కోడి పందాల్లో గెలిచిన బుల్లెట్ ఇదే
x

కోడి పందాల్లో గెలిచిన బుల్లెట్ ఇదే

కేవలం రూ. 500 పెట్టుబడితో ఆయన ఏకంగా రూ. 2.50 లక్షల విలువైన ’బుల్లెట్‘ వాహనాన్ని తన సొంతం చేసుకుని అందరినీ ఆశ్చర్యపరిచాడు.


సాధారణంగా కోడి పందేల బరిలో పందెం కాస్తే.. గెలిచిన కోడితో పాటు కొంత నగదు చేతికి వస్తుంది. కానీ, మచిలీపట్నం మంగినపూడి బరిలో మాత్రం సీన్ తిరగబడింది. అక్కడ పుంజులు కొట్టుకున్నాయి కానీ.. అదృష్టం మాత్రం ఒక సామాన్యుడిని వరించింది. కేవలం రూ. 500 పెట్టుబడితో ఆయన ఏకంగా రూ. 2.50 లక్షల విలువైన ’బుల్లెట్‘ వాహనాన్ని తన సొంతం చేసుకుని, ఇంటికి తీసుకెళ్లి అందరినీ ఆశ్చర్యపరిచాడు.

వివరాల్లోకి వెళ్తే..
సంక్రాంతి పండుగను పురస్కరించుకుని కృష్ణా జిల్లా మచిలీపట్నంలోని మంగినపూడి బీచ్ రోడ్డులో మూడు రోజుల పాటు కోడి పందేలు అట్టహాసంగా సాగాయి. అయితే.. ఈసారి నిర్వాహకులు పందేలకు అదనపు ఆకర్షణను జోడిస్తూ వీక్షకుల కోసం ప్రత్యేకంగా ’లక్కీ డ్రా‘ను ఏర్పాటు చేశారు. పందేలు చూడటానికి వచ్చిన సందర్శకులు, పందెందారుల ఉత్సాహాన్ని రెట్టింపు చేసేందుకు ఒక్కో కూపన్‌ను రూ. 500 చొప్పున విక్రయించారు. తక్కువ ధరకే భారీ బహుమతులు గెలుచుకునే అవకాశం ఉండటంతో జనం కూపన్లు కొనేందుకు పోటీ పడ్డారు.
పందేల చివరి రోజైన ముగింపు వేళ.. అందరి కళ్లూ ఆ డ్రా బాక్సుపైనే నిలిచాయి. నిర్వాహకులు వందలాది మంది సాక్షిగా, అత్యంత పారదర్శకంగా విజేతలను ఎంపిక చేసేందుకు డ్రా తీశారు. అందరి ఉత్కంఠకు తెరదించుతూ మొదటి బహుమతిగా ప్రకటించిన రూ. 2.50 లక్షల విలువైన రాయల్ ఎన్ఫీల్డ్ బుల్లెట్ బైక్ విజేతగా ఆకుల సతీష్ నిలిచారు. కేవలం రూ. 500లతో ఆయనకు అంత పెద్ద బహుమతి రావడంతో అక్కడి వారంతా ఆశ్చర్యపోయారు. ఆయనతో పాటు మరో నలుగురిని కూడా విజేతలుగా ఎంపిక చేసి, రెండో బహుమతిగా డబుల్ డోర్ ఫ్రిజ్‌తో పాటు ఇతర విలువైన బహుమతులను పంపిణీ చేయడంతో పందేల బరిలో అదృష్ట దేవత సందడి నెలకొంది.
అదృష్టవంతుడు సతీష్.. బుల్లెట్ వేగంతో వచ్చిన అదృష్టం
ఈ లక్కీ డ్రాలో అందరి చూపు మొదటి బహుమతి మీదే నిలిచాయి. సుమారు రూ. 2.50 లక్షల విలువైన రాయల్ ఎన్ఫీల్డ్ బుల్లెట్ బైక్.. మచిలీపట్నానికి చెందిన ఆకుల సతీష్‌కు దక్కిందనే అనౌన్స్‌మెంట్ రాగానే సతీష్ ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. కేవలం రూ. 500లతో కొన్న చిన్న కూపన్, ఇంతటి భారీ వాహనాన్ని బహుమతిగా తెచ్చిపెడుతుందని ఆయన కలలో కూడా ఊహించలేదు. 2026 సంక్రాంతి సతీష్ జీవితంలో ఎప్పటికీ గుర్తుండిపోయే ’తీపి జ్ఞాపకం‘గా మారిపోయింది.
అదృష్టం కేవలం సతీష్‌నే కాదు.. మరికొందరిని కూడా వరించింది. సెకండ్ లక్కీ డ్రా విజేతకు ఖరీదైన డబుల్ డోర్ ఫ్రిజ్‌ను అందజేశారు. ఇలా మొత్తం ఐదుగురు విజేతలను ఎంపిక చేసిన నిర్వాహకులు, వారికి వరుసగా విలువైన బహుమతులను పంపిణీ చేశారు. సాధారణంగా కోడి పందేల బరిలో పందెం కాసిన వారు గెలుపోటములతో ఇంటికి వెళ్తారు. కానీ, ఇక్కడ మాత్రం పందెంతో సంబంధం లేకుండా, కేవలం అదృష్టంతో భారీ బహుమతులు దక్కడంతో బరి వద్ద పండుగ వాతావరణం నెలకొంది. ప్రస్తుతం మచిలీపట్నం గల్లీల్లో ఎక్కడ విన్నా ’సతీష్ కొట్టిన బుల్లెట్ షాట్‘ గురించే చర్చ జరుగుతోంది. ఈ ’లక్కీ కిక్కు‘ ఇప్పుడు సోషల్ మీడియాలోనూ తెగ వైరల్ అవుతోంది.
Read More
Next Story