ద్వారా హెచ్చరికలు
ఈ హోటళ్లకు వచ్చిన బెదిరింపు కూడా ఇది వరకు సంఘటనల మాదిరిగానే ఇందులో కూడా ఈ హోటళ్లకు ఈమెయిల్ ద్వారా బెదిరింపు వచ్చాయి. రంగంలోకి దిగిన పోలీసులు, బాంబు డిస్పోజల్ స్క్వాడ్ అధికారులు మూడు హోటళ్లను జల్లెడ పట్టారు. అంతా వెతికినా వారికి ఏమీ దొరకలేదు. దీంతో దీనిని కూడా బూటకపు బెదిరింపుగానే పోలీసులు కొట్టిపారేశారు. రామేశ్వరం కెఫెలో జరిగిన బాంబు పేలుడు తర్వాత నగరంలోని భద్రతా బలగాలు అప్రమత్తం అయ్యాయి. ఏమాత్రం సమాచారం వచ్చినా వెంటనే అక్కడకు ఆగమేఘాలపై చేరుకుని తనిఖీలు చేసేస్తున్నాయి.
రామేశ్వరం ఘటన తర్వాత బెంగళూరు నగరంలో భద్రత కూడా మూడంచెలు అధికం అయింది. ఎక్కడ ఏం జరిగినా పోలీసులకు వెంటనే సమాచారం అందుతోంది. దానికి తగినట్లుగా పోలీసులు చర్యలు తీసుకుంటున్నారు. అందులో భాగంగానే బాంబు బెదిరింపు వచ్చింది అనగానే వారు బాంబు స్క్వాడ్‌తో చేరుకుని తనిఖీలు చేపట్టి ఆ విషయంలో ఒక క్లారిటీకి వచ్చేస్తున్నారు.
బెదిరింపుల పరంపర
కొన్ని వారాలుగా బెంగళూరు, ఢిల్లీ ఎన్‌సీఆర్, ఉత్తర్ ప్రదేశ్‌లోని అనేక స్కూళ్లకు ఇటువంటి బూటకపు బాంబు బెదిరింపులు వచ్చాయి. మే 22 బుధవారం రోజున కేంద్ర హోంశాఖ మంత్రిత్వశాఖ నార్త్ బ్లాక్‌కు కూడా ఇటువంటి బాంబు బెదిరింపే వచ్చింది. వరుసగా వస్తున్న ఈ బూటకపు ఈమెయిల్స్‌పై భద్రతా బలగాలు దృష్టి సారించాయి. వీటి వెనక ఎవరున్నారు? ఎందుకు ఇలా చేస్తున్నారు? అన్న కోణాల్లో వారు దర్యాప్తు ప్రారంభించారు.
స్పందించిన హైకోర్టు
ఈ బెదిరింపులపై ఢిల్లీ హైకోర్టు కూడా స్పందించింది. ఈ బెదిరింపులకు సంబంధించి పూర్తిస్థాయి రిపోర్ట్‌ను తమకు అందించాలని పోలీసులకు ఉత్తర్వులు జారీ చేసింది. కోర్టు ఉత్తర్వుల మేరకు పోలీసులు తమ రిపోర్ట్‌ను న్యాయస్థానానికి అందించారు. వారి రిపోర్ట్‌లో దేశ వ్యాప్తంగా తాము 18 బాంబు డిటెక్షన్ బృందాలు, 5 బాంబు డిస్పోజల్ బృందాలను ఏర్పాటు చేసినట్లు వివరించారు. అంతేకాకుండా ఈ బెదిరింపు మెసేజ్‌లు అన్నీ కూడా వీపీఎన్‌ల సహాయంతో పంపబడ్డాయని తేలిసింది. ఈ నేపథ్యంలోనే వీటి వెనకున్న వారిని కనిపెట్టడానికి మన దేశ పోలీసులు.. పలు ఇతర దేశాలతో కలిసి పనిచేస్తున్నారు.